Pawan Kalyan: ఆ నిధులు ఏమయ్యాయి ?.. అధికారులపై పవన్ సీరియస్
ABN , Publish Date - Jun 26 , 2024 | 06:20 PM
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో మిగిల్చింది రూ.7 కోట్లు మాత్రమేనని అయిదు నెలల జీతాలకు మాత్రమే సరిపోతాయిని ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సీరియస్ అయ్యారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు(బుధవారం) సచివాలయంలోని తన ఛాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అమరావతి: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో నిధుల మాయంపై ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సీరియస్ అయ్యారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలపై పవన్ కల్యాణ్ ఈ రోజు (బుధవారం) సచివాలయంలోని తన ఛాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఈ కార్పొరేషన్‌కు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో మిగిల్చింది రూ.7 కోట్లు మాత్రమేనని, ఐదు నెలల జీతాలకు మాత్రమే సరిపోతాయని.. అసలు నిధులు ఏమయ్యాయి అని పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు.
నిధుల గోల్‌మాల్‌పై ఆ కార్పొరేషన్ అధికారులు వివరాలు చెబుతుండగా డిప్యూటీ సీఎం విస్మయం వ్యక్తం చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2,092 కోట్లు నిధి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అని పవన్ ప్రశ్నించారు. కార్పొరేషన్ నిధులు ఎటు మళ్లించారు? అని ఆయన నిలదీశారు. నిధుల మాయంపై వివరణ ఇవ్వాలని అడిగారు. నిధులు ఎటు వెళ్లాయని, ఏం చేశారో సవివరంగా విచారణ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.