Satya Kumar Yadav: తెలుగు భాష పరిరక్షణ కోసం కృషి
ABN , Publish Date - Dec 29 , 2024 | 03:20 PM
Satya Kumar Yadav: తెలుగు భాష పరిరక్షణ కోసం కృషి చేస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు.ఆంగ్లం మాట్లాడితే తాము చాలా గొప్ప అనే భావన చాలా మందిలో ఉందని.. కానీ దేశ భాషలందు తెలుగు లెస్స అన్న రాజులెందరో ఉన్నారని గుర్తుచేశారు. రాజకీయంగా నేతల మధ్య సైద్ధాంతిక విబేధాలు ఉన్నా.. భాష కోసం అందరూ కలిసి నడవాలని మంత్రి సత్యకుమార్ సూచించారు.
విజయవాడ: అధికారుల కోసం కూడా తెలుగు భాషపై సదస్సు నిర్వహించాలని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో ఆదేశాలు తెలుగులో వచ్చేలా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలుగు భాష ఔన్నత్యం గురించి అందరూ తెలుసుకోవాలని మంత్రి సత్యకుమార్ తెలిపారు. విజయవాడలో జరుగుతున్న 6వ ప్రపంచ తెలుగు మహా సభల్లో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ... గొప్ప వారి ముందు కూర్చున్నప్పుడు తనలో ఆత్మనూన్యతాభావన వస్తుందని.. వారి ద్వారా తాను ఎన్నో విషయాలు తెలుసుకుని.. ఆచరిస్తానని చెప్పారు. ఆంగ్లం మాట్లాడితే తాము చాలా గొప్ప అనే భావన చాలా మందిలో ఉందని.. కానీ దేశ భాషలందు తెలుగు లెస్స అన్న రాజులెందరో ఉన్నారని గుర్తుచేశారు. నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న పేర్లను ప్రస్తావించకుండా తెలుగు భాష గురించి మాట్లాడలేమని అన్నారు. ఆ తర్వాత అనేక మంది మహానుభావులు తెలుగు భాష పరిరక్షణకు పాటుపడ్డారని ఉద్ఘాటించారు. రాజకీయంగా నేతల మధ్య సైద్ధాంతిక విబేధాలు ఉన్నా.. భాష కోసం అందరూ కలిసి నడవాలని సూచించారు. తెలుగు భాష కోసం చేపట్టిన యజ్ఞంలో తాను కూడా భాగస్వామిగా నడుస్తానని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.
మాతృభాషకు పిల్లలను దూరం చేయొద్దు:జేడీ లక్ష్మీనారాయణ
తెలుగు భాష రాగానుయుక్త భాష, హృదయంలో నుంచి వచ్చే భాష అని జై భారత్ నేషనల్ పార్టీ (Jai Bharat National Party) అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) తెలిపారు. విజయవాడలో జరుగుతున్న 6వ ప్రపంచ తెలుగు మహాసభల్లో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... తెలుగు భాష గొప్పదనం గురించి అందరికీ తెలిస్తేనే.. పని చేస్తామని అన్నారు. రాజకీయ నాయకుల పాత్ర ఇందులో చాలా ముఖ్యమైనదని చెప్పారు. మాతృభాష విషయం గురించి రాజకీయ పక్షాల్లో అవగాహన వస్తేనే మార్పు వస్తుందని తెలిపారు. భాష గొప్పతనం ప్రాచీనతను బట్టి ఉండదు.. కళలు, సమాజంపై ప్రభావాన్ని బట్టి భాష గొప్పతనం ఉంటుందన్నారు. ఉర్దూ భాష ప్రేమ, విషాదాలను పంచడంలో ఒక ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పారు.
మన ప్రయత్నం చేయకుండా సాధారణంగా మాట్లాడే భాష మాతృభాష అని తెలిపారు. మన భాషను ఎందుకు పరిరక్షించుకోవాలో ముందు ప్రజలకు తెలియచెప్పాలన్నారు. తెలుగు భాషలో ఉన్న మాధుర్యాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. అమ్మలో ఉన్న కమ్మదనం మరే భాషలో ఉండదన్నారు. మాతృభాషకు మన పిల్లలను దూరం చేయొద్దన్నారు. పసితనంలో మన భాషను తీసివేస్తే భ్రూణ హత్యతో సమానంగా భావించాలని చెప్పారు. వేరే భాషను బలవంతంగా ప్రవేశ పెట్టే విధానానికి తల్లిదండ్రులు స్వస్తి పలకాలని అన్నారు. ఇంగ్లీష్ మీడియం వద్దంటే.. ఇంగ్లీష్ భాషను వ్యతిరేకించినట్లు కాదన్నారు.ఐదోతరగతి లేదా ఎనిమిదో తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన జరగాలని చెప్పారు. భాష పట్ల సహజత్వం ఉండాలే తప్ప.. కృత్రిమ భాష కరెక్టు కాదని అన్నారు.
దీని వల్ల వారి వ్యక్తిత్వానికి ఇబ్బంది కలగడమేగాకుండా, బట్టీ బట్టీ మాట్లాడే పరిస్థితి వస్తుందన్నారు. కంప్యూటర్ ఆధునీకరణ సబ్జెక్టు వస్తే.. తెలుగువాళ్లం సొంతం చేసుకున్నామన్నారు. అమెరికాకు వెళ్లి ఉన్నత స్థానాల్లో ఉన్నా వారిలో చాలామంది మన తెలుగువారు ఉన్నారని గుర్తుచేశారు. పద్యస్తం, కంఠస్తం కారణంగా జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుందన్నారు. అల్జీమర్స్, నత్తి వంటివి పోవడానికి తెలుగు భాష ఒక ఔషధమని చెప్పారు. భాషా సంస్కృతి, చమత్కారం పోవడం వల్ల చిన్న విషయాలకే ఇంట్లో గొడవలు అవుతున్నాయన్నారు. మాతృభాషలో సాధికారికత వస్తే. ఏ భాషలో అయినా రాణించగలమని తెలిపారు. తెలుగు భాష కోసం ఉద్యమించాల్సిన అవసరం లేదు.. ఉపక్రమిద్దామని పిలుపునిచ్చారు. తల్లిపాలకు , డబ్బా పాలకు ఉన్నంత తేడా మాతృభాషకు, పరాయి భాషకు ఉందన్నారు. తల్లిదండ్రులు కూడా వాడుక బాషగా తెలుగు పదాలనే పిల్లలకు వివరించాలని చెప్పారు. రాజకీయ నాయకులు పార్టీలను పక్కన పెట్టి.. తెలుగు భాష అభివృద్ధి, పరిరక్షణ కోసం పాటుపాడాలని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Amaravati: జగన్ నిర్వాకంతో నీటిలోనే నానుతున్న ర్యాప్ట్ ఫౌండేషన్
Deputy CM Pawan Kalyan : తోలుతీసి కూర్చోబెడతాం
JC Prabhakar Reddy: వీపు విమానంమోతమోగిస్తా.. మాజీ మంత్రికి జేసీ వార్నింగ్
Read Latest AP News and Telugu News