Chandrababu: చంద్రబాబు చేతుల మీదుగా ఫించన్ అందుకునేది వీరే..
ABN , Publish Date - Jun 29 , 2024 | 06:48 PM
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షనర్ల ఇంటికి వెళ్లి పెన్షన్లను తన చేతుల మీదుగా అందజేయనున్నారు.
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షనర్ల ఇంటికి వెళ్లి పెన్షన్లను తన చేతుల మీదుగా అందజేయనున్నారు. దేశ చరిత్రలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సీఎం పెన్షన్ పంపిణీ చేయడం ఇదే తొలిసారి. పేదింటి మహిళకు సీఎం స్వయంగా పెన్షన్ అందచేయడం ఇదే ప్రథమం. సీఎం పర్యటనతో పెనుమాక వచ్చి అధికారులు పరిశీలించారు. పెన్షన్ లబ్ధిదారుల జాబితా అధికారులు సేకరించారు.
అయితే మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో సుగాలి తండాకు చెందిన తండ్రి, కూతుళ్లకు జూలై నెల 1న ఇంటికి వెళ్లి సీఎం చంద్రబాబు పెన్షన్ ఇవ్వనున్నారు. పెనుమాక గ్రామానికి చెందిన ఇస్లావత్ సాయికి ఒంటరి మహిళా పెన్షన్ కింద పెంచిన రూ.1000తో కలిపి రూ.4000 వేలు ఏప్రిల్, మే, జూన్‌లో పెంచిన పెన్షన్ రూ.3 వేలు కలిపి మొత్తం రూ.7వేలు స్వయంగా అందించనున్నారు. ఆమె తండ్రి బానావత్ పాములుకు పెంచిన వెయ్యి రూపాయిలతో కలిపి రూ. 4 వేలు ఏప్రిల్, మే, జూన్ నెలలను కలిపి మొత్తం మొత్తంగా రూ.7 వేలు స్వయంగా అందజేస్తారు.
కాసేపు బానావత్ పాముల ఇంటి వద్దే ఉండి అక్కడ నుంచి అంగన్వాడీ కేంద్రానికి కాలినడకన చేరుకోనున్నారు. అంగన్వాడీ కేంద్రం ముందున్న చెట్టు వద్ద నిలబడి గ్రామస్థులతో ముఖాముఖిలో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. సీఎం గ్రామస్థులతో మాట్లాడే ప్రాంతానికి ప్రజావేదికగా నామకరణం చేశారు. ప్రజల సమస్యలు వినే ప్రజావేదికను మాజీ సీఎం జగన్ కూల్చేసిన విషయం తెలిసిందే. పెనుమాక గ్రామంలో ప్రజలతో మాట్లాడే ప్రాంతానికి ప్రజావేదికగా సీఎం చంద్రబాబు నాయుడు నామకరణం చేయనున్నారు.