Pulivarthi Vs Chevireddy: చెవిరెడ్డీ.. నాకు టైం సరిపోవట్లేదు.. పులివర్తి స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Jul 28 , 2024 | 10:00 PM
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఆ తర్వాత తిరుపతి జిల్లాలో జరిగిన దాడులు అన్ని ఇన్ని కావు. మరీ ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేసిన పులివర్తి నాని (Pulivarthi Nani)పై.. వైసీపీ నుంచి బరిలోకి దిగిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, అతని అనుచరులు దాడికి తెగబడి కార్లను ధ్వంసం చేయడంతో పాటు హత్యాయత్నం చేశారు.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఆ తర్వాత తిరుపతి జిల్లాలో జరిగిన దాడులు అన్ని ఇన్ని కావు. మరీ ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేసిన పులివర్తి నాని (Pulivarthi Nani)పై.. వైసీపీ నుంచి బరిలోకి దిగిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, అతని అనుచరులు దాడికి తెగబడి కార్లను ధ్వంసం చేయడంతో పాటు హత్యాయత్నం చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల కమిషన్, తిరుపతి పోలీసులు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (Chevireddy Bhaskar Reddy) ప్రధాన అనుచరుడు, పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
చెవిరెడ్డీ.. పద్ధతి మార్చుకో..
శనివారం నాడు బెంగళూరు నుంచి విదేశాలకు పారిపోవడానికి యత్నించిన మోహిత్‌రెడ్డిని ఎయిర్‌పోర్టు అధికారులు ఇచ్చిన సమాచారంతో అరెస్ట్ చేసి తిరుపతికి తీసుకొచ్చారు. ఈక్రమంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మోహిత్‌రెడ్డి ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలారు. ఇందుకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే భంగపాటు తప్పదని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వార్నింగ్ ఇచ్చారు. దాడి చేసిన సంఘటనలో పాల్గొన్న వారే ప్రధాన నిందితుడిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరు చెప్పడం జరిగిందని అన్నారు.
విచారణలో మీ పేర్లు..
‘‘విచారణలో ముద్దాయిలు మీ పేర్లు ఎందుకు చెప్పారో అది తెలుసుకోండి. ప్రధాన నిందితుడుగా A1. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A2. మోహిత్ రెడ్డి, A3. రఘునాథరెడ్డి, A4 బానుల పేర్లు ఇచ్చారు. పోలీసుల విచారణలో భాగంగా 37వ నిందితునిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరును పోలీసులు చేర్చారు. నీ అధికారులు నీ ప్రభుత్వంలో నాపై జరిగిన దాడికి సంబంధించి కేసు పెట్టారు.ఇప్పటివరకు ఇంకా అధికారులు పూర్తిస్థాయిలో మారలేదు. విదేశాలలో చదివితే హత్యాయత్నం చేసిన వారిని వదిలేస్తారా..? చట్టాన్ని నా చేతిలో తీసుకొని శిక్షించడానికి తప్పుడు కేసులు పెట్టడానికి నేను రెండు నెలలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు’’ అని పులివర్తి నాని హెచ్చరించారు.
కక్ష సాధింపు చర్యలకు టైం లేదు..
‘‘చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి నాకు సమయం చాలడం లేదు. ఇక మీపై కక్ష సాధింపు చర్యలకు నాకు సమయం ఎక్కడిది చెవిరెడ్డీ? కక్షపూరితమైన రాజకీయాలు చేయాలనుకుంటే ఇన్ని రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ప్రజలకు తప్పుడు సమాచారం, తప్పుడు సంకేతం ఇవ్వడం మానుకోండి...? ప్రజల కోసం, వారి అవసరాల కోసం, మనుగడ కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడుతున్నాను. నా వ్యక్తిగత అవసరాల కోసం కాదు’’ అని పులివర్తి నాని స్పష్టం చేశారు.