Share News

Amaravati : మెడ్‌టెక్‌ జోన్‌ మటాష్‌

ABN , Publish Date - Jul 09 , 2024 | 03:47 AM

రాష్ట్రానికే కాదు.. దేశానికి కూడా కీలకమైన వైద్య రంగంలో అవసరమైన అన్ని పరికరాలను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో విశాఖలో గత చంద్రబాబు సర్కారు ఏర్పాటు చేసిన మెడ్‌ టెక్‌ జోన్‌ నిర్వీర్యమైంది.

Amaravati : మెడ్‌టెక్‌ జోన్‌ మటాష్‌

  • వైసీపీ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం.. బాబు హయాంలో ఏర్పడిందన్న కారణంగా పక్కకు

  • ‘జోన్‌’ను సొంత జాగీరు చేసుకున్న ప్రైవేటు వ్యక్తి.. విశాఖ స్వామి, పూనం అండ

  • సర్కారుకు ఆదాయం శూన్యం.. మంత్రి ముందు విషయాలు దాస్తున్న అధికారులు

  • వైసీపీ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం

  • బాబు హయంలో ఏర్పడిందన్న

  • కారణంగా పక్కన పెట్టిన జగన్‌

  • ‘జోన్‌’ను సొంత జాగీరు చేసుకున్న ప్రైవేటు వ్యక్తి

  • విశాఖ స్వామి, పూనం మాలకొండయ్య అండ

  • సర్కారుకు రూ.404 కోట్లు వృథా

  • మంత్రి ముందు విషయాలు దాస్తున్న అధికారులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రానికే కాదు.. దేశానికి కూడా కీలకమైన వైద్య రంగంలో అవసరమైన అన్ని పరికరాలను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో విశాఖలో గత చంద్రబాబు సర్కారు ఏర్పాటు చేసిన మెడ్‌ టెక్‌ జోన్‌ నిర్వీర్యమైంది. వైసీపీ హయాంలో ఈ జోన్‌ను అభివృద్ధి చేయాల్సి ఉన్నా.. రాజకీయ కారణాలతో నాటి సీఎం జగన్‌ చూపిన నిర్లక్ష్యం ప్రాజెక్టును పటాపంచలు చేసింది. దాదాపు 270 ఎకరాల స్థలం. రూ.30 వేల కోట్ల పెట్టుబడులు. 25 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన లక్ష్యంతో ప్రారంభమైన ప్రాజెక్టు.. జగన్‌ జమానాలో ప్రైవేటు వ్యక్తి ఆధిపత్యానికి నలిగిపోయింది. రాష్ట్రాన్ని వైద్య రంగంలో మొదటి స్థానంలో నిలపాలన్న ఉద్దేశంతో తొమ్మిదేళ్ల కిందట అప్పటి టీడీపీ ప్రభుత్వం మెడ్‌టెక్‌జోన్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. విశాఖపట్నం లాంటి నగరంలో కొన్ని కోట్ల రూపాయిల విలువైన భూమిని ప్రాజెక్టు కోసం కేటాయించింది. తొమ్మిదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ప్రాజెక్టు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రూ.30 వేల కోట్లు కాదు.. రూ.300 కోట్లయినా పెట్టుబడులు రాలేదు. 25 వేల ఉద్యోగాలు కాదు కదా 250 మందికి కూడా ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు లేవు.

మెడ్‌టెక్‌ జోన్‌ అభివృద్ధిలో కీలకమైన బోర్డు సరిగా వ్యవహరించకపోవడంతో ప్రాజెక్టు నిర్వీర్యమైంది. బోర్డులో ఉన్న అధికారులను చూసి పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. పైగా మెడ్‌టెక్‌ జోన్‌లో మౌలిక సదుపాయాల కల్పన పేరుతో ప్రభుత్వం నుంచి రూ.కోట్లు లాగేశారు. తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రం దాదాపు రూ.404.25 కోట్ల మెడ్‌టెక్‌ జోన్‌కు కేటాయించింది. టీడీపీ ప్రభుత్వం దాదాపు రూ.311.79 కోట్లు కేటాయింది. వైసీపీ సర్కారు ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోయినా కరోనా సమయంలో దాదాపు రూ.92 కోట్లు కేటాయించింది. మరి ఈ నిధులు ఏమయ్యాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సిన బోర్డు సభ్యులు కూడా మౌనంగా ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వం నుంచి భారీ స్థాయిలో మద్దతు లభిస్తున్నప్పటికీ కంపెనీలు మాత్రం పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపడం లేదు.

ఎస్‌పీవీ కింద ఏర్పాటు

గత టీడీపీ ప్రభుత్వం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎ్‌సపీవీ) కింద మెడ్‌ టెక్‌ జోన్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీనికి ప్రభుత్వ సహకారం ఎక్కువగా ఉంటుంది. పైగా ‘మేకిన్‌ ఇండియా’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కంపెనీలకు పూర్తి మద్దతు లభిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఉన్నప్పటికీ ప్రాజెక్టు మాత్రం విఫలమైంది. బోర్డులోని ఒక కీలక వ్యక్తి మెడ్‌టెక్‌ జోన్‌ను తన సొంత జాగీరులా మార్చుకున్నారనే విమర్శలు ఉన్నాయి. తన అనుమతి లేకుండా ప్రభుత్వం ఉద్యోగులు కూడా లోపలికి వెళ్లే పరిస్థితి లేకుండా ఆంక్షలు విధించారు. చివరికి జిల్లా కలెక్టర్‌ కూడా మెడ్‌టెక్‌ జోన్‌లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆ స్థాయిలో ప్రాజెక్టును తన చేతుల్లో పెట్టుకున్నారు. ఎస్‌పీవీ ప్రాజెక్టు కాబట్టి ఏపీఐఐసీ అధికారు లు, జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో కంపెనీలతో అగ్రిమెం ట్లు జరగాల్సి ఉంటుంది. కానీ, ఈ నిబంధనలు పాటించకుండానే సదరు వ్యక్తి తన ఇష్టానుసారం ప్రాజెక్టు నిర్వహణ చేపట్టారు. వైసీపీ హయాంలో సీఎంవోలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో విధులు నిర్వహించిన పూనం మాలకొండయ్య అండదండలతోనే ప్రైవేటు వ్యక్తి దీనిని తన సొంత జాగీరుగా మార్చుకున్నారు.


కంపెనీలపై భారీ పెనాల్టీలు

మెడ్‌టెక్‌ జోన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదు. ఇలాంటి సమయంలో కంపెనీలకు ప్రయోజనాలు కల్పించి పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలి. కానీ, జోన్‌లో అంతా రివర్స్‌ పాలన జరిగింది. పెట్టుబడులు పెట్టేందుకు ముందు కు వచ్చే కంపెనీలను కాంపౌండ్‌లోకి కూడా రానివ్వకుండా అడ్డుకున్నారనే విమర్శలు వచ్చాయి. బోర్డులోని ప్రైవేటు వ్యక్తికి నచ్చి, ఆయన అంగీకరిస్తేనే జోన్‌లో పెట్టుబడులు పెట్టే స్థితిని కల్పించారు. అలా కాకుండా ఎదైనా కంపెనీ పెట్టుబడులు పెడితే భారీ పెనాల్టీలు విధించి బయటకు పంపించేస్తారు. రెండేళ్ల క్రితం ఒక మెడికల్‌ కంపెనీ దాదాపు రూ.పది నుంచి 15 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.

సదరు కంపెనీ మౌలిక సదుపాయాలు సిద్ధం చేసుకుని, సిబ్బందిని నియమించుకుని ఉత్పత్తిని ప్రారంభించే సమయంలో ప్రైవేటు వ్యక్తి నుంచి సమస్యలు ప్రారంభమయ్యాయి. సదరు వ్యక్తి రూ.15 కోట్లు పెట్టుబడి పెట్టిన కంపెనీకి రూ.33 కోట్లు పెనాల్టీ విధించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఉంటే ఉండండి లేదంటే వెళ్లిపోం డి అంటూ బెదిరింపులకు గురి చేశారు. దీంతో సదరు కంపెనీ మెడ్‌టెక్‌ జోన్‌లో ఉండలేమని వెళ్లి పోయింది. చివరికి చైనా కంపెనీలను తెచ్చారు. కాగా, చైనా కంపెనీలను దేశంలోకి అనుమతించవద్దని కేంద్ర ప్రభుత్వం 2020లో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా కంపెనీల పెట్టుబడులను సైతం నిరాకరించింది. దేశ భద్రత దృ ష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, మెడ్‌ టెక్‌ జోన్‌లోని ప్రైవేటు వ్యక్తి ఈ నిబంధనలు కూడా తోసిపుచ్చారు.

సీటీ స్కాన్‌ మిషన్లు, ఎంఆర్‌ఐల్లో మ్యా గ్నిటెక్‌ను తయారు చేసే ఒక చైనా కంపెనీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిషేధం విషయాన్ని ముందుగానే గ్రహించిన సదరు వ్యక్తి 2019 చివరిలో చైనా కంపెనీతో మెడ్‌టెక్‌ జోన్‌తో పెట్టుబడులు పెట్టించారు. సదరు కంపెనీకి దాదాపు రూ.40 కోట్లు ప్రోత్సాహకాలుగా అందించారు. ఈ కంపెనీ ఇప్పటి వరకు ఏం ఉత్పత్తి చేసింది? కంపెనీ ఉత్పత్తి ప్రారంభమైందో లేదో కూడా తెలియదు. కానీ, ఏటా సదరు కంపెనీకి ఇన్‌సెంటివ్స్‌ వెళ్లిపోతున్నాయి. అసలు ఈ ఇన్‌సెంటివ్స్‌ను ఆ కంపెనీకి ఇస్తున్నారో.. కంపెనీ వెనుక ఉండి ప్రైవేటు వ్యక్తి సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారో అన్న దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి.


విశాఖ స్వామి అండదండలు

టీడీపీ హయాంలో తాను డాక్టర్‌ అని చెప్పుకొని ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించిన ప్రైవేటు వ్యక్తి, వైసీపీ హయాంలో కూడా చక్రం తిప్పారు. జగన్‌ ప్రభుత్వం లో కీలకంగా వ్యవహరించిన స్వామిజీ మెడ్‌టెక్‌ జోన్‌ వ్యవహరాలు కూడా పర్యవేక్షించారు. దీంతో వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే సదరు ప్రైవేటు వ్యక్తి వెం టనే విశాఖ స్వామి ఆశ్రమానికి చేరిపోయారు. సదరు వ్యక్తి భక్తిని మెచ్చిన విశాఖ స్వామి జోక్యం చేసుకోవడంతో ప్రభుత్వం కూడా మెడ్‌ టెక్‌ జోన్‌పై దృష్టి పెట్టలేదు. పైగా, సీఎంవోలోని పూనం మాలకొండయ్య అండదండలు ఉండడంతో సానుకూలంగా మారింది.

వైద్య పరికరాల ఉత్పత్తిలో దేశానికి తలమానికంగా ఉండాల్సిన మెడ్‌ టెక్‌ జోన్‌.. గత వైసీపీ సర్కారు నిర్లక్ష్యం కారణంగా నిర్వీర్యమైంది. ప్రైవేటు వ్యక్తి జోక్యంతో అనధికార ఆంక్షలు, పెట్టుబడులు పెట్టేవారికి బెదిరింపులు పెరిగిపోయాయి. పైగా నిషేధిత చైనా కంపెనీలను ఆహ్వానించి పెట్టుబడులు పెట్టించిన వైనం వివాదంగా మారింది. ప్రోత్సాహకాల పేరిట సర్కారు సొమ్మును సొంతం చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా విషయా లు అధికారులకు తెలిసినా.. ప్రస్తుత ప్రభుత్వానికి వివరించకుండా మాయ చేస్తున్నారు!


మంత్రికి అధికారుల మస్కా!

మెడ్‌ టెక్‌ జోన్‌పై కొత్త ప్రభుత్వం ఏమేరకు చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. అసలు మెడ్‌టెక్‌ జోన్‌ పరిస్థితి ఎలా ఉంది? పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందా? అనే కీలక అంశాలను పరిశ్రమల శాఖ అధికారులు పట్టించుకోకుండా జోన్‌లో పెట్టుబడులు పెట్టేయండి అని దేశ, విదేశాల నుంచి వచ్చే పారిశ్రామిక వేత్తలకు సలహాలు ఇస్తున్నారు.

గత వారంలో అబుదాబి నుంచి ఎంఎఫ్‌-2 కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఆరోగ్యశాఖ మం త్రి సత్యకుమార్‌ను కలిసి ప్రాజెక్టు గురించి వివరించారు. ఆయన వెంటనే మెడ్‌టెక్‌ జోన్‌లో పెట్టుబడులు పెట్టండి అని అబుదాబి ప్రతినిధులకు చెప్పారు. మెడ్‌టెక్‌ జోన్‌లో పరిస్థితి మంత్రికి తెలియదు. కానీ, పరిశ్రమల శాఖ అధికారులకు తె లుసు. ఆరోగ్యశాఖ మంత్రి దగ్గర మాత్రం మెడ్‌టెక్‌ జోన్‌ అద్భుతం అన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి చెప్పింది విని అబుదాబి ప్రతినిధులు మెడ్‌టెక్‌ జోన్‌ నుంచి విచారణ చేస్తే ఏపీ పరువు పోతుందని విశాఖ అధికారులు చెబుతున్నారు. మెడ్‌ టెక్‌ జోన్‌పై విచారణ చేయాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

Updated Date - Jul 09 , 2024 | 03:47 AM