Share News

CM Chandrababu: తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే.. తాట తీయండి.. చంద్రబాబు ఆదేశాలు

ABN , Publish Date - Oct 21 , 2024 | 10:22 AM

శాంతి, భద్రతల పరిరక్షణకు ఏపీ పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని, ప్రజల మాన, ప్రాణ, ఆస్తులకు రక్షణగా నిలుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

CM Chandrababu: తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే.. తాట తీయండి.. చంద్రబాబు ఆదేశాలు

అమరావతి: శాంతి, భద్రతల పరిరక్షణకు ఏపీ పోలీసులు (AP Police) అహర్నిశలు కృషి చేస్తున్నారని, ప్రజల మాన, ప్రాణ, ఆస్తులకు రక్షణగా నిలుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు. ఇవాళ (సోమవారం) పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో అమరవీరుల స్థూపానికి సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఘన నివాళులు అర్పించారు. ముందుగా ముఖ్యమంత్రితోపాటు హోంమంత్రి వంగలపూడి అనిత, ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.


మీరే స్ఫూర్తి..

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.." దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీసులకు నివాళులు అర్పిస్తున్నా. శాంతిభద్రతల కోసం వారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులపై పోరాడిన ఉమేశ్ చంద్ర, వేదవ్యాస్ లాంటి పోలీసులు ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అలాంటి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. వారి స్ఫూర్తి ప్రతి పోలీసులో ఉంది. దేశానికి, రాష్ట్రానికి ఈ శాఖ చాలా కీలకం. రాత్రి, పగలు తేడా లేకుండా పని చేస్తారు. పోలీసు ఉద్యోగం సవాళ్లతో కూడుకుంది. 24 గంటలూ పని చేసే ఏకైక శాఖ పోలీసు శాఖ. వారికి పండగలు ఉండవు, ఎప్పుడూ విధుల్లోనే ఉంటారు. తిరుమల బ్రహ్మోత్సవాలు, దుర్గమాత ఉత్సవాలు, విజయవాడ విపత్తులో పోలీసుల పాత్ర అభినందనీయం. భారతదేశంలోనే ఏపీ పోలీసు వ్యవస్థ ఒక బ్రాండ్ అయిపోయింది.


లైంగిక వేధింపులు సహించం..

ఆడబిడ్డలపై అత్యాచారాలు చేస్తున్నారు. ప్రతి కేసును సవాల్‌గా తీసుకుంటాం.. ఛేదిస్తాం. ఆడబిడ్డలు ట్రాప్‌లో పడొద్దు. నేరస్థులకు చట్టపరమైన శిక్షపడేలా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. పిల్లలను తల్లిదండ్రులు కంట్రోల్ చేయాలి. హిందూపూర్ గ్యాంగ్ రేప్, కడపలో యువతి హత్య కేసులో నేరస్థులకు కఠిన శిక్షలు పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది . ఆడబిడ్డల రక్షణే ప్రభుత్వ లక్ష్యం. రానున్న రోజుల్లో కానిస్టేబుల్ నియామకాలు చేపడతాం. ప్రతి ఏటా రూ.20 కోట్లు పోలీసు శాఖకు అందిస్తాం. రానున్న రోజుల్లో అమరావతిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుందాం. అమరావతిలో శాశ్వత అమరవీరుల సంస్మరణ స్థూపం ఏర్పాటు చేస్తా.


లేటెస్ట్ టెక్నాలజీ అందిస్తాం..

రాయలసీమ ఫ్యాక్షనిజం, విజయవాడ రౌడీయిజం అణచివేసిందే పోలీసులే. ఇకపై రాష్ట్రంలో జీరో క్రైమ్ నమోదు కావాలి. శాంతి, భద్రతలు మొదటి ప్రాధాన్యతగా పనిచేయాలి. ఎవరైనా నేరం చేయాలనే ఆలోచన వస్తేనే భయపడాలి. పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చాం. వారికి కావాల్సిన సదుపాయాలు అన్నీ సమకూర్చాం. వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సవాళ్లను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేశాం. నేను మొదట్నుంచీ పోలీసు వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టా. సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నేరస్థులు లేటెస్ట్ టెక్నాలజీ వాడుతుంటే పోలీసులు పాత టెక్నాలజీ వాడుతున్నారు. ప్రభుత్వం పోలీస్ వ్యవస్థపై దృష్టి పెడుతోంది. ఇకపై టెక్నాలజీ పరిజ్ఞానం అందిస్తాం. ఆధునిక పరికరాలు సమకూరుస్తాం.


వారి ఆగడాలు సాగవు..

నేటి సమాజంలో నేరాల తీరు మారుతోంది. నేరస్థుల కంటే పోలీసులు ఎక్కువ టెక్నాలజీ కలిగి ఉంటేనే వారిని కట్టడి చేయగలం. రాజకీయ నాయకుల ముసుగులో కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారు. వారి రాజకీయ ముసుగు తీసి నేరాలు అరికట్టే బాధ్యత పోలీసులు తీసుకోవాలి. మీకు అండగా ప్రభుత్వం ఉంటుంది. భావితరాల కోసం నేను గతంలోనే టెక్నాలజీ తీసుకువచ్చాను. రియల్ టైమ్ మానిటరింగ్ చేయగలిగితే నేరాలు నియంత్రించవచ్చు. మూడో నేత్రానికి నాలుగో నేస్తం సాంకేతిక పరిజ్ఞానం. రౌడీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అదే వారికి చివరిరోజు. డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేస్తాం.


వృథా ఖర్చులు..

గత ప్రభుత్వ పెండింగ్ నిధులు విడుదల చేశాం. నేను కోరుకునేది విజుబుల్ పోలీసింగ్... ఇన్విజిబుల్ పోలీసింగ్. రాజకీయ వేధింపులకు పోలీసులను వైసీపీ ప్రభుత్వం వాడుకుంది. రూ.12 కోట్లతో కంచే ఏర్పాటు చేసుకున్నాడు గత ముఖ్యమంత్రి. మాజీ సీఎం జగన్ సర్వే రాళ్లపై రూ.700 కోట్లు వృథా ఖర్చు చేశారు. గత ప్రభుత్వం పోలీసులకు సరెండర్ లీవ్స్ కూడా ఇవ్వకపోవడం బాధాకరం. వారు చేసిన అప్పులు తీర్చే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వంపై పడింది" అని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి:

YCP Leader: బోరుగడ్డ బ్యాంక్ ఖాతాల్లో కోట్ల కొద్దీ డబ్బు..

Attack on TDP Activists: ఆ జిల్లాలో రెచ్చిపోతున్న వైసీపీ మూకలు, వరస దాడులు..

Updated Date - Oct 21 , 2024 | 11:07 AM