Jammalamadugu: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. అదానీతో కాదు.. వారితో పెట్టుకున్నాం..
ABN , Publish Date - Nov 20 , 2024 | 06:51 PM
అదానీ సంస్థలను జమ్మలమడుగుకు స్వాగతిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. కానీ, అదానీ పేరు చెప్పుకుని వచ్చే దొంగ వైసీపీ కంపెనీలను అనుమతించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
వైఎస్ఆర్: జమ్మలమడుగు నియోజకవర్గంలో పారిశ్రామికవేత్త అదానీ పేరు చెప్పి వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. కొండాపురం రాగికుంట గ్రామం వద్ద మంగళవారం జరిగిన గొడవ అలాంటి వైసీపీ నేతల వల్లే తలెత్తిందని ఆయన చెప్పారు. నిన్న జరిగిన ఘర్షణ అక్రమాలకు పాల్పడే వైసీపీ నేతలపైనే తప్ప అదానీతో కాదని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు.
అదానీ సంస్థలను జమ్మలమడుగుకు స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదానీ పేరు చెప్పుకుని వచ్చే దొంగ వైసీపీ కంపెనీలను అనుమతించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. జమ్మలమడుగులో అతి పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీతోపాటు సోలార్ పరిశ్రమ ఏర్పాటుకు అదానీ సంస్థ మొగ్గు చూపుతోందని ఎమ్మెల్యే తెలిపారు. అయితే ఇంకా రాని ఆ పరిశ్రమలకు సబ్ కాంట్రాక్టర్లుగా చలామణీ అవుతూ వైసీపీ వాళ్లు తెరిచిన దొంగ దుకాణాలనే తమ నేతలు అడ్డుకున్నారని ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. అదానీ గ్రూప్‌తో తామే దగ్గరుండి మరీ పరిశ్రమలు పెట్టిస్తామని, కానీ ఫ్యాన్ పార్టీ నేతలు అనవసర జోక్యాన్ని సహించబోమని ఆయన స్పష్టం చేశారు.
అదానీ ముసుగులో రెచ్చగొట్టిన వైసీపీ నేతల వల్లే నిన్న ఘర్షణ చెలరేగిందని ఆయన ఆరోపించారు. కొన్ని మీడియాల్లో అదానీ సంస్థలపై తాను దాడి చేశాడని వార్తలు వచ్చాయని, అసలు దాడే జరగలేదని ఆదినారాయణ రెడ్డి చెప్పారు. వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అదానీ గ్రూపు సంస్థలకు ఇప్పటివరకూ అసలు అటవీశాఖ అనుమతులే రాలేదని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. అదానీ సంస్థల పనుల పేరుతో వైసీపీ దందాలు చేస్తుంటే తమ నేతలు అడ్డుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ నాయకులు గతంలోనూ తనపై అనేక కేసులు పెట్టారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఫ్యాన్ పార్టీకి జమ్మలమడుగు నియోజకవర్గంలో స్థానం లేదంటూ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు వివాదం ఇదే..
కాగా, జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం రాగికుంట గ్రామంలో బుధవారం పెద్దఎత్తున వివాదం చెలరేగింది. గ్రామంలోని పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ పనులు చేస్తున్న అదానీ సంస్థ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులు దాడి చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే కుటుంబీకులు శివనారాయణరెడ్డి, రాజేశ్‌రెడ్డి వారి అనుచరులతో కలిసి కంపెనీ క్యాంపుపై రాళ్లతో దాడి చేశారని సంస్థ ప్రతినిధులు ఆరోపించారు. ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా పనులు ఎలా చేపట్టారంటూ క్యాంపు అద్దాలు, వాహనాలు, యంత్రాలను ధ్వంసం చేశారని చెప్పారు. దీంతో అక్కడంతా ఘర్షణ వాతావరణం నెలకొంది. శివనారాయణరెడ్డి, రాజేశ్ రెడ్డి దాడి చేయడంపై సంస్థ ప్రతినిధులు తాళ్ల ప్రొద్దుటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పందించారు. అసలు అక్కడ ఉన్నది అదానీ సంస్థ కాదని, ఆ పేరు చెప్పుకుంటున్న వైసీపీకి చెందిన దొంగ కంపెనీ అని ఆయన ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
YS Sharmila: కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరి కాయలు కొట్టే ప్రాజెక్టా?: వైఎస్ షర్మిల
AP News: వైసీపీ నేతపై హైకోర్టు సీరియస్.. ఇలాగేనా మాట్లాడేది
AP Cabinet: ఏపీ క్యాబినెట్.. ఏఏ పనులకు ఆమోదం పడే అవకాశం ఉందంటే..