Share News

AP Politics: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు హోంమంత్రి అనిత రిప్లై..

ABN , Publish Date - Nov 04 , 2024 | 10:01 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏ కేసు విషయంలో ఆగ్రహంతో ఉన్నారో తనకు తెలుసని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. త్వరలోనే దాని గురించి ఆయనతో మాట్లాడతానని అనిత చెప్పారు.

AP Politics: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు హోంమంత్రి అనిత రిప్లై..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచార ఘటనలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పూ లేదని ఆమె అన్నారు. పవన్ ఏ కేసు విషయంలో ఆగ్రహంతో మాట్లాడారో తెలుసని, త్వరలోనే దాని గురించి ఆయనతో మాట్లాడతానని అనిత చెప్పుకొచ్చారు. ఏపీలో శాంత్రిభద్రతల విషయమై సీఎం చంద్రబాబు, తాను పోలీసులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. ఆ చర్చల్లో పవన్ కూడా భాగమేనని అన్నారు. ఉప ముఖ్యమంత్రికి అన్నీ విషయాలు తెలుసని, ఆయన మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పూ లేదని అనిత చెప్పారు.


పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి, భద్రతలు ఏమాత్రం బాగోలేదంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగిక దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. నేరస్థులకు కులం, మతం అనే భేదాలు ఉండవని చెప్పారు. ఏపీలో ఇటీవల జరుగుతున్న ఘటనలకు హోంమంత్రి అనిత బాధ్యత వహించాలని అన్నారు. మంత్రి స్థానంలో ఉన్నవారు బాధ్యతాయుతంగా మెలగాలని, చలనం లేకుండా ఉంటే క్రిమినల్స్ రెచ్చిపోతారని పవన్ చెప్పుకొచ్చారు. పరిస్థితి ఇలానే ఉంటే తానే హోంమంత్రి బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు.


లైంగిక దాడులపై పవన్ ఆందోళన..

కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సోమవారం నాడు పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన శాంతిభద్రతలపై వ్యాఖ్యలు చేశారు. పిల్లలపై లైంగికదాడులు జరగడంపై ఉప ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు, తాను ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు. అయినప్పటికీ కొందరు పోలీసులు అలసత్వం వీడటం లేదని మండిపడ్డారు. నిజాయితీగా పనిచేయాలని చెబితే మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల చిన్నారిని రేప్ చేసి చంపేస్తే కులం గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కొందరు ఐపీఎస్ అధికారులు క్రిమినల్స్‌ను వెనకేసుకు వచ్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాను హోంశాఖను తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు. ధైర్యం లేనివారు పోలీసులుగా ఉండటం ఎందుకని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి.

ఈ వార్తలు కూడా చదవండి:

Guntur: విద్యార్థినిలతో వెకిలి చేష్టలు.. ఉపాధ్యాయుడి గతి ఏమైందంటే..

AP Govt: అరబిందో సంస్థకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..

Updated Date - Nov 04 , 2024 | 10:01 PM