Share News

Vangalapudi Anitha: సైబర్ నేరాలు అరికట్టేందుకే సైబర్ సోల్జర్స్, కమాండోల వ్యవస్థ..

ABN , Publish Date - Aug 10 , 2024 | 08:00 AM

విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నగర పోలీసులు చేపట్టిన సైబర్ క్రైమ్ అవేర్నెస్ వాక్ థాన్‌కు హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే పోలీసులు మారథాన్ నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు.

Vangalapudi Anitha: సైబర్ నేరాలు అరికట్టేందుకే సైబర్ సోల్జర్స్, కమాండోల వ్యవస్థ..

అమరావతి: విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నగర పోలీసులు చేపట్టిన సైబర్ క్రైమ్ అవేర్నెస్ వాక్ థాన్‌కు హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే పోలీసులు మారథాన్ నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. రోజురోజుకూ సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయని, అమాయకులను నమ్మించి వారి ఖాతాల నుంచి లక్షల్లో దోచేస్తున్నారని అనిత అన్నారు. ఇలాంటి నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హోంమంత్రి పేర్కొన్నారు. అపరిచితుల నుంచి మన ఫోన్లకు వచ్చే మెసేజ్, మెయిల్స్, వాట్సప్ మెసేజ్‌లకు స్పందించవద్దని, లోన్ యాప్, లాటరీ తగిలిందంటూ వచ్చే ఫోన్ కాల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని హోంమంత్రి అనిత హెచ్చరించారు.


సైబర్ నేరాలను అరికట్టేందుకు 250మంది సైబర్ కమాండోలు, 2వేల మంది సైబర్ సోల్జర్స్‌కు శిక్షణ ఇచ్చి నియమించినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ తరహా నేరాల సంఖ్య పెరుగుతోందని, వీటిని అరికట్టేందుకే సైబర్ కమాండోలు, సోల్జర్స్‌ను నియమించినట్లు సీపీ తెలిపారు. ఇకపై సైబర్ నేరగాళ్ల వలలో ప్రజలు పడకుండా వీరి ద్వారా తరచూ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. రానున్న మూడు నెలల్లో మరో 3లక్షల మంది సైబర్ సైనికులను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు కమిషనర్ చెప్పుకొచ్చారు. ఈ తరహా నేరాల బారిన పడుతున్న వారిలో ఎక్కువ మంది విద్యావంతులే ఉంటున్నారని రాజశేఖర్ బాబు తెలిపారు. ఎవరైనా సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సీపీ రాజశేఖర్ బాబు సూచించారు.

Updated Date - Aug 10 , 2024 | 08:00 AM