AP NEWS: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ అక్రమాలు.. వెలుగులోకి తెచ్చిన ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి
ABN , Publish Date - Dec 17 , 2024 | 09:04 AM
జగన్ ప్రభుత్వంలో ఏపీ సీఐడీ చీఫ్‌గా పనిచేసిన సంజయ్ దళితుల పేరుతో ప్రభుత్వ సొమ్మును జేబులో వేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీలపై నేరాల కట్టడిలో భాగంగా అట్రాసిటీ చట్టంపై ఆయా వర్గాల్లో అవగాహన కార్యక్రమం పేరిట రూ. 3 లక్షలు ఖర్చు చేసి, రూ.1.16 కోట్లు స్వాహా చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఈ విషయంపై ఏసీబీ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.
అమరావతి: ఐపీఎస్ అధికారి సంజయ్‌పై ఏసీబీ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ అంశాన్ని ముందుగానే ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి వెల్లడించింది. అగ్నిమాపక శాఖ, సీఐడీ డీజీగా ఉన్న సమయంలో నిధులు దుర్వినియోగం చేశారని సంజయ్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విజిలెన్స్ ఎన్‌ఫో ర్స్‌మెంట్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. విచారణ జరిపి ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని విజిలెన్స్ విభాగం నివేదిక ఇచ్చింది. ఈ ఆరోపణలపై సంజయ్‌ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఈ కేసును ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఇచ్చింది. విచారణ చేయాలంటే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 A కింద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఏసీబీ అనుమతి కోరింది. అనుమతి వచ్చిన వెంటనే కేసు నమోదు చేయాలని ఏసీబీకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
1.16 కోట్లు స్వాహా చేశారనే అభియోగాలు ..
జగన్ ప్రభుత్వంలో సీఐడీ చీఫ్‌గా పనిచేసిన సంజయ్ దళితుల పేరుతో ప్రభుత్వ సొమ్మును జేబులో వేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీలపై నేరాల కట్టడిలో భాగంగా అట్రాసిటీ చట్టంపై ఆయా వర్గాల్లో అవగాహన కార్యక్రమం పేరిట రూ. 3 లక్షలు ఖర్చు చేసి, రూ.1.16 కోట్లు స్వాహా చేశారనే అభియోగాలు ఉన్నాయి. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో ఈ దోపిడీ వెలుగులోకి వచ్చింది. 2023-24 బడ్జెట్‌లో సీఐడీ ఖర్చులకు రూ.32.44 కోట్లు గ ప్రభుత్వం కేటాయించింది. అట్రాసిటీ చట్టంపై ఎస్సీ, ఎస్టీలకు అవగాహన పెంచేందుకు ఇందులోనే జగన్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. ఇదే అవకాశంగా రాష్ట్రంలోని 25 ప్రాంతాల్లో దళితులు, గిరిజనులతో పాటు స్థానిక పోలీసు సిబ్బందికి అవగాహన పెంచుతామంటూ నాటి సీఐడీ అధిపతి సంజయ్ ప్రణాళిక సిద్ధం చేశారు.
ఇష్టానుసారం దొంగ బిల్లులు..
ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు మార్గదర్శకాలకు భిన్నంగా హడావుడిగా ఒక ప్రైవేటు ఏజెన్సీతో కాంట్రాక్టు కదుర్చుకున్నారు. రూ.1.19 కోట్లు ఖర్చు చేసేందుకు అగ్రిమెంటు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో 25 చోట్ల అవగాహనా కార్యక్రమాలు నిర్వహించగా, 24 చోట్ల ప్రభుత్వ భవనాలు వాడుకున్నారు. వీటికి అద్దె చెల్లించినట్లుగా ఇష్టానుసారం దొంగ బిల్లులు పెట్టారు. ప్రభుత్వ ఫర్నీచర్ వాడుకోగా, తెలిసినవారు టీ, స్నాక్స్ సమకూర్చారు. సీఐడీ అధికారులే తమ సెల్‌ఫోన్లతో వీడియోలు తీశారు. కానీ ఇందుకు లక్షల్లో ఖర్చు పెట్టినట్టు దొంగ బిల్లులు సృష్టించారు. ఈ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీకి ఇచ్చినట్టుగా రూ. 1.19 కోట్లు డ్రా చేశారు. మొత్తం రూ.3.10 లక్షలు ఖర్చు చేసి, రూ. 1.16 కోట్లు నొక్కేశారు. అంతసొమ్ము ఖర్చయిందా అని అప్పట్లోనే సీఐడీ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో విచారణ జరిపించడంతో ఈ దోపిడీ వెలుగు చూసింది.
విజిలెన్స్ విచారణతో వెలుగులోకి..
జగన్ ప్రభుత్వంలో దళితులు, గిరిజనుల్లో అట్రాసిటీ చట్టంపై అవగాహన పెంచే సమావేశాల కోసం తగిన ఏర్పాట్లు చేసేందుకు ఏపీ సీఐడీ టెండర్లు పిలిచింది. అప్పుడు సీఐడీ అధిపతిగా సంజయ్ ఉన్నారు. ఈ టెండర్లలో హైదరాబాద్‌లోని క్రిత్వాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, సౌత్రికా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మెటా పాయింట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలు పాల్గొన్నాయి. క్రిత్వాప్ టెక్నాలజీస్ రూ.59,52,500తో ఎస్టీ సభల కోసం ఎల్-1గా, ఎస్సీల సభల కోసం రూ.59,51,100తో ఎల్-1గా నిలిచింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన సమావేశాల్లో కనీస స్థాయిలో కూడా ఖర్చు చేయలేదని కూటమి ప్రభుత్వం వచ్చాక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ హరీశ్ కుమార్ గుప్తా అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. రంగంలోకి దిగిన బృందాలు విచారణ చేపట్టాయి. హైదరాబాద్‌కు వెళ్లి విచారించగా క్రిత్వాప్ అనే సంస్థ పేరుతో బిడ్డర్ లేరని తేలింది. ఈ సంస్థ విజయవాడలో ఉన్నట్టు వెల్లడైంది. అలాగే సౌత్రికా టెక్నాలజీస్ కూడా విజయవాడలోనే ఉందని గుర్తించారు. ఈ రెండు సంస్థలూ ఒక్కరివేనని విచారణలో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా 25 చోట్ల సీఐడీ నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఈ ఏజెన్సీ పాత్ర గురించి విజిలెన్స్ అధికారులు విచారించారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు రీజినల్ విజిలెన్స్ అధికారులు పూర్తి ఆధారాలు సేకరించి డీజీ హరీశ్ కుమార్ గుప్తాకు నివేదించారు.
ఈ వార్తలు కూడా చదవండి
YSRCP : సజ్జల భార్గవ్ కేసుల వివరాలన్నీ ఇవ్వండి
Political Conflict : వైసీపీ నేతల ఆగడాలు అడ్డుకోండి
AP Skill Development : ఏపీలో 532 స్కిల్ హబ్‌లు
Read Latest AP News and Telugu News