Share News

Chevireddy Bhaskar Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్..

ABN , Publish Date - Dec 16 , 2024 | 12:52 PM

చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై పోక్సో కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. మైనర్‌ బాలికపై అత్యాచారం జరిగిందంటూ అవాస్తవ ఆరోపణలతో ఆయన దుష్ప్రచారం చేశారని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.

Chevireddy Bhaskar Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్..

అమరావతి: చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy)పై పోక్సో కేసు నమోదైంది. పోక్సో చట్టం కింద తనపై పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఇవాళ(సోమవారం) విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. పిటిషనర్‌కు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. క్వాష్ పిటిషన్‌లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.


చెవిరెడ్డి దుష్ప్రచారం..

కాగా.. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై పోక్సో కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. మైనర్‌ బాలికపై అత్యాచారం జరిగిందంటూ అవాస్తవ ఆరోపణలతో ఆయన దుష్ప్రచారం చేశారని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. దీనిపై చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఎర్రావారిపాలెం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. వాస్తవానికి బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినా పోలీసులు వివరాలు బహిర్గతం చేయలేదు. వివరాల్లోకి వెళ్తే.. పదో తరగతి చదువుతున్న దళిత మైనర్‌ బాలిక స్కూలు నుంచి ఇంటికి వచ్చే దారిలో గాయాలతో పడి ఉండటం సంచలనంగా మారింది. ఆ బాలికపై అత్యాచారం జరిగిందంటూ వైసీపీకి చెందిన మాజీ మంత్రి రోజా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తదితరులు హడావుడి చేశారు.


అసత్యాలు ప్రచారం చేసి తన బిడ్డ భవిష్యత్‌ను పాడు చేయవద్దని బాలిక తండ్రి వేడుకున్నా లాభం లేకపోయింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. బాలికను తొలుత పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది అమ్మాయికి చికిత్స చేస్తుండగా ఆ గదిలోకి మండల వైసీపీ కన్వీనర్‌ దేవపట్ల నాగార్జునరెడ్డి వంద మందికిపైగా అనుచరులతో వచ్చారు. చికిత్స చేయకుండా అడ్డుకున్నారు. బాలికపై అత్యాచారం జరిగిందని, తాము అండగా ఉంటామని హడావుడి చేశారు.


కాసేపటికే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచరులతో కలసి అక్కడకు చేరుకుని బాలిక తండ్రితో ఏమీ మాట్లాడకుండానే.. అత్యాచారం జరిగినట్లు రాసేయాలని చెప్పారు. అత్యాచారం జరగలేదని తండ్రి చెబుతున్నా వినిపించుకోలేదు. బాలికను మెరుగైన వైద్యం కోసం అదే రోజు రాత్రి తిరుపతి ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు. పోలీసు, రెవెన్యూ అధికారుల ఎదుట ఆ బాలిక తనపై అత్యాచారం జరగలేదని స్పష్టం చేసింది. అయితే వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చారు. వారి ప్రకటనల ఆధారంగా బాలికపై అత్యాచారం జరిగిందని ఓ పత్రికలో, వైసీపీ సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. తన కుమార్తెను వేధించిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా వైసీపీ నాయకులు, ఓ పత్రిక, వారికి సంబంధించిన సోషల్‌ మీడియా వాస్తవాలు తెలుసుకోకుండా తమ పరువు ప్రతిష్ఠలు దెబ్బతీసేలా వ్యవహరించారని బాలిక తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలతో తమ గ్రామంలో తమ కులానికే చెందిన రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

Chevireddy-Bhaskar-Reddy.jpg


తాము దళితులమని తెలిసి కూడా తమ వివరాలను బహిర్గతం చేసి సమాజంలో తలెత్తుకోనివ్వకుండా చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. మైనర్‌ బాలిక అని తెలిసినా తన కుమార్తె ఆస్పత్రిలో చిరిగిన బట్టలతో చికిత్స చేయించుకుంటున్న ఫొటోలు తీసి మీడియాలో చూపించడం ద్వారా తమ గోప్యతను దెబ్బతీశారని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మైనర్‌ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎర్రావారిపాలెం పోలీసులు కేసు (క్రైమ్‌ నంబరు 58/2024) నమోదు చేసి ఏ-1గా ఎర్రావారిపాలెం మండలం వైసీపీ కన్వీనర్‌ దేవపట్ల నాగార్జున రెడ్డి, ఏ-2గా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్లు చేర్చారు. ఎంపీ గురుమూర్తి, రోజా, భూమన, ఆయన కుమారుడు అభినయ్‌రెడ్డిని కూడా నిందితులుగా చేర్చే అవకాశాలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

KC రెడ్డి ఫార్మసీ కాలేజీలో దారుణం..

AP News: భర్త చేసిన అప్పులు తీర్చాలంటూ భార్యపై అమానుషం

TTD: తిరుమల శ్రీవారి దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం.. భక్తులకు అలర్ట్..

Read Latest AP News and Telugu News

Updated Date - Dec 16 , 2024 | 01:19 PM