Sri Krishna Devarayalu: ఏపీ ఆర్థిక పరిస్థితిపై కృష్ణదేవరాయులు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 20 , 2024 | 09:17 PM
ఏపీ ఆర్థిక పరిస్థితి చూస్తోంటే బాదేస్తోందని ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు (Lavu Sri Krishna Devarayalu) తెలిపారు. ఎంపీలుగా గెలిచిన ఆ ఆనందం ఉన్నా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ సంతోషం లేకుండా పోయిందని చెప్పారు.
అమరావతి: ఏపీ ఆర్థిక పరిస్థితి చూస్తోంటే బాదేస్తోందని ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు (Lavu Sri Krishna Devarayalu) తెలిపారు. ఎంపీలుగా గెలిచిన ఆ ఆనందం ఉన్నా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ సంతోషం లేకుండా పోయిందని చెప్పారు. తమ శాఖలకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో కేంద్ర మంత్రులే వివరిస్తున్నారని అన్నారు.
ఏపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలను అంగీకరించేలా కేంద్రంపై ఒత్తిడి తేవడమే కాదు.. దగ్గరుండి మరీ పని చేస్తామని వివరించారు. ఎంపీల పనితీరు మీద ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారని అన్నారు. 35 మంది హత్యకు గురయ్యారని చెబుతున్న జగన్.. వారి వివరాలు ఇవ్వగలరా..? అని ప్రశ్నించారు.
పూర్తి అవాస్తవాలను జగన్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వినుకొండ ఘటనకు జగన్ రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు. వినుకొండ ఘటన గ్రూపుల గొడవేనని స్పష్టం చేశారు. రెండున్నరేళ్ల నుంచి ఆ గ్రూపుల మధ్య గొడవ జరుగుతూనే ఉందని తేల్చిచెప్పారు. అప్పటి ఎమ్మెల్యే ఓ గ్రూపును సపోర్ట్ చేసి మరింత గొడవను రాజేశారని ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా.. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఈరోజు (శనివారం) భేటీ అయింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అధ్యక్షతన ఈ సమావేశం జరిగిన భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. ఉడవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీకి ఎంపీలు, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చించారు. ఈ నెల 22వ తేదీ నుంచి పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. మంత్రుల నుంచి వివిధ శాఖల సమాచారాన్ని తీసుకుని కేంద్రంతో ఎంపీలు సంప్రదింపులు జరపాలని చంద్రబాబు సూచించారు. పరిస్థితిని బట్టి రాష్ట్ర మంత్రులను వెంటబెట్టుకుని కేంద్ర మంత్రులను కలవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రాభివృద్ధే ప్రధాన అజెండాగా ఎంపీలు పోటీపడాలన్న సీఎం చంద్రబాబు తెలిపారు. ఢిల్లీలో జగన్ ధర్నాపైనా చర్చించారు. జగన్, వైసీపీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఎంపీలు తెలిపారు. జగన్ గురించి ఆలోచించే సమయాన్ని.. రాష్ట్రాభివృద్ధి కోసం వెచ్చించాలని ఓ మంత్రి తెలిపారు.