Minister Narayana: విజయవాడ నుంచి బుడమేరు వరద పూర్తిగా బయటకు వెళ్లిపోయింది..
ABN , Publish Date - Sep 15 , 2024 | 07:57 PM
బుడమేరు ప్రాంతంలో ఆక్రమణలు తొలగించేందుకు త్వరలోనే కమిటీ వేస్తామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆ ప్రాంతంలో ఉంటున్న పేదలకు ఇబ్బందులు తలెత్తకుండా టిడ్కో ఇళ్లు ఇస్తామని మంత్రి చెప్పారు. పూర్తిస్థాయిలో ఆక్రమణలు తొలగించి మరోసారి ఉపద్రవం రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
విజయవాడ: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. భారీ వర్షాలకు బుడమేరుకు మూడుచోట్ల గండ్లు పడి నగరాన్ని వరదనీరు ముంచెత్తిందని, కానీ ప్రస్తుతం ఆ నీరంతా బయటకు వెళ్లిపోయిందని మంత్రి వెల్లడించారు. బుడమేరు ఆక్రమణలు తొలగించి దాన్ని ప్రక్షాళన చేస్తామని, మరోసారి ఇలాంటి ఉపద్రవం రాకుండా పూర్తి చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.."కృష్ణానదికి ఎన్నడూ లేనంతగా వరదనీరు పోటెత్తింది. బుడమేరుకూ స్థాయికి మించి వరద రావడంతో మూడు చోట్ల గండ్లు పడ్డాయి. అందువల్లనే ఉపద్రవం వచ్చింది. బుడమేరు ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటాం. అందుకు త్వరలోనే కమిటీ వేస్తాం. బుడమేరు ఆక్రమించిన వారికి ఇబ్బందులు ఉండవచ్చు. ఎంత మేరకు ఆక్రమణలు ఉన్నాయో వాటన్నింటినీ తొలగిస్తాం. ఆ ప్రాంతంలో పేదలు ఎవరున్నా ఇబ్బందులు లేకుండా వారికి టిడ్కో ఇళ్లు ఇస్తాం. తొలగింపు విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదు. ఏ పార్టీ వారున్నా, ఎంతటి బలవంతులు ఉన్నా ఎవర్నీ ఉపేక్షించం. కొంత మంది కోసం ఏడు లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. త్వరలోనే రామలింగేశ్వర వద్ద రిటైనింగ్ వాల్ ఎత్తు పెంచుతాం. స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులు వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే ఇంత విషమ పరిస్థితి వచ్చేది కాదు. ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ఎవరెవరికి ఎంత పరిహారం ఇవ్వాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయిస్తారు.
వరదలకు చిరు వ్యాపారులు పెద్దఎత్తున నష్టపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఆదుకుంటాయి. వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లకు త్వరలోనే మరమ్మతులు పూర్తి చేస్తాం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో రోడ్లు ఏ మేరకు దెబ్బతిన్నాయనే అంచనాలు తయారు చేస్తున్నాం. వరద పూర్తిగా తగ్గుముఖం పట్టగానే విజయవాడలో ఆగిపోయిన స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులు ప్రారంభిస్తాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వరదలపై మాట్లాడే అర్హత లేదు. వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదు. ఎప్పుడన్నా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారా?. ఇప్పుడొచ్చిన వరదలకు వేలమంది చనిపోవాల్సి ఉంది. కానీ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రాణ నష్టం చాలా తగ్గింది. అధికారులు, ప్రభుత్వం ఎక్కడా తప్పు చేయలేదు. ఈనెల 17నుంచి పరిహారం ఎవరెవరికి ఎంత చెల్లించాలనే నిర్ణయం తీసుకుంటాం" అని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Steel Plant: ఆ విషయంలో కూటమి ప్రభుత్వ విధానం స్పష్టం చేయాలి: ఎమ్మెల్సీ బొత్స..
AP News: వైసీపీ నేతల మీద అక్రమ కేసులు.. మంత్రి బాల వీరాంజనేయ స్వామి కీలక వ్యాఖ్యలు
YS Sharmila: కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్.. ఏమన్నారంటే?
Nandigam Suresh: పోలీసు కస్టడికి మాజీ ఎంపీ నందిగం సురేష్ ...