Share News

CM Chandrababu: పుంగనూరు బాలిక కుటుంబానికి చంద్రబాబు ఫోన్.. వారిని వదిలిపెట్టబోమని హామీ..

ABN , Publish Date - Oct 06 , 2024 | 04:33 PM

చిత్తూరు జిల్లా పుంగనూరులో హత్యకు గురైన చిన్నారి ఆస్పియా కుటుంబాన్ని ఏపీ హోంమంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ఎన్డీయే ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.

CM Chandrababu: పుంగనూరు బాలిక కుటుంబానికి చంద్రబాబు ఫోన్.. వారిని వదిలిపెట్టబోమని హామీ..

చిత్తూరు: పుంగనూరు(Punganuru)లో ఆస్పియా(7) అనే చిన్నారిని హత్య చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యులను సీఎం ఫోన్‌‌లో పరామర్శించారు. బాలిక తండ్రితో మాట్లాడిన చంద్రబాబు ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ముగ్గురు నిందితులను చిత్తూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, చట్టప్రకారం వారికి కఠిన శిక్ష విధిస్తామని హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్య పడొద్దని బాధిత కుటుంబానికి సీఎం చంద్రబాబు ధైర్యం చెప్పారు.


నిందితులను ఉపేక్షించం..

మరోవైపు పుంగనూరు వెళ్లి బాధిత కుటుంబాన్ని ఏపీ హోంమంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ఎన్డీయే ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ధైర్యం కోల్పోవద్దని చెప్పి ఫోన్ ద్వారా సీఎం చంద్రబాబుతో మాట్లాడించారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై దాడులు, హత్యలు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యాచారాలు వంటి ఘటనల విషయంలో నిందితులను ఉపేక్షించేది లేదని హోంమంత్రి అనిత హెచ్చరించారు. ఆస్పియా హత్య చాలా దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హత్య కేసును జిల్లా పోలీసులు ఛేదించారని, ఈ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారని అనిత తెలిపారు. చిన్నారి అదృశ్యమైందని ఫిర్యాదు అందిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు 12బృందాలుగా ఏర్పడి బాలిక కోసం గాలించారని ఆమె చెప్పారు.


రాజకీయాలు చేయెుద్దు..

దురదృష్టవశాత్తూ ఆస్పియా ప్రాణాలు కాపాడలేకపోయారని హోంమంత్రి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ విచారణ చేపట్టి ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఆమె తెలిపారు. ఆస్పియా హత్య విషయాన్ని వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని అనిత మండిపడ్డారు. ఇలాంటి విషయాలనూ వారు రాజకీయాలకు వాడుకోవడం సిగ్గచేటని అన్నారు. వైసీపీ హయాంలో వందలమందిపై అత్యాచారాలు జరిగాయని ఆమె ఆరోపించారు. ఆ సమయంలో మాజీ సీఎం జగన్ ఒక్క రోజైనా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చారా? అంటూ ప్రశ్నించారు. కానీ ఇప్పుడు మాత్రం బాలిక హత్య కేసును వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చిన్నారిపై అత్యాచారం జరగలేదని, ఆమె శరీరంపై చిన్న గాయం కూడా లేదన్నారు. ఈ విషయంలో పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందని హోంమంత్రి చెప్పారు.


అసత్య ప్రచారం ఆపండి..

చిన్నారి హత్య అత్యంత బాధాకరమని ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. బాధిత కుటుంబానికి సీఎం చంద్రబాబు అండగా ఉంటారని మంత్రి భరోసా ఇచ్చారు. వారికి భరోసా కల్పించేందుకే పుంగనూరు వచ్చినట్లు ఆయన తెలిపారు. బాలికపై ఘాతుకానికి పాల్పడిన నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని మంత్రి చెప్పారు. మహిళలు, చిన్నారులపై దాడులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదన్నారు. ఇలాంటి ఘటనలను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పారు. చిన్నారి ఆస్పియా హత్యను వైసీపీ నేతలు రాజకీయం చేయడం బాధాకరమని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలనూ వారు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికపై అత్యాచారం జరిగిందంటూ అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చిన్నారిపై లైంగిక దాడి జరగలేదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Chittoor: పుంగనూరు బాలిక హత్య కేసు.. ముగ్గురి అరెస్టు.. సంచలన విషయాలు వెల్లడి..

Kesineni Sivanath: తిరువూరులో కొన్ని దురదృష్టకరమైన పరిణామాలు.. ఎంపీ కేశినేని శివనాథ్ కీలక వ్యాఖ్యలు

CH baburao: వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం

Updated Date - Oct 06 , 2024 | 04:36 PM