Elections 2024: ఏపీలో గెలిచేది వాళ్లే.. బెట్టింగ్ రాయుళ్ళ అంచనా ఇదే..!
ABN , Publish Date - May 15 , 2024 | 05:56 PM
ఏపీలో పోలింగ్ ముగిసింది. గెలుపుపై ఎవరి అంచనాలు వారివి. పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ పార్టీలు తమకు వచ్చే సీట్లపై లెక్కలు వేసుకున్నాయి. పెరిగిన పోలింగ్ శాతం తమకు అనుకూలమని ఓవైపు ఎన్డీయే కూటమి అంచనా వేస్తుంటే.. మరోవైపు వైసీపీ సైతం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని లెక్కలు వేస్తున్నారు. పార్టీల అంచనాలు ఇలా ఉంటే.. బెట్టింగ్ రాయుళ్ళ అంచనా మరో విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీలో పోలింగ్ ముగిసింది. గెలుపుపై ఎవరి అంచనాలు వారివి. పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ పార్టీలు తమకు వచ్చే సీట్లపై లెక్కలు వేసుకున్నాయి. పెరిగిన పోలింగ్ శాతం తమకు అనుకూలమని ఓవైపు ఎన్డీయే కూటమి అంచనా వేస్తుంటే.. మరోవైపు వైసీపీ సైతం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని లెక్కలు వేస్తున్నారు. పార్టీల అంచనాలు ఇలా ఉంటే.. బెట్టింగ్ రాయుళ్ళ అంచనా మరో విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజున వైసీపీ, ఎన్డీయే కూటమి మధ్య పోటాపోటీ ఉంటుందని, అయినప్పటికీ ఎన్డీయూ కూటమికి ఎడ్జ్ ఉంటుందని అంచనా వేసిన బెట్టింగ్ రాయుళ్ళు.. ప్రస్తుతం ఎన్డీయే కూటమి మెజార్టీ మార్క్ సాధిస్తుందని అంచనాకు వచ్చారట.
ఎన్డీయే కూటమికి కనీసం వంద సీట్లు దాటే అవకాశం ఉందని కొందరు బెట్టింగ్‌లు కాస్తుండగా.. వైసీపీకి 80 నుంచి 90 సీట్లు వస్తాయని కొందరు బెట్టింగ్‌లు కడుతున్నారట. మరికొందరు వైసీపీకి 60 సీట్లు దాటవని, ఎవరైనా 60 దాటివస్తాయని బెట్టింగ్ కడితే రూపాయికి రెండు రూపాయిలు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారట. బెట్టింగ్ రాయుళ్ళ ఆఫర్లతో కొంతమంది వైసీపీ నాయకులు సైతం టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. పోలింగ్‌కు ముందే చాలామంది వైసీపీ మద్దతుదారులు జగన్ రెండోసారి సీఎం అవుతారంటూ బెట్టింగ్‌లు కట్టారట. ప్రస్తుతం పోలింగ్ సరళి చూసిన తర్వాత వైసీపీపై బెట్టింగ్ కట్టినవాళ్లంతా.. తమ డబ్బులు పోకుండా ఉండేందుకు ఇప్పుడు ఎన్డీయే కూటమిపై బెట్టింగ్‌లు కడుతున్నట్లు తెలుస్తోంది.
AP Elections: అంతలోనే మాట మారింది..?
బెట్టింగ్ రాయుళ్ళ అంచనా..
పోలింగ్ సరళి చూసిన తర్వాత.. పూర్తి పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం విడుదల చేసిన తర్వాత.. ఏపీలో ఎన్డీయే కూటమికి వంద సీట్లు దాటతాయంటూ ఎక్కువమంది బెట్టింగ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో జిల్లాల వారీగా బెట్టింగ్‌లు కాస్తున్నారట. ఏ జిల్లాలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుందనేదానిపై ఎక్కువ బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.
నియోజకవర్గాలవారీ ఎవరు గెలుస్తారనేదానికంటే మెజార్టీలపై బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. 5 నుంచి 10 వేల మెజార్టీ అయితే చెరి సమానం, 10 వేల నుంచి 20 వేల మెజార్టీ అయితే రూపాయికి రూపాయిన్నర, 20 వేల నుంచి 30 వేల మెజార్టీపై రూపాయికి రెండు రూపాయిలు, 30 నుంచి 40 వేల మెజార్టీపై రూపాయికి 3 రూపాయిలు, 50 వేల మెజార్టీ దాటిందని కాస్తే రూపాయికి ఐదు రూపాయిల రేషియో నడుస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే అన్ని నియోజకవర్గాల్లో ఈ రేషియో లేనట్లు తెలుస్తోంది. టఫ్ ఫైట్ ఉందనుకున్న నియోజకవర్గాల్లో ఈ రేషియో ఉండగా.. ఈజీగా భారీ మెజార్టీతో గెలుస్తారని అంచనా ఉన్న నియోజకవర్గాల్లో కనీస మెజార్టీ 30వేల నుంచి బెట్టింగ్‌లు కడుతున్నట్లు తెలుస్తోంది.
ఏ జిల్లాల్లో ఎవరికి మొగ్గు..
శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఎన్డీయే కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని, విజయనగరం జిల్లాలో వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయంటూ బెట్టింగ్ రాయుళ్ళు అంచనా వేస్తున్నారట. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ ఎన్డీయే కూటమికి మెజార్టీ సీట్లు వస్తాయని బెట్టింగ్ కాస్తుంటే.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనీసం 6 సీట్లు వైసీపీకి వస్తాయంటూ బెట్టింగ్‌లు కడుతున్నారట. ఇక కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ ఎన్డీయే కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని బెట్టింగ్ రాయుళ్ళు అంచనా వేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని బెట్టింగ్‌లు కడుతున్నా.. చాలా తక్కువ రేషియో ఇస్తున్నట్లు తెలుస్తోంది.
రాయలసీమ జిల్లాల్లో టీడీపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని ఎవరైనా బెట్టింగ్ వేస్తే రూపాయికి 20 రూపాయిల రేషియో ఇస్తున్నారట. టీడీపీ సగానికి పైగా గెలుస్తుందని వేస్తే రూపాయికి మూడు రూపాయిల రేషియో ఇస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాపై పోటాపోటీగా బెట్టింగ్‌లు వేస్తున్నారట. ఎన్డీయే కూటమికి, వైసీపీకి సమానంగా వస్తాయని ఎక్కువ మంది బెట్టింగ్‌లు కడుతున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు ఎంపీతో పాటు.. కోవూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ నియోజకవర్గాలపై వందల కోట్ల రూపాయిల బెట్టింగ్‌లు ఇప్పటికే కట్టారని ప్రచారం జరుగుతోంది.
బెట్టింగ్ రాయుళ్ళ అంచనా ప్రకారం ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కూటమిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపైనా జోరుగా బెట్టంగ్‌లు కడుతున్నారట. జనసేనకు 21 స్థానాల్లో కనీసం 11 సీట్లు వస్తాయని.. ఈ సంఖ్య 15 వరకు వెళ్లినా ఆశ్చర్యం అవసరం లేదని బెట్టింగ్ రాయుళ్ళు అంచనా వేసినట్లు తెలుస్తోంది. రాయలసీమ జిల్లాల్లో మాత్రమే జనసేన ఓడిపోతుందని, విశాఖ, తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల్లోని అన్ని స్థానాల్లో దాదాపు విజయం సాధిస్తుందని బెట్టింగ్ రాయుళ్ళు చర్చించుకుంటున్నారు. బెట్టింగ్ రాయుళ్ళ అంచనాలు ఇలా ఉంటే.. అసలు ఫలితం మాత్రం జూన్4న వెల్లడికానుంది.
AP Elections 2024: ఏపీలో 81.6 శాతం పోలింగ్: సీఈవో ముఖేశ్ కుమార్ మీనా
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News And Telugu News