YSR Jayanthi: వేర్వేరుగా నివాళులు
ABN , Publish Date - Jul 09 , 2024 | 03:34 AM
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతినాడు ఇడుపులపాయలోని ఆయన సమాధి సాక్షిగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆయన సోదరి, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.
వైఎస్ సమాధి సాక్షిగా అన్నాచెల్లెళ్ల విభేదాలు మళ్లీ బహిర్గతం
ఉదయాన్నే వచ్చి జగన్ నివాళి.. ఘాట్ వద్ద 15 నిమిషాలే
కొడుకును చూసి విజయలక్ష్మి కన్నీరు.. పెద్దగా స్పందించని జగన్
ఆ తర్వాత వచ్చి నివాళులర్పించిన పీసీసీ చీఫ్ షర్మిల
కడప, జూలై 8 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతినాడు ఇడుపులపాయలోని ఆయన సమాధి సాక్షిగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆయన సోదరి, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి సందర్భంగా సోమవారం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద వారిద్దరూ వేర్వేరుగా నివాళులర్పించారు. జగన్ శనివారమే పులివెందులకు రాగా.. జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్‌కుమార్, కొడుకు రాజారెడ్డి, కోడలు, కూతురు, తల్లి విజయలక్ష్మితో కలిసి ఆదివారం రాత్రి ఇడుపులపాయకు చేరుకున్నారు. అన్నాచెల్లెళ్లు కలిసి నివాళులర్పిస్తారని అటు కాంగ్రెస్ వర్గాలు, ఇటు వైసీపీ వర్గాలు వెల్లడించాయి.
అయితే అందుకు భిన్నంగా జరిగింది. జగన్ సోమవారం ఉదయం 7.30 గంటలకు తన భార్య భారతి, ఎంపీ అవినాశ్‌రెడ్డి, మేనమామ రవీంద్రనాఽథ్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమరనాధరెడ్డి, మరికొందరితో కలిసి పులివెందుల నుంచి ఘాట్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే తల్లి విజయలక్ష్మి, మరికొందరు బంధువులు అక్కడ ఉన్నారు. వారితో కలిసి జగన్ నివాళులర్పించారు. 15 నిమిషాల్లో ప్రార్థన ముగించారు. ఘాట్ వద్ద కనీసం కూర్చోకుండానే తండ్రి విగ్రహానికి పూలమాల వేసి నేరుగా కడప బయల్దేరారు. అంతకుముందు కొడుకును చూసి విజయలక్ష్మి కన్నీరు పెట్టుకున్నారు.
ఆమె కొంత కాలంగా షర్మిల వద్దే ఉంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో షర్మిలను కడప ఎంపీగా గెలిపించాలంటూ అమెరికా నుంచి వీడియో సందేశం కూడా పంపారు. ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. వైసీపీ ఓటమి తర్వాత తల్లీకొడుకులు కలుసుకోవడం ఇడుపులపాయలోనే. తల్లి కన్నీరు పెట్టుకున్నా.. ఆయన పెద్దగా స్పందించలేదు. అందరూ చూస్తుండడంతో తల్లి తలపై చేయి వేసి ఓదార్చి వెళ్లిపోయారు. అయినా ఆమె ఏడుస్తూనే ఉండడంతో జగన్ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి, బంధువులు సముదాయించారు. వైఎస్ జయంతి సందర్భంగా అన్నాచెల్లెలు కలిసి నివాళులర్పించేలా విజయలక్ష్మి తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు చెబుతున్నారు.
అయితే అది ఫలించలేదు. ఇడుపులపాయ గెస్ట్‌హౌ్‌సలో షర్మిల, ఆమె కుటుంబ సభ్యులు ఉన్నా కనీసం వారిని కలవకుండానే జగన్ వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. జగన్ వెళ్లిన గంట తర్వాత తలి, భర్త, పిల్లలు, కోడలితో కలిసి షర్మిల వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. తండ్రి సమాధి వద్ద కూర్చొని మౌనం పాటించారు. ఫాదర్ నరేశ్ ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. సమాధిపై పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా తల్లి విజయలక్ష్మి షర్మిలను ముద్దాడారు. అనంతరం ఘాట్ ఆవరణలోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ నాయకుడంటే ఎలా ఉండాలో నిరూపించిన నేత వైఎస్సార్ అని, ఆయన మహోన్నతమైన భావాలు కలిగినవారని, రాష్ట్రానికి సీఎంగా ఎంతో సేవ చేశారని గుర్తుచేశారు. అన్ని వర్గాల ప్రజలను ఆదరించి వారి హృదయాల్లో నిలిచిపోయారని తెలిపారు. ఆయన మరణంతో తల్లడిల్లి 700 మంది చనిపోయారన్నారు. వైఎస్సార్ స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ కృషిచేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్ సోదరుడు సుధీకర్‌రెడ్డి, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.