Minister Nara Lokesh: ఆహార పంపిణీపై మంత్రి నారా లోకేష్ సమీక్ష
ABN , Publish Date - Sep 03 , 2024 | 08:27 PM
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వానలు కుండపోతగా కురుస్తుండటంతో విజయవాడలోని బుడమేరు పొంగి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వానలు కుండపోతగా కురుస్తుండటంతో విజయవాడలోని బుడమేరు పొంగి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పర్యటించి వరద బాధితులకు ధైర్యం చెబుతున్నారు. మంత్రులు కూడా బాధితులకు అండగా నిలుస్తున్నారు. అయితే బాధితులకు అందుతున్న ఆహార పంపిణీపై మంత్రి నారా లోకేష్ సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద సహాయక చర్యలపై మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్‌లతో ఈరోజు(మంగళవారం) మంత్రి నారా లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
వరద బాధితుల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి ఆహారాన్ని దాతలు పంపుతున్నారని తెలిపారు. గీతం విద్యాసంస్థల చైర్మన్, విశాఖ ఎంపీ భరత్ 50వేల మందికి అలాగే ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో 25 వేల మందికి ఆహారం అందజేశారని వివరించారు. ద్వారకా తిరుమల వెంకన్న దేవస్థానం అధికారులు 5 వేల పులిహోర ప్యాకెట్లను అందజేశారని గుర్తుచేశారు. హెలీకాప్టర్ల ద్వారా 34 వరద ప్రభావిత ప్రాంతాల్లో 55 వేల కిలోల ఆహారం, వాటర్ బాటిల్స్ అందజేసినట్లు చెప్పారు. ప్రకాశం బ్యారేజి వరద వేగంగా తగ్గుముఖం పడుతోందని అధికారులు తెలిపారని అన్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద ప్రస్తుత నీటి ప్రవాహం 7,47,344 క్యూసెక్కులు ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
కేఏ పాల్ ఆహారపు పంపిణీ
విజయవాడ: ముంపు ప్రాంతాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆహారాన్ని పంపిణీ చేశారు. ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయని.. వరదలపై ప్రభుత్వం సహాయక చర్యలను సరిగా చేపట్టలేదని విమర్శలు చేశారు. భారీ వర్షాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత వరద రావడానికి ఆక్రమణలు ప్రధాన కారణమని ఆరోపణలు చేశారు. తెలంగాణ తరహాలో ఏపీలో ప్రత్యేక చట్టం తేవాలని కోరారు. ఈ ఆక్రమణలు కూలగొట్టాలని సీఎం చంద్రబాబుకు కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు.
కొల్లేరుకు భారీగా వరద...
ఏలూరు జిల్లా (కైకలూరు): కొల్లేరుకు భారీగా వరద చేరుతుండటంతో లంక గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. మండవల్లి మండలం పెద్ద ఎడ్ల గాడి నుంచి పెనుమాక లంక వెళ్లే రహదారులు నీటమునిగాయి. దీంతో అటువైపు వెళ్లే రాకపోకలు నిలిచి పోయాయి. ఏలూరు, కైకలూరు, వెళ్లడానికి లంక గ్రామాల ప్రజలకు ఈ రహదారినే ఉపయోగించేవారు. జలదిగ్బంధంలో ఏలూరు రూరల్ మండలంలోని కోమటిలంక గ్రామం ఉంది. కోమటి లంక నుంచి కైకలూరు రావాలంటే బిక్కుబిక్కుమంటూ పడవ ప్రయాణం ఆధారంగా చేసుకుని ప్రజలు రావాల్సి ఉంటుంది. వరద పెరగడంతో కొల్లేరు లంక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.
బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు
విజయవాడ: బుడమేరుకు గండ్లు పూడ్చే పనులను అధికారులతో కలసి ట్రాక్టర్‌పై వెళ్లి మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఫ్లడ్ లైట్లు పెట్టుకుని పనులు చేస్తున్నామని మంత్రి తెలిపారు. బ్రిడ్జి అప్రోచ్, రోడ్డు పనులు పూర్తి చేసుకుని మొదటి గండిని ఈరాత్రికి పూడ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మిగిలిన గండ్లు కూడా మరో మూడు, నాలుగు రోజుల్లో పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. జగన్ పాలనా పాపమే సింగ్ నగర్ ముంపు అని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు చేశారు.
గత టీడీపీ ప్రభుత్వం బుడమేరును 5 వేల క్యూసెక్కుల నుంచి 35 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో విస్తరణకు పనులు చేపట్టిందని, లైనింగ్ పనులకు టెండర్లు పిలిచిందని మంత్రి నిమ్మల గుర్తుచేశారు. మూడు ఏజెన్సీలకు పనులు అప్పగించి 2019 నాటికే 85 శాతం పనులు పూర్తి చేసిందని తెలిపారు. ఐదేళ్ల జగన్ పాలనలో బుడమేరు 35 వేల క్యూసెక్కుల సామర్ద్యపు విస్తరణకు సంబంధించిన పనులు చేయలేదన్నారు. మిగిలిన 15 శాతం పనులు పూర్తి చేసి ఉంటే గండ్లు పడేది కాదని మంత్రి నిమ్మల చెప్పారు.
పోలవరం ,అమరావతిలను విధ్వంసం చేసినట్లే బుడమేరును జగన్ విధ్వంసం చేశారని ఆరోపణలు చేశారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 36 మంది చనిపోతే ,కనీసం పరామర్శించకుండా జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లో పడుకున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు చేశారు.
ఇవి కూడా చదవండి...
Budameru: బుడమేరుకు తగ్గిన వరద.. గండ్లు పూడ్చివేత పనులు ప్రారంభం
Drone: డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా.. ఇప్పటి వరకు
Read Latest AP News And Telugu News