AP NEWS: ఆ నేత రాజీనామా ఆమోదంతో టీడీపీ అప్రమత్తం
ABN , Publish Date - Jan 23 , 2024 | 08:34 PM
టీడీపీ సీనియర్ నేత, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivasa Rao ) రాజీనామాకు నేడు (మంగళవారం) అసెంబ్లీ స్పీకర్ ఆమోదం తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలకు మద్ధతుగా రెండేళ్ల క్రితం గంట శ్రీనివాస రావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
అమరావతి: టీడీపీ సీనియర్ నేత, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivasa Rao ) రాజీనామాకు నేడు (మంగళవారం) అసెంబ్లీ స్పీకర్ ఆమోదం తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలకు మద్దతుగా రెండేళ్ల క్రితం గంట శ్రీనివాసరావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ ఎన్నికల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. అయితే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంతో టీడీపీ అప్రమత్తం అయింది. త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల నాటికి.. తమ సంఖ్యా బలం తగ్గించేలా వైసీపీ ( YCP ) కుట్ర పన్నుతోందని టీడీపీ నేతలు అంటున్నారు.
పార్టీ మారిన నలుగురు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలపైనా వేటు వేసే అవకాశం లేకపోలేదని టీడీపీ ( TDP ) అంచనా వేసింది. ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పైనా వేటుపడుతుందని టీడీపీ భావిస్తోంది. వైసీపీ వ్యూహానికి టీడీపీ కౌంటర్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తామిచ్చిన అనర్హత పిటీషన్ల ఆమోదం విషయంలో స్పీకర్‌పై ఒత్తిడి పెంచాలని టీడీపీ భావిస్తోంది. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వంశీ, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్‌పై కూడా టీడీపీ అనర్హత పిటిషన్ వేసింది. వైసీపీకి మద్దతు ఇస్తున్న టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అధికారులు ఈ రోజు నోటీసులిచ్చారు.