Share News

CPI Ramakrishna: అమరావతికి కేంద్రం ఇచ్చే రూ.15వేల కోట్లు గ్రాంట్‌గా మార్చాలి..

ABN , Publish Date - Jul 29 , 2024 | 12:14 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి(Amaravati) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన రూ.15వేల కోట్లను గ్రాంట్‌గా మార్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(Ramakrishna) డిమాండ్ చేశారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు ద్వారా రూ.15వేల కోట్లు ఇప్పించినట్లు కేంద్రం ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారని, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకొనే శక్తి చంద్రబాబుకు ఉందని ఆయన తెలిపారు.

CPI Ramakrishna: అమరావతికి కేంద్రం ఇచ్చే రూ.15వేల కోట్లు గ్రాంట్‌గా మార్చాలి..
CPI State Secretary Ramakrishna

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి(Amaravati) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన రూ.15వేల కోట్లను గ్రాంట్‌గా మార్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(Ramakrishna) డిమాండ్ చేశారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు ద్వారా రూ.15వేల కోట్లు ఇప్పించినట్లు కేంద్రం ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారని, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకొనే శక్తి చంద్రబాబుకు ఉందని ఆయన తెలిపారు. ‘డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, ఏపీజే అబ్దుల్‌కలాం పేర్లతో రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలుచేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమని రామకృష్ణ పేర్కొన్నారు.


పథకాల మార్పుపై హర్షం..

గతంలో జగనన్న విద్యాకానుక కింద పాఠశాల విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్ ఇచ్చేవారు. ఎన్డీయే ప్రభుత్వం ఈ పథకానికి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు పెట్టడం మంచి విషయం అని రామకృష్ణ అన్నారు. అలాగే మ‌ధ్యాహ్న భోజ‌న పథకానికి డొక్కా సీత‌మ్మ పేరు, జగనన్న ఆణిముత్యాలు పథకాన్ని అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చడం అభినందనీయమని ఆయన అన్నారు. డా.బి.ఆర్.అంబేడ్కర్ పేరిట ఉన్న పథకాలను గత వైసీపీ ప్రభుత్వం మార్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఆ పథకం పేరును కూడా తిరిగి పునరుద్ధరించాలని కోరారు.


సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాల్సిందే..

రాష్ట్రంలో ప్రస్తుత స్థితిపై శ్వేతపత్రాలు విడుదల చేసినప్పుడు అందులో వాస్తవాలు ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఏపీ ఆర్థిక వనరులు, తక్షణ పరిస్థితిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం సందర్భంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్ర అవస్థలు పడ్డ బాధితులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల వల్లే కూటమి నేడు అధికారంలోకి వచ్చినట్లు ఆయన చెప్పారు. హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలు తప్పకుండా అమలు చేయాల్సిందే అని రామకృష్ణ డిమాండ్ చేశారు.


కేంద్రంలో చక్రం తిప్పుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాల విషయంలో ప్రధాని మోడీపై ఒత్తిడి తేవాలని రామకృష్ణ అన్నారు. శ్రీశైలం, తుంగభద్ర డ్యాంలు నిండాయని, గోదావరి పరవళ్లు తొక్కుతోందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా హాంద్రీనీవా ద్వారా నీళ్లు పంప్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 31న రాయలసీమ కరవు పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి:

Cyber Crime: సీబీఐ అధికారులమంటూ మహిళకు రూ.26లక్షలు టోకరా..

Updated Date - Jul 29 , 2024 | 12:15 PM