AP Elections: గాలి మారింది.. స్వరమూ మారుతోంది!
ABN , Publish Date - Apr 11 , 2024 | 09:54 AM
AP Elections 2024: రాష్ట్రంలో గాలి మారుతోందని అఖిల భారత సర్వీసు అధికారులు గ్రహించినట్లుగా కనబడుతోంది. అందుకే స్వరం సవరించుకుంటున్నారు. మారుతున్న రాజకీయ వాతావరణానికి అనుగుణంగా పాత సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా పరిణామాలు అధికారుల ఆలోచనా ధోరణిలో వస్తున్న మార్పును సూచిస్తున్నాయి...
టీడీపీకి అధికారుల ‘ముందస్తు’ శుభాకాంక్షలు
ముందుచూపుతో నేతలకు ఫోన్లు
పై నుంచి ఒత్తిళ్లతోనే పొరపాట్లు చేశామని పశ్చాత్తాపాలు
వైసీపీని ఎలా దెబ్బకొట్టాలో వ్యూహాలు
ఏయే అంశాలపై ఆందోళనలు చేయాలో సలహాలు
ఏ వర్గాలను దరిచేర్చుకోవాలో సూచనలు
రానున్న రోజుల్లో పెరగనున్న ఫోన్ల తాకిడి!
(అమరావతి–ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలో గాలి మారుతోందని అఖిల భారత సర్వీసు అధికారులు గ్రహించినట్లుగా కనబడుతోంది. అందుకే స్వరం సవరించుకుంటున్నారు. మారుతున్న రాజకీయ (AP Politics) వాతావరణానికి అనుగుణంగా పాత సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా పరిణామాలు అధికారుల ఆలోచనా ధోరణిలో వస్తున్న మార్పును సూచిస్తున్నాయి. కొద్ది రోజులుగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నేతలకు కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. మామూలు ఫోన్ నుంచి కాకుండా ఐ ఫోన్లలో ఫేస్ టైం యాప్ ద్వారా కాల్ చేసి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో వాతావరణం గమనిస్తున్నామని, రాబోయే ఎన్నికల్లో గెలువబోతున్నారంటూ ముందస్తు అభినందనలు చెబుతున్నారు.
సజ్జలపై ఏం చేద్దాం!
గత వారం రోజుల్లో ముగ్గురు మాజీ మంత్రులకు అర డజను మంది అధికారులు ఫోన్లు చేశారు. తాము గమనిస్తున్న విషయాలు వారితో పంచుకుంటూ.. ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎక్కడెక్కడ దృష్టి కేంద్రీకరించాలో సలహాలు కూడా ఇస్తున్నారు. కృష్ణా జిల్లాలో ప్రభుత్వానికి ధాన్యం విక్రయించిన రైతులకు మూడు నెలలైనా చెల్లింపులు జరగలేదని.. వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొందని, రైతు భరోసా కేంద్రాల వద్ద అన్ని గ్రామాల్లో దీనిపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని ఒక ఐఏఎస్ అధికారి సలహా ఇచ్చారు. ఇంకో అధికారి మరో ఆసక్తికరమైన విశ్లేషణ చెప్పారు. ‘పేద వర్గాలు తప్ప మిగిలిన అన్ని వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉంది. యువత, ఉద్యోగులు, రైతులు, భవన నిర్మాణ కార్మికులు, మధ్య తరగతి ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. పేద వర్గాల్లోనూ కాస్త ఊగిసలాట ఉంది. ఉపాధి దెబ్బ తిన్నవారు, ఖర్చుల భారం పెరిగిన వారు వ్యతిరేకతతో ఉన్నారు. కొందరు మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. ఆ ఒక్క వర్గాన్ని టీడీపీ దరిచేర్చుకుంటే వైసీపీ మిగలదు. టీడీపీ వచ్చినా ఇప్పుడున్న పథకాలు కొనసాగుతాయన్న భరోసా కల్పించగలిగితే చాలు’ అని ఆయన తెలిపారు.
ఐపీఎస్‌ల పశ్చాత్తాపం..
ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఈ ఐదేళ్లలో చోటు చేసుకున్న పరిణామాలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నట్లు సమాచారం. పై నుంచి వచ్చిన ఒత్తిళ్ల వల్ల తాము కొంత కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని, అందుకు బాధపడుతున్నామని కూడా వారు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న కొన్ని వ్యవహారాలకు సంబంధించి కొంత విలువైన సమాచారం తమ వద్ద ఉందని, ప్రభుత్వం మారితే ఆ సమాచారం ఇవ్వడానికి సిద్ధమని ఓ అధికారి తెలిపారు. పోలీసు ఉన్నతాధికార శ్రేణిలో వైసీపీ నేతలకు ఎక్కువ అనుకూలంగా వ్యవహరిస్తున్న వారెవరు.. తటస్థంగా ఉన్న వారి పేర్లు కూడా ఈ అధికారులు తమ సంభాషణల్లో చెబుతున్నట్లు సమాచారం. మారిన పరిస్థితుల్లో అధికార పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి.. పోలీసు వ్యవస్థను ఏ విధంగా వాడుకునే అవకాశం ఉందో ఐపీఎస్‌ల ఆలోచనలను టీడీపీ నేతలు సైతం అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం మారబోతోందని అధికారులు గ్రహిస్తున్నారని, అందుకే ధైర్యంగా తమకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారని ఒక నాయకుడు వ్యాఖ్యానించారు. తామూ వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని, దానివల్ల కొన్ని కొత్త కోణాలు తెలుస్తున్నాయని తెలిపారు. ఈ ఫోన్ల తాకిడి రాబోయే రోజుల్లో మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.