CM Chandrababu : ఏపీలో కొత్త యూనివర్సిటీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ABN , Publish Date - Dec 15 , 2024 | 01:37 PM
ఒక్కోసారి మంచి చేసినా ఎన్నో ఇబ్బందులు పడాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పొట్టి శ్రీరాములు తాను అనుకున్నది సాధించారని తెలిపారు.
విజయవాడ: ఏపీలో త్వరలోనే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని నెలకొల్పబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తెలుగు వారంతా గర్వంగా చెప్పుకునే రోజు ఈరోజు అని చెప్పారు. ఇవాళ(ఆదివారం) ఉదయం 11 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. పొట్టి శ్రీరాములు 72వ వర్థంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఉమ్మడి మద్రాసు నుంచి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం.. పొట్టి శ్రీరాములు సాగించిన మహత్తర పోరాటం మరువలేనిదని చంద్రబాబు అన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల మనమంతా తెలుగు వాళ్లం అంటున్నామని అన్నారు.తెలుగు జాతి కోసం ఆలోచన చేసి ప్రాణత్యాగం ద్వారా సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. 58 రోజులు ఆమరణ దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ సాధించారని సీఎం చంద్రబాబు అన్నారు.
చాలా బాధాకరం..
నేటి ఆమరణ దీక్షలు ఎలా ఉన్నాయో అందరూ చూస్తున్నారని అన్నారు. ఒక వ్యక్తి త్యాగం వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆవిర్భవించాయని చెప్పారు. తాను చనిపోయినా పరవాలేదు అని మన తెలుగు వారికోసం ప్రాణాలు అర్పించారని గుర్తుచేశారు. ఒక్కోసారి మంచి చేసినా ఎన్నో ఇబ్బందులు పడాలన్నారు. ఆయనకాడి మోయడానికి నలుగురు రాకపోవడం చాలా బాధాకరమని అన్నారు. కనీసం మద్దతు పలికేందుకు కూడా నాయకులు రాలేదని చెప్పారు. అయినా పొట్టి శ్రీరాములు తాను అనుకున్నది సాధించారని తెలిపారు.ప్రాణాలు కోల్పోవడం మాత్రం చాలా బాధాకరమని చెప్పారు. ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి.. దేశం ఐక్యత కోసం పోరాటం చేశారని తెలిపారు.అలుపెరగని పోరాటంతో ఉక్కు మనిషిగా చరిత్రలో నిలిచి పోయారని సీఎం చంద్రబాబు అన్నారు.
చివరకు అదే నిజమైంది.
‘‘మన తెలుగు జాతికి చాలా విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. తెలుగుజాతి పలుమార్లు విడిపోయింది, కలిసింది.. అనేక ఇబ్బందులు పడ్డాం. 50 సంవత్సరాల పోరాటం, పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రం వచ్చింది. అల్లూరి సీతారామరాజు గిరిజనులను కలుపుకుని యుద్ధం చేశారు. ఆయన ఉంటే ఇబ్బంది అని ఆనాడు చంపించారు తెలుగు జాతికి ఒక రాష్ట్రం కావాలని 1913లో ఆంధ్ర మహాసభ పెట్టారు. తమిళులు రాష్ట్రం ఇచ్చేలోపే బ్రిటిష్ వాళ్లు స్వాతంత్ర్యం ఇస్తారని చెప్పేవాళ్లు. చివరకు అదే నిజమైంది... స్వాతంత్ర్యం వచ్చాకే .. తెలుగు రాష్ట్రం వచ్చింది. మన తెలుగువాళ్లు నాడు మన హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. అభివృద్ధి చేయడం, మళ్లీకొత్త రాజధానికి వెళ్లడం మన తెలుగు వాళ్లకు పరిపాటిగా మారింది. పొట్టి శ్రీరాములు కారణంగా ఎట్టకేలకు మన తెలుగు వాళ్లకు ఒక రాష్ట్రం ఆవిర్భవించింది. దీక్ష చేసే సమయంలో నెహ్రూ ఆ దీక్ష విరమించాలని టెలిగ్రామ్ పంపినా వెనక్కి తగ్గలేదు. కొన్ని ఉద్యమాలు చూస్తే చాలా విచిత్రంగా ఉంటాయి. పొట్టి శ్రీరాములు బలిదానం తర్వాత పదవులకు చాలా మంది రాజీనామా చేశారు.ఆనాటి ప్రధాని నెహ్రూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఏపీ రాజధాని విషయంలో ఒక్కొక్కరూ ఒక్కొ ప్రాంతం చెప్పారు.కర్నూలు రాజధానిగా, గుంటూరులో హైకోర్టు అని తాత్కాలిక ఒప్పందం చేశారు.1969లో తెలంగాణ కోసం రాష్ట్రంలో ఉద్యమం, జై ఆంధ్రా ఉద్యమం నడిచింది. తెలుగు వాళ్ల విగ్రహాలను ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన వ్యక్తి ఎన్టీఆర్’’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
అన్ని విధాలా అభివృద్ధి చేశాం
‘‘పొట్టి శ్రీరాములు యూనివర్శిటీని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నేను నామకరణం చేశాను. ఆయన నడయాడిన నేలను అన్ని విధాలా అభివృద్ధి చేశాం. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ పనులను కూడా నిర్లక్ష్యం చేశారు. పొట్టి శ్రీరాములు యూనివర్శిటీ పేరును కూడా మార్చాలని చూశారు. నవ్యాంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత పొట్టి శ్రీరాములు ఆత్మార్పణదినం గొప్పగా చేయాలని సంకల్పించాం. జాతి ప్రయోజనాల కోసం ప్రాణాలు వదిలిన మహనీయులను మనం స్మరించుకోవాలి. వారి త్యాగాలను భవిష్యత్తు తరాలు తెలుసుకుని ఆ సేవలను గుర్తు చేసుకోవాలి. తెలుగు జాతి అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంది. ఆనాడు ప్రపంచంలో నెంబర్ వన్‌లో ఉండేలా హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం.అక్కడ గత పరిస్థితులు, అభివృద్ధి గురించి డిప్యూటీ సీఎంపవన్ కల్యాణ్ కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశం దశ దిశ మార్చారు. ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీ పెట్టినా, దేశ రాజకీయాలను శాసించారు. 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఇప్పుడు ప్రకటించాం. ఇది ఏపీలో ఉండే ప్రతి వ్యక్తికి , ప్రతి ప్రాంతానికి మార్పునకు దిక్సూచి.తప్పకుండా ఈ ఫలితాలు ద్వారా రాష్ట్రం, ప్రజకు అన్ని విధాలా అభివృద్ధి చెందుతారు.తప్పకుండా మనందరకీ మంచి రోజులు వస్తాయి.. పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేశారు
‘‘కొంతమంది నాయకులు దూరదృష్టితో ప్రజలకు ఎంతో మంచి చేశారు. మరి కొంతమంది తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేశారు. గత ఐదేళ్లల్లో పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో అభివృద్ధి లేకుండా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అభివృద్ధి కావాలని పని చేశాం. 2019 తర్వాత మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారు.ఒక్క అభివృద్ధి, ఒక్క ప్రాజెక్టు నిర్మాణం లేకుండా చేశారు. ఆరు నెలల పాలనలో వారి తప్పులను సరి చేయడమే సరిపోయింది. సంపద ప్రతిఒక్క కుటుంబానికి అందాలి, జీవన ప్రమాణాలు మారాలి. అందరూ ఆర్థిక అభివృద్ధితో, సంతోషంగా ఉండాలనేదే విజన్ 2047. ఎవరో కుట్రలు చేస్తే మీరు అందులో భాగస్వామ్యం కావద్దు.మీ నెత్తిన చెయ్యి పెట్టి అధికారంలోకి వచ్చాక మీ ఆస్తులే లాక్కున్న పరిస్థితి. పొట్టి శ్రీరాములు త్యాగాలతో పాటు, గత పాలకుల పాపాలు కుడా గుర్తు ఉంచుకోండి.లక్షా పాతిక వేలకోట్లు విద్యుత్ భారాలు ప్రజలపై మోపారు. ఇప్పుడు కేంద్రంలో మన పరపతి పెరిగింది కాబట్టి నిధులు వస్తున్నాయి. సుస్థిర పాలనతోనే అభివృద్ధి సాధ్యం అని పవన్ కల్యాణ్ తరచూ చెబుతుంటారు. రూ. 4 వేలు పెన్షన్ ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదు. ఇబ్బందులు తాత్కాలికంగా ఉంటాయి... వాటిని అధిగమిస్తాం. మంచితో పాటు మనకు చెడు చేసిన వారినీ గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తు పెట్టుకోకుంటే రాష్ట్రం మూడు ముక్కలే. 2025 మార్చి 16 నుంచి పొట్టి శ్రీరాములు 125 వ జయంతి ఉత్సవాలు ఘనంగా చేస్తాం.పొట్టి శ్రీరాములు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం, ఇంటిని మెమోరియల్‌గా చేస్తాం. రాజధాని అమరావతిలో స్మృతి వనం ఏర్పాటు చేస్తాం. 2047 నాటికి మన తెలుగు వారంతా ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలి. ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.20-30 లక్షలు ఉండాలి’’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఆ సంకల్పంతోనే పని చేస్తాం
‘‘ఆ సంకల్పంతోనే మేమంతా కలిసి పని చేస్తాం. ఐటీ గురించి నాటి నుంచి నేటి వరకు మాట్లాడే ఏకైక వ్యక్తిని నేనే. ఒక్క బటన్ నొక్కితే చాలు ఏదైనా క్షణాల్లో పని జరుగుతుంది. రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వకుండా పారిపోయారు. మేము రూ.1650 కోట్లు ఆ బాకీ రైతులకు ఇచ్చాం. రైతు నుంచి ధాన్యం తీసుకున్న వెంటనే డబ్బులు పడే ఆలోచన చేస్తున్నాం. త్వరలోనే వాట్సాప్ గవర్నెన్స్‌ను అమలు చేస్తున్నాం. ఒక్క మెసేజ్‌తో మీ సమస్యలు, ఇబ్బందులు తీరుస్తాం. ప్రజలు కూడా మా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి. దేశంలోనే ఆదర్శవంతంగా ఉండేలా సుపరిపాలన చేయాలనేది మా అభిమతం.అభివృద్ధి, సంక్షేమం, ఆదాయం లక్ష్యంగా పాలన సాగిస్తాం. ఒకేసారి రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో సభకు, రూ.4 వేల కోట్లతో అభివృద్ధి పనులు పవన్ కల్యాణ్ సారధ్యంలో జరుగుతున్నాయి.గోదావరిలో మునిగిన పోలవరంను మళ్లీ పూర్తి చేసేలా పనులు మొదలు పెట్టాం.నమ్మకం పోయిన తరువాత అప్పులు పుట్టని పరిస్థితి.గత పాలకుల వల్ల ఇప్పుడు మన రాష్ట్రం వైపు ఎవరూ చూడటం లేదు. మేము వాస్తవ పరిస్థితి చెప్పి... నిధులకోసం కష్ట పడుతున్నాం. ఐదేళ్ల నిధులు ఒకేసారి డ్రా చేసిన ఘనులు గత పాలకులు. వారివి అన్ని దొంగ బుద్దులే... అన్నీ దొంగ నాటకాలే.. ఇప్పుడు నిధులు వచ్చే మార్గం లేక.. కొత్త దారులు వెతుకుతున్నాం’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.