Share News

Amaravati : సమాచార హక్కు... తుక్కు!

ABN , Publish Date - Aug 16 , 2024 | 03:49 AM

‘ఒక్కసారి చెబితే... వందసార్లు చెప్పినట్లే’ అన్నది సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ‘బాషా’లోని ఓ ఫేమస్‌ డైలాగ్‌. ‘వంద మంది ఆర్టీఐ దరఖాస్తులు పెట్టుకున్నా... ఒక్కదానికీ జవాబు చెప్పం’ అన్నది రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్‌ బాషా తీరు! వైసీపీ హయాంలో ‘సమాచార హక్కు చట్టం’ ఉండీ లేనట్లుగా తయారైంది.

Amaravati : సమాచార హక్కు... తుక్కు!

  • 9వేలకుపైగా కేసులు పెండింగ్‌

  • సీఐసీ బాషా నేతృత్వంలో పడకేసిన కమిషన్‌

  • సొంత పత్రిక ఉద్యోగికి జగన్‌ అందలం

  • ప్రజల వ్యక్తిగత సమాచారం వెబ్‌సైట్‌లో!

  • నెలకు ఆరు తీర్పులతో బాషా ‘రికార్డు’

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌ ఉన్నా లేనట్లుగా తయారైంది. ప్రస్తుతం కమిషన్‌లో 9000కుపైగా దరఖాస్తులు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం... చీఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ కమిషనర్‌ (సీఐసీ) బాషా తీరే అనే విమర్శలున్నాయి.

ఆర్‌టీఐ గురించి ప్రజల్లో, ప్రభుత్వాధికారుల్లోనూ అవగాహన పెంచాలని... అందుకోసం కమిషనర్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని చట్టం చెబుతోంది. కానీ... ‘మీరెవరూ కార్యాలయం దాటి బయటికి వెళ్లొద్దు’ అని సీఐసీ బాషా హుకుం జారీ చేశారు. ఇలాంటి మరెన్నో అసంబద్ధ నిర్ణయాల కారణంగా రాష్ట్ర సమాచార కమిషన్‌ అచేతనావస్థలో పడిపోయింది.

గత రెండేళ్లలో ఒకరిద్దరు కమిషనర్లు మాత్రం సీఐసీ ఆదేశాలను సైతం కాదని క్షేత్రస్థాయిలో ఆర్టీఐ అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించారు. ఇది మినహాయిస్తే... రాష్ట్రంలో ఈ చట్టం అమలు దాదాపుగా పడకేసినట్లే!

సమాచార హక్కు స్ఫూర్తికి అనుగుణంగా పనిచేసి, కొన్ని నెలల క్రితం పదవీ విరమణ చేసిన కమిషనర్లకు చట్టప్రకారం అందాల్సిన బకాయిలు రాకుండా, ఆర్జిత సెలవు (ఈఎల్‌) దరఖాస్తులను కూడా బాషా తొక్కిపెట్టారని తెలుస్తోంది. తమ ఈఎల్‌ ప్రొసీడింగ్స్‌ను ప్రభుత్వానికి పంపించకుండా సీఐసీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్న విషయాన్ని ఆ కమిషనర్లు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.


‘ఒక్కసారి చెబితే... వందసార్లు చెప్పినట్లే’ అన్నది సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ‘బాషా’లోని ఓ ఫేమస్‌ డైలాగ్‌. ‘వంద మంది ఆర్టీఐ దరఖాస్తులు పెట్టుకున్నా... ఒక్కదానికీ జవాబు చెప్పం’ అన్నది రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్‌ బాషా తీరు! వైసీపీ హయాంలో ‘సమాచార హక్కు చట్టం’ ఉండీ లేనట్లుగా తయారైంది.

ప్రతిభ, సామర్థ్యంతో సంబంధంలేకుండా... తన పత్రికలో పని చేసిన ‘అనుభవం’, సొంత జిల్లా, తమ పట్ల విధేయతలే అర్హతలుగా ఆర్‌ఎం బాషాను అత్యంత కీలకమైన ఆర్టీఐ చీఫ్‌ కమిషనర్‌గా జగన్‌ నియమించారు. ఇది రాజ్యాంగబద్ధ పదవి. చీఫ్‌ కమిషనర్‌గా సమాచార హక్కును గట్టిగా నిలబెట్టాల్సిన ఆర్‌ఎం బాషా... దానిని సమూలంగా పడగొట్టడమే ఏకైక లక్ష్యంగా పని చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఇదీ కమిషన్‌ ఘనత...

రాష్ట్ర సమాచార కమిషన్‌లో వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. ప్రతి నెలా కొత్తగా వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి. కానీ... కమిషన్‌ నెలకు కనీసం 400 కేసులు కూడా పరిష్కరించలేని పరిస్థితుల్లో ఉంది. నాలుగున్నర లక్షల రూపాయల జీతభత్యాలు తీసుకునే ప్రధాన సమాచార కమిషనర్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో పరిష్కరించిన కేసులు కేవలం ఆరు.

ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి 19 నెలల సుదీర్ఘ కాలంలో ఆయన పరిష్కరించిన కేసులు సుమారు 200 మాత్రమే! బాషా సీఐసీగా రాకముందు కమిషనర్లు ఒకొక్కరు సగటున నెలకు 100 కేసులు పరిష్కరించేవారు. బాషా వచ్చాక కమిషన్‌ పని తీరు రివర్స్‌ గేర్‌లో పడింది. సహచర కమిషనర్లన్నా... మరీ ముఖ్యంగా పని చేసే వారన్నా బాషాకు అస్సలు గిట్టదని, శత్రువుల్లా చూస్తూ వేధిస్తుంటారనే ఆరోపణలున్నాయి.


దరఖాస్తుదారుల సమాచారం బజారులో...

ప్రజలకు తప్పనిసరిగా తెలియజేయాల్సిన జీవోలను కూడా వెబ్‌సైట్‌లో పెట్టకుండా జగన్‌ ప్రభుత్వం గతంలో అత్యంత గోప్యంగా పాలన సాగించింది. అదే జగన్‌ ఆశీస్సులతో సీఐసీగా నియమింతుడైన బాషాది మరో లెక్క! ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ బహిర్గత పరచరాదని సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు కూడా స్పష్టమైన తీర్పులు ఇచ్చాయి.

కానీ... ఆర్‌ఎం బాషా తీరే వేరు. ఆర్టీఐ దరఖాస్తుదారుల పాన్‌కార్డులు, ఆధార్‌కార్డులు, భూమి రిజిస్ట్రేషన్‌ పత్రాలు, సాక్షుల వేలి ముద్రలు, వారి చిరునామాలు, బ్యాంకు ఖాతాలు, ఫోన్‌ నంబర్లు... దరఖాస్తులతోపాటు ప్రజలు జతపరచిన వివరాలన్నింటినీ సీఐసీ జడ్జిమెంట్ల కింద అప్‌లోడ్‌ చేసేశారు.

తీర్పులు మాత్రమే వెబ్‌సైట్‌లో పెట్టాలని, దరఖాస్తుదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం బహిర్గతం చేయడం సరికాదని కొందరు సహ కమిషనర్లు నెత్తీనోరూ మొత్తుకొని చెప్పినా వినిపించుకోలేదు. ‘నేను తప్పు చేస్తా... మీరూ చేయాల్సిందే. లేనిపక్షంలో మీ తీర్పులను వెబ్‌సైట్‌లో పెట్టేది లేదు’ అంటూ సహ కమిషనర్లను ఆదేశించారు. ఆ తర్వాత... విషయం గ్రహించి అప్‌లోడ్‌ చేసిన డాక్యుమెంట్లన్నింటినీ ఒక్కటొక్కటిగా తొలగించడం మొదలుపెట్టారు.


కమిషనర్లతో మాటల్లేవ్‌...

ప్రస్తుతం రాష్ట్ర ఆర్టీఐ కమిషన్‌లో ఇప్పుడు ప్రధాన కమిషనర్‌ సహా అయిదుగురు కమిషనర్లు ఉన్నారు. వీరిందరినీ సమన్వయం చేయడం, తాజా కోర్టు తీర్పులపై చర్చించడం ప్రధాన కమిషనర్‌గా బాషా బాధ్యత. కానీ... ఆయన కమిషనర్లందరినీ శత్రువులుగా చూస్తారనే ఆరోపణలున్నాయి.

రెండేళ్లకుపైగా తన జమానాలో కమిషనర్లను సమావేశపరచి ఒక్కటంటే ఒక్కసారి కూడా ‘ఆర్‌టీఐ కేసులపై ఏం చేద్దాం’ అన్న విషయంపై చర్చించలేదు. పొద్దస్తమానం సీసీటీవీలో సిబ్బందిని గమనించడం తప్ప... ఆర్‌టీఐ దరఖాస్తుల పరిష్కార వేగం పెంచే ఒక్కపనీ సీఐసీ చేయడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి.

చివరికి తనను కలవడంకోసం వచ్చే కమిషనర్లను కూడా గేటు దగ్గరే నిలిపేసి, గంటలకొద్దీ వెయిటింగ్‌లో పెట్టి అవమానించిన ఉదంతాలూ ఉన్నాయి. కమిషన్‌ తాజా పరిస్థితిపై ఆర్‌టీఐ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 16 , 2024 | 03:49 AM