Share News

Kollu Ravindra: మెరైన్ ఫిషింగ్‌లో దేశంలోనే ప్రథమ స్థానంలో ఏపీ

ABN , Publish Date - Aug 11 , 2024 | 04:39 PM

భారతదేశంలోనే మెరైన్ ఫిషింగ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆదివారం నాడు మచిలీపట్నంలో కేంద్ర పర్యావరణ, మత్స్యశాఖ అధికారుల బృందం పర్యటించింది. సముద్ర తీర ప్రాంతంలో ఆక్వా, మత్స్య పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర బృందానికి మంత్రి రవీంద్ర వివరించారు.

Kollu Ravindra: మెరైన్ ఫిషింగ్‌లో దేశంలోనే ప్రథమ స్థానంలో  ఏపీ
Minister Kollu Ravindra

కృష్ణాజిల్లా, మచిలీపట్నం: భారతదేశంలోనే మెరైన్ ఫిషింగ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తెలిపారు. ఆదివారం నాడు మచిలీపట్నంలో కేంద్ర పర్యావరణ, మత్స్యశాఖ అధికారుల బృందం పర్యటించింది. సముద్ర తీర ప్రాంతంలో ఆక్వా, మత్స్య పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర బృందానికి మంత్రి రవీంద్ర వివరించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 970 కిలో మీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉందని వెల్లడించారు.


ఇంకా పాత పద్ధతిలోనే కొంతమంది మత్స్యకారులు సముద్రంలో వేట సాగిస్తున్నారని అన్నారు. వేటలో సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరమని చెప్పారు. మత్స్యకారులు, ఆక్వా రంగ అభివృద్ధి కోసం మచిలీపట్నంలో ఆక్వా, మెరైన్ ఫిషింగ్ యూనివర్సిటీని స్థాపించాలని కేంద్ర బృందాన్ని కోరామని అన్నారు. చాలా అరుదైన చేప జాతులు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన చేప జాతులను ఆవిష్కరించాలని చెప్పుకొచ్చారు. మడ అడవుల ప్రాధాన్యత తెలియక వాటిని నరికి వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మడ అడవుల పెంపకానికి సహరించాలని కేంద్ర బృందానికి మంత్రి కొల్లు రవీంద్ర విజ్ఞప్తి చేశారు.


చిన్న షిఫ్‌లకు తోడుగా, మత్స్యకారులకు సౌకర్యంగా మదర్ షిప్‌ను ఏర్పాటు అంశాన్ని బృందం దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. రేపు(సోమవారం) ఢిల్లీ వెళ్తున్నానని సమస్యలను కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. సాగరమాల పేరుతో సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో జాతీయ రహదారి నిర్మాణం చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేస్తానని వెల్లడించారు. త్వరలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి మచిలీపట్నం రేపల్లె - రైలు మార్గం కలిపేలా సహకరించాలని కోరుతామని అన్నారు. జగన్ ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్ నిర్మాణ అంచనాలు పెంచి లబ్ధి పొందింది తప్పా నిర్మాణాలు ముందుకు సాగనీవ్వలేదని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Aug 11 , 2024 | 04:48 PM