MLA Pinnelli: విగ్రహాల దొంగ.. వేల కోట్లకు ఎదిగాడు.. 8 హత్యలు, 130 దాడులు!
ABN , Publish Date - May 30 , 2024 | 02:28 AM
ఆలయాల్లో విగ్రహాల దొంగగా జీవితం ప్రారంభించిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.వేల కోట్లు అక్రమంగా ఆర్జించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది..
చంబల్ బందిపోట్లకు తగ్గని చరిత్ర
‘పీఆర్‌కే’ ట్యాక్స్ పేరుతో దోపిడీ
మద్యం ద్వారా రూ.400 కోట్లు
తెలుగుదేశం నేతల ఆగ్రహం
‘పిన్నెల్లి పైశాచికం’పై టీడీపీ పుస్తకం
అమరావతి, మే 29 (ఆంధ్రజ్యోతి): ఆలయాల్లో విగ్రహాల దొంగగా జీవితం ప్రారంభించిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.వేల కోట్లు అక్రమంగా ఆర్జించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. నియోజకవర్గంలో ఆయన 8 హత్యలు, 130 దాడులు చేయించారని విమర్శించింది. ఆయన అరాచకాలు, అవినీతిపై ఆ పార్టీ నేతలు బుధవారమిక్కడ తమ కేంద్ర కార్యాలయంలో ‘పిన్నెల్లి పైశాచికం’ పేరిట 28 పేజీల పుస్తకం విడుదల చేశారు. ఈ సందర్భంగా దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న, పి.అశోక్ బాబు, పిల్లి మాణిక్యాలరావు, ధారూ నాయక్, పారా కిశోర్‌రెడ్డి, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామన్న విజ్ఞత మరచి టెర్రరిస్టు మార్గంలో నడిచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు మాచర్లలో మారణహోమం సృష్టించారని దుయ్యబట్టారు. రూ.2 లక్షల ఆదాయం కలిగిన పిన్నెల్లి... గ్రానైట్, గ్రావెల్, మద్యం దోపిడీ, భూకబ్జాలు, ఇతర ఆస్తుల కబ్జా తదితర దోపిడీలతో రూ.2 వేల కోట్లకు అధిపతి అయ్యారని తెలిపారు. 2011-12లో ఆయన ఆదాయం రూ.1.95 లక్షలని.. ఇప్పుడు అధికారికంగా రూ.43 లక్షలుగా చూపిస్తున్నా.. అనధికారికంగా అది ఏటా రూ.250 కోట్లకు పైగానే ఉందన్నారు. అప్పులతో ఊరు వదిలిపోయిన పరిస్థితి నుంచి అధికారం అడ్డం పెట్టుకుని వేల కోట్లకు పడగెత్తారని ఆరోపించారు. మద్యం దోపిడీ ద్వారా రూ.400 కోట్లు సంపాదించారని, భూకబ్జాలతో 376 ఎకరాలు గడించారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ భూములు ఆక్రమించారని తెలిపారు.
‘చంబల్‌లోయ బందిపోట్లకు తగ్గని చరిత్ర పిన్నెల్లిది. విగ్ర హాలు ఎత్తుకుపోవడం నుంచి నేరాలు మొదలుపెట్టాడు. ఆలయాల్లో దోపిడీలు చేసినవాడు దేవుడి మీద ప్రమాణం చేసినా ఉపయోగం లేదు. మాచర్ల సెంటర్లో భార్యా పిల్లలతో వచ్చి తాను విగ్రహాలు దొంగతనం చేయలేదని వారిపై ఆయన ప్రమాణం చేయగలడా? ఆయన తమ్ముడు మరో దొంగ. ఇటువంటి వ్యక్తిని వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేను చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఫ్యాక్షనిజం చాలావరకూ పోయింది. ఒక్క మాచర్లలోనే ఇంకా మిగిలిపోయింది. మాచర్ల మీదుగా ఏ గ్రానైట్ రాయి రవాణా చేయాలన్నా పిన్నెల్లికి ట్యాక్స్ కట్టాలి. ఈ ఒక్క దోపిడీతోనే రూ.1,200 కోట్లు సంపాదించాడు. గ్రానైట్ రాళ్లు, సున్నపురాళ్లు తిని అరాయించుకోగలిగిన శక్తిమంతుడు. నియోజకవర్గంలో ఏ చిన్న నిర్మాణ పని జరిగినా కాంట్రాక్టర్లు ఆయనకు ఐదు శాతం కమీషన్ ఇవ్వాలి. రైతులు పాస్ పుస్తకం తీసుకోవాలంటే రూ.15 వేలు కట్టాలి. ఎమ్మెల్యే అరాచకానికి అడ్డే లేదు. స్థానిక ఎన్నికల సమయంలో మేం మాచర్లకు వెళ్లాం. మాపై ఎవరుదాడి చేస్తే వాళ్లకు మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని వైసీపీ వాళ్లకు పిన్నెల్లి ఆఫర్ ప్రకటించాడు. పదవికి ఆశపడి తురకా కిశోర్ మాపై దాడిచేశాడు’ అని వెంకన్న చెప్పారు.
సీబీఐ దర్యాప్తు కోసం పిటిషన్..
ఈవీఎం ధ్వంసం చేశాక పిన్నెల్లికి కోర్టులో బెయిల్ రావడానికి పది రోజులు పట్టిందని, అయినా ఈ లోపు మాచర్ల పోలీసులు ఆయన్ను అరెస్టు చేయలేకపోయారని హైకోర్టు న్యాయవాది పారా కిశోర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మాచర్ల సీఐగా పనిచేసిన భక్తవత్సలరెడ్డి ఎమ్మెల్యే ఇంటి మనిషిగా పనిచేశారని, తమపై మాచర్లలో జరిగిన దాడిని స్థానిక పోలీసులు పట్టించుకోకపోతే సీబీఐ దర్యాప్తు కోరుతూ తాము హైకోర్టులో పిటిషన్ వేయాల్సి వచ్చిందని చెప్పారు. తాము పుస్తకంలో వేసినవి చాలా తక్కువని, పిన్నెల్లి వ్యవహారాలపై మాచర్లలో కథలు కథలుగా చెబుతున్నారని మాణిక్యాలరావు అన్నారు. ధన పిశాచిలా రేషన్ బియ్యం నుంచి మొదలుకొని గ్రానైట్ వరకూ దోచాడని, రక్త పిశాచి మాదిరిగా మాచర్ల నియోజకవర్గంలో 8 మందిని కిరాతకంగా చంపించాడని ఆరోపించారు. ఇన్ని అక్రమాలు చేసిన పిన్నెల్లి చాలా మంచోడని ముఖ్యమంత్రి జగన్ మాచర్ల సభలో కితాబిచ్చారని, ఆయన దౌర్జన్యాలను ఆదర్శంగా తీసుకుని మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ప్రతిపక్షాన్ని అణచివేయాలని సీఎం సలహా ఇవ్వడం ఈ రాష్ట్ర దౌర్భాగ్యమని దేవినేని వ్యాఖ్యానించారు.