Share News

Pawan Kalyan: వైసీపీ నేతలకు చింత చచ్చినా పులుపు చావలేదు.... పవన్ కళ్యాణ్ వ్యంగ్యాస్త్రాలు

ABN , Publish Date - Nov 01 , 2024 | 04:41 PM

జగన్ ప్రభుత్వం కంటే సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వంలో బాగా చేసి చూపిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. డబ్బు దోచుకుని, దాచుకునే నేతల్లా తాము పని చేయడం లేదని చెప్పారు. ఎర్ర కండువా వేసుకుని ఎదురొడ్డి నిలిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఈ విజయం ..ఈ కూటమి ప్రభుత్వం ప్రజలది అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Pawan Kalyan: వైసీపీ నేతలకు చింత చచ్చినా పులుపు చావలేదు.... పవన్ కళ్యాణ్ వ్యంగ్యాస్త్రాలు

ఏలూరు: సనాతన ధర్మంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మంపై రకరకాలుగా కొంతమంది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ నేలపై అందరూ నివసిస్తున్నారని.. తాను అన్ని మతాలను గౌరవిస్తానని స్పష్టం చేశారు. ఇవాళ(శుక్రవారం) ఏలూరులో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మన సనాతన ధర్మాన్ని, హిందూ దేవాలయాలకు వెళ్లినపుడు కొన్ని విలువలు పాటించాలని సూచించారు. ఐయస్ జగన్నాధపురంలోనే మన సనాతన ధర్మం ప్రపంచానికి దిక్సూచిగా ఉండాలని దీక్ష చేపట్టానని గుర్తుచేశారు. సనాతన ధర్మం ఉంటే తప్పా.. ఈ దేశం నిలబడదని ఉద్ఘాటించారు. హైందవ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పడితే, సహించేది లేదని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.


సనాతన ధర్మ పరిరక్షణ విభాగాన్ని జనసేన పార్టీ తరపున ప్రారంభిస్తున్నామని తెలిపారు. ‘‘నారసింహ వారాహి గణం’’ సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో ఏపీ, తెలంగాణాలో ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఏపీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. ప్రజా హక్కులను కాలరాస్తున్న సమయంలో ప్రజల వెంట కూటమి నాయకులు ఉన్నారని చెప్పారు. దీపం ఉచిత సిలిండర్లు కోటి ఎనిమిది లక్షల మందికి ఇవ్వబోతున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.


ఎర్ర కండువా వేసుకుని ఎదురొడ్డి పోరాడాం..

‘‘జగన్ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు బాగా చేసి చూపిస్తున్నాం. డబ్బు దోచుకుని, దాచుకునే నేతల్లా మనం చేయడం లేదు . ఎర్ర కండువా వేసుకుని ఎదురొడ్డి నిలిస్తే ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ విజయం మీది..ఈ కూటమి ప్రభుత్వం మీది. ఐయస్ జగన్నాధపురంలో 14ఏళ్ల క్రితం దీక్ష చేపట్టాను. మా గురువుగారి ఊరి ఇది. 2009 ఎన్నికల తర్వాత అన్నీ కోల్పోయిన తరుణంలో ఇక్కడ ఉన్న స్వామి నేను ఉన్నానంటూ నాకు అండగా ఉన్నారు. ఐయస్ జగన్నాధపురం ఆలయానికి వ్యక్తిగతంగా ఏమీ చేయలేదు. ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే విషయంపై అధికారులతో చర్చించాను. ఆలయాన్ని నాలుగున్నర కోట్లతో వివిధ రకాలుగా అభివృద్ధి చేస్తాం. చాలా పవిత్రమైన ఈ ఆలయానికి దేశం మొత్తం రావాలి. ఈ ఆలయాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చుతాము’’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.


త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నాం..

‘‘ఏ పని అయినా అవుతుందో లేదో అధికారులతో చర్చించిన తర్వాత ప్రజలకు మాట ఇస్తాను. ప్రతీ ఏడాది నిరుద్యోగ యువతకు డీఎస్సీ విడుదల చేయాలని మంత్రివర్గ సమావేశంలో చర్చించాం .వైసీపీ నేతలకు చింత చచ్చినా పులుపు చావలేదు. వైసీపీకి 11సీట్లువచ్చినా విమర్శలు మానలేదు. మూడు నెలలుగా వైసీపీ నేతలకు నోరు ఎక్కువైంది. ఇది మంచి ప్రభుత్వమే కానీ, మెత్తని ప్రభుత్వం కాదు. మీకు యుద్ధమే కావాలనుకుంటే సిద్ధమే.. కానీ అభివృద్ధికి ఉపయోగపడే యుద్ధం కావాలి. ఆడబిడ్డలకు ఆపద కలిగించినా, చాలా తీవ్రంగా పరిగణిస్తాం. నేరాలు పెరిగాయి, శిక్షలు తగ్గాయి. పోలీసులకు డిజిటల్ క్రైమ్ యాక్టు తీసుకురాబోతున్నాం’’ అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.


షర్మిలకు రక్షణ కల్పిస్తాం...

‘‘జగన్ సోదరి వైఎస్ షర్మిల ప్రాణాలకు రక్షణ కావాలని కూటమి ప్రభుత్వాన్ని కోరితే.. ఆమె అన్నలా కాకుండా మేము రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చాం. సంఘ విద్రోహ శక్తులు గొడవలు సృష్టిస్తే, మీరు గట్టిగా ఉండాలి. అవి కుల ఘర్షణలు అయినా, మత ఘర్షణలు అయినా పోరాడాలి. వైసీపీ పాలకులు దేశ సమగ్రతకు నష్టం కలిగించినా, మత , కుల ఘర్షణలు సృష్టిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లలో ఆడబిడ్డల సంరక్షణ బాధ్యతలు పాఠశాలల మేనేజ్‌మెంట్, ప్రిన్సిపాల్స్‌వే. వైసీపీ నేతలు ఆడబిడ్డలను విమర్శించి మాట్లాడిన ప్రతీ మాట రికార్డు అవుతుంది’’ అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.


పోలీసులకు వార్నింగ్..

‘‘ వైసీపీ నేతల మీద చర్యలు తీసుకునేటప్పుడు.. వారు రోడ్డెక్కితే, కాళ్లు చేతులు విరగొట్టి మూల కూర్చోబెడతాం. మొన్నటి ఎన్నికల్లో ఈవీఎంలు మోసం చేశాయని వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పుడు ఏమీ అనలేదు. వైసీపీకి 11 సీట్లు వస్తే మాత్రం ఈవీఎంలు మోసం చేశాయంటున్నారు. కొందరు పోలీసులు విధి నిర్వహణలో సీరియస్‌గా లేరు. సరిగ్గా పనిచేయడం లేదు. ఆ అంటే ఆ ప్రభుత్వంలో కేసులు పెట్టేవారు.. ధర్మబద్ధంగా మేము చెబుతుంటే పనిచేయడం లేదు. పోలీసులకు హనీమూన్ అయిపోయింది.. సరిగ్గా పనిచేయాలి. ఐయస్ జగన్నాధపురంలో మట్టిని విచ్చలవిడిగా తవ్వేశారు.. దానిపై అధికారులను నివేదిక అడిగాను’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

NRI: ఎన్నారైలకు కొత్త అర్థం చెప్పిన ఏపీ మంత్రి నారా లోకేశ్

Free bus travel: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి బీసీ జనార్ధన్ కీలక స్టేట్‌మెంట్

Video Viral: ఉచిత గ్యాస్ పథకం ప్రారంభించి.. లబ్దిదారుడి ఇంట టీ పెట్టిన సీఎం చంద్రబాబు

Read latest AP News And Telugu News

Updated Date - Nov 01 , 2024 | 05:03 PM