AP News: పవన్ కళ్యాణ్‌తో అనిత భేటీ.. కీలక అంశాలపై చర్చ
ABN , Publish Date - Oct 29 , 2024 | 08:54 PM
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని హోంమంత్రి అనిత కలిశారు. మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి కార్యాలయంలో ఇవాళ(మంగళవారం) వీరిద్దరూ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు.
అమరావతి: ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని హోంమంత్రి అనిత కలిశారు. మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి కార్యాలయంలో ఇవాళ(మంగళవారం) వీరిద్దరూ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, దీపావళి నేపథ్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రమాదం జరిగినా అప్రమత్తంగా ఉండేలా 185 అగ్నిమాపక స్టేషన్ల సిబ్బందికి ఆదేశాలిచ్చినట్లు హోంమంత్రి వెల్లడించారు. 100 లేదా 101 నంబర్లకు ఫోన్లు చేసి టపాకాయల అక్రమ తయారీపై పోలీస్, ఫైర్ వ్యవస్థలకు ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకున్నట్లు హోంమంత్రి అనిత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తెలిపారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామం తరహా దీపావళి టపాకాయల పేలుడు ఘటనలు జరగకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. వాయు కాలుష్యం దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలో దీనిపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకటించిన 'దియాజలావ్' కార్యక్రమం తరహాలో ఏపీలోనూ ప్రజలకు అవగాహన కల్పించాలని డిప్యూటీ సీఎం అన్నారు. పర్యావరణరహిత టపాకాయలకు పెద్దపీట వేస్తూ దీపావళి జరుపుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియాకు సంబంధించి తాజా పరిస్థితులపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనితను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం డయేరియా కేసుల నమోదు తగ్గిందని పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. ఇటీవల రాష్ట్రంలో విమానాల్లో బాంబు బెదిరింపులపైనా హోంమంత్రిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన అరాచక పరిస్థితులు, దుర్మార్గాలపై చట్టప్రకారం వేగంగా దర్యాప్తు చేసి, నిందితులను శిక్షించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నిర్వహణపై డిప్యూటీ సీఎం ప్రశంసలు కురిపించారు. నేరాల నియంత్రణలో మొబైల్ ఫోన్ వినియోగించాలని హోంమంత్రి ప్రజల భాగస్వామ్యం కోరడాన్ని పవన్ కళ్యాణ్ అభినందించారు.
డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాల పట్ల గతంలో లేని విధంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను ఉపముఖ్యమంత్రికి హోంమంత్రి వివరించారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో లింగాపురం నుంచి కొడవటిపూడి కట్ట వరకు సుమారు కి.మీ మేర నిర్మించనున్న ఆర్ అండ్ బీ రోడ్డుకు అటవీ శాఖ అనుమతులు ఇప్పించాలని హోంమంత్రి అనిత పవన్ కళ్యాణ్‌ను కోరారు. పాయకరావుపేటలోని వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తికి చొరవ చూపాలని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు వినతిపత్రం సమర్పించారు. తన నియోజకవర్గంలోని పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణంతో సహా ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రాధాన్యతను పవన్ కళ్యాణ్‌కు హోంమంత్రి అనిత వివరించారు.