BJP Yamini Sharma:జగన్ దోచుకున్న సొమ్ములను కక్కిస్తాం.. యామినీ శర్మ మాస్ వార్నింగ్
ABN , Publish Date - Nov 21 , 2024 | 12:39 PM
పేదల బతుకుపై దెబ్బ కొట్టిన వ్యక్తి జగన్ అని బీజేపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ ఆరోపించారు. జగన్ పాలనలో అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి రాజ్యమేలిందని విమర్శించారు. మహిళలు, యువత, రైతులు, శ్రామికులు అన్ని రంగాల్లో అబివృద్ధి చెందాలనేది మోదీ లక్ష్యమని తెలిపారు.
విజయవాడ: గడిచిన ఐదేళ్లల్లో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దోచుకున్న సొమ్ములను మొత్తం బయటకు తీస్తామని బీజేపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ హెచ్చరించారు. గడిచిన ఐదేళ్లల్లో అవినీతికి కేరాఫ్ అడ్రస్ , నియంతృత్వ పాలన, ఫ్యాక్షనిజానికి కేరాఫ్ అడ్రస్ జగన్ పాలన అని విమర్శించారు. ఇవాళ(గురువారం) విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో యామినీ శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగన్, వైసీపీ పార్టీపై సంచలన విమర్శలు చేశారు. జగన్ పాలనలో అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు. పేదల ఇళ్ల కోసం కేటాయించిన నిధులను కూడా దారి మళ్లించేశారని మండిపడ్డారు. పబ్లిసిటీ పిచ్చి పీక్‌లో ఉన్న జగన్ కేంద్రం ఇచ్చిన పథకాలకు తన స్టిక్కర్ వేయించుకున్నారని ధ్వజమెత్తారు.
భూమి హక్కు దారులను కూడా కాదని తన సొంత భూముల్లాగా పట్టాదారుపాస్ పుస్తకాలపై జగన్ తన ఫొటో వేయించుకున్నారని మండిపడ్డారు. దేశం మొత్తం అమలవుతున్న కేంద్రం పథకానికి కూడా తన పేరు, స్టిక్కర్ మార్చుకున్నారని విమర్శించారు. జగన్ అబద్దాలు తెలుసుకున్న కేంద్రం నాలుగు వేల కోట్లు రూపాయలు నిలిపేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల బతుకుపై దెబ్బ కొట్టిన వ్యక్తి జగన్ అని ఫైర్ అయ్యారు. గత ఐదేళ్లల్లో జరిగిన అక్రమాలు, అవినీతి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుందని అన్నారు. ఇసుక, మద్యం ద్వారా వేల కోట్లు దోచేశారని మండిపడ్డారు. పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నెరవేర్చారని అన్నారు. మహిళలు, యువత, రైతులు, శ్రామికులు అన్ని రంగాల్లో అబివృద్ధి చెందాలనేది మోదీ లక్ష్యమని తెలిపారు. 2017లో ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 4కోట్ల ఇళ్లు నిర్మించారని గుర్తుచేశారు. ఇందులో మూడు కోట్ల మంది మహిళలను ఇంటి యజమానురాలుగా మోదీ మార్చారని అన్నారు. మహిళా సాధికారితను ఆచరించి చూపిన నేత మోదీ అని ప్రశంసించారు. ఈ ఇళ్లల్లో 65శాతం ఎస్సీ, ఎస్టీలకు 5శాతం వికలాంగులకు కేటాయించారని యామినీ శర్మ అన్నారు.
జగన్‌లో మానవత్వం లేదు..
‘‘కొండ ప్రాంతాల్లో కూడా 84లక్షల ఇళ్ల నిర్మాణం చేసి ఇచ్చారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించే విధంగా వివిధ సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు. వచ్చే ఐదేళ్లల్లో 5.36లక్షల కోట్లతో మరో మూడు లక్షల ఇళ్లు నిర్మించేంలా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏపీలో పట్టణాల్లో 21.37లక్షల ఇళ్లను కేటాయించగా, గ్రామాల్లో 2.30లక్షల ఇళ్లను నిర్మాణం చేసింది. ఇందు కోసం రూ. 32వేల కోట్లు కేటాయించగా, పూర్తైన ఇళ్లకు రూ. 23వేల 800కోట్లు విడుదల కూడా చేసింది. రూ.1.80లక్షలు ఒక్కో ఇంటికి కేంద్రం ఇవ్వడంతో పాటు, బ్యాంకులో రుణ సదుపాయం కూడా కల్పించింది. ఇప్పుడు జగన్ చెబుతున్న నీతి సూత్రాలు చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంది. ప్రశ్నించిన వారిపై అన్యాయంగా కేసులు పెట్టి అరెస్టులు చేయించారు. ఇప్పుడు మానవత్వ విలువలు అంటూ జగన్ మాట్లాడుతున్నారు. గత ఐదేళ్లల్లో ఇటువంటి మానవత్వం జగన్‌లో ఎందుకు లేకుండా పోయింది.కల్తీ మద్యంతో వేలాది మంది మహిళల పుస్తెలు తెంపన వ్యక్తి జగన్. గంజాయి, మద్యం, డ్రగ్స్, చీప్ లిక్కర్, మహిళల మిస్సింగ్‌లో, శాంతిభధ్రతల క్షీణించడంలో మన రాష్ట్రాన్ని నెంబర్ వన్‌లో నిలిపారు. మరో రెండు నెలల్లో లక్ష ఇళ్లను పూర్తి చేయాలనే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని జగన్ చేతకాని విధానాలతో దుర్వినియోగం చేశారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి మేలు చేసే విధంగా పాలన సాగుతుంది.మూడు ఇండస్ట్రీయల్ కారిడార్ లోపల అభివృద్దికి కేంద్రం నిధులు ఇచ్చింది’’ అని తెలిపారు.
జగన్‌వి డైవర్షన్ పాలిటిక్స్..
‘‘ఏపీ అభివృద్దిలో కేంద్రం చాలా సహకారం అందిస్తుంది. ఇవన్నీ చూసి జగన్ తట్టుకోలేక.. డైవర్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు కాబట్టే.. వైసీపీ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారు.వైసీపీ హయాంలో విచ్చలవిడిగా దోచుకున్న నాయకులు... పచ్చి బూతులు మాట్లాడారు. మహిళలపై అన్యాయంగా పోస్టులు పెట్టి, నోరు పారేసుకున్న వారు నేడు అనుభవించాల్సిందే. దయ, జాలి, కరుణ ఏమాత్రం చూపని జగన్, వైసీపీ నేతలు చట్టం ముందు దోషులుగా నిలబపడి తీరుతారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తుంది. అమరావతి రాజధానికి కూడా కేంద్రం నిధులు విడుదల చేసింది. ఏపీలో జగన్ అనే వ్యక్తిని అధికారానికి చాలా దూరంగా పెట్టాలని ప్రజలే నిర్ణయించుకున్నారు. ఏపీ అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. వచ్చే ఐదేళల్లో ఆంధ్రప్రదేశ్ రూపు రేఖలు చూసి అందరూ ఆశ్చర్యపోతారు’’ అని యామినీ శర్మ పేర్కొన్నారు.