Share News

AP News: ఏపీ సీఎం చంద్రబాబు ఆరు నెలల పాలనపై నిప్పులు చెరిగిన షర్మిల..

ABN , Publish Date - Dec 12 , 2024 | 09:59 PM

ఒక్కొ రైతుకీ రూ.20 వేల సహాయం చేసే పథకం అన్నదాత సుఖీభవను దుఃఖీభవగా మార్చారని ఏపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి మండిపడ్డారు. ప్రతి నెలా రూ.1,500 చొప్పున ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పారని, ఆ ఆడబిడ్డ నిధి ఎక్కడో అడ్రెస్సే లేకుండా పోయిందని ఆమె అన్నారు.

AP News: ఏపీ సీఎం చంద్రబాబు ఆరు నెలల పాలనపై నిప్పులు చెరిగిన షర్మిల..
APCC chief YS Sharmila Reddy

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ఆరు నెలల పాలనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమి గెలిచిన 6 నెలల కాలంలో సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేకుండా పోయిందని ఆమె అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ మ్యానిఫెస్టోలో పెట్టిన 60 హామీలు సైతం పత్తా లేకుండా పోయాయని షర్మిల మండిపడ్డారు. మూడు ఉచిత సిలిండర్లలో ఈ ఏడాది సింగిల్ సిలిండర్‌తో సరిపెట్టారని ఎద్దేవా చేశారు. రూ.3 వేల నిరుద్యోగ భృతి ఊసే లేకుండా చేశారని, 20 లక్షల ఉద్యోగాలు అవిగో, ఇవిగో అంటూ కాలయాపన చేస్తున్నారని షర్మిల విమర్శించారు. పాఠశాలకు వెళ్లే ప్రతి బిడ్డకూ రూ.15 వేలు ఇస్తామని తల్లులకు పంగనామాలు పెట్టారని ఏపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


పథకాల సంగతేంటి?

ఒక్కొ రైతుకీ రూ.20 వేల సహాయం చేసే పథకం అన్నదాత సుఖీభవను దుఃఖీభవగా మార్చారని ఏపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి మండిపడ్డారు. ప్రతి నెలా రూ.1,500 చొప్పున ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పారని, ఆ ఆడబిడ్డ నిధి ఎక్కడో అడ్రెస్సే లేకుండా పోయిందని ఆమె అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఎప్పుడని ప్రశ్నిస్తే పండుగలు, పబ్బాల పేరు చెప్పి కాలం డొల్లిస్తున్నారని షర్మిల విమర్శించారు. జూన్ 12న తొలి సంతకం పెట్టిన డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఇంతవరకూ దిక్కులేదని అన్నారు. ఉచిత ఇసుక పథకంలో ఉచితం ఎక్కడా కనిపించలేదని ఆమె ఎద్దేవా చేశారు. బాబు గారి 6 నెలల పాలన ఎలా ఉందంటే.. మండలానికి 3 మద్యం షాపులు 30 బెల్టు షాపుల్లాగా, అభివృద్ధిలో 3 మాటలు 30 గ్రాఫిక్స్ డిజైన్లుగా ఉందని షర్మిల విమర్శించారు.


పీల్చి పిప్పి చేస్తున్నారు..!

ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ షర్మిల మాట్లాడుతూ.. " ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం మెుదటి ఐదేళ్లల్లో సీఎం చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తే ఇప్పుడు మళ్లీ అదే చేతిలో కైలాసం చూపిస్తున్నారు. బాబు షూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కాస్త బాబు షూరిటీ వడ్డింపులకు గ్యారెంటీలా మారింది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రూ.17,500 కోట్లు జనం నెత్తిన వేశారు. క్వాలిటీ మద్యం అంటూనే ధరలు పెంచి జనాలను పీల్చి పిప్పి చేస్తున్నారు. మా తప్పేం లేదంటూనే జనం నెత్తిన ఆర్థిక భారం మోపుతున్నారు. ఇచ్చిన హామీలు సంగతేంటని అడిగితే చంద్రబాబు ఇప్పటికీ చెప్తున్న సమాధానం రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని. వైసీపీ వాళ్లు ఐదేళ్లు అడవి పందుల్లాగా రాష్ట్రాన్ని మేశారని, వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, గాడిలో పెట్టాలని చంద్రబాబు అంటున్నారు.


అమలుపై దృష్టి పెట్టండి..

నిజమే వైసీపీ ఐదేళ్ల పాలన దోపిడీ పాలన, దొంగల పాలన. నేల, నీరు, ఖనిజం, ఒక్కటేంటి కన్ను పడిందల్లా కాజేశారు. వాళ్లు తిన్నారు కాబట్టే జనాలు బుద్ధి చెప్పారు. రాష్ట్రాన్ని దివాలా తీయించారు కాబట్టే 11 సీట్లకు ప్రజలు పరిమితం చేశారు. మీరేదో ఉద్దరిస్తారని మీకు పట్టం కడితే మీరు చేసేదేంటి?. ఈ ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని గాడిలో పెడుతూనే ఉంటారా?. ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టరా?. ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ గత ప్రభుత్వ తప్పిదాలను అడ్డుపెట్టుకుంటూ 6 నెలలు కాలయాపన చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. మీ 4.0 ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసింది బాబు గారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా చూడండి" అని అన్నారు.

Updated Date - Dec 12 , 2024 | 10:02 PM