Share News

YSRCP Attack: వైసీపీ మూకల దాష్టీకం.. యువకుడి దారుణ హత్య..

ABN , Publish Date - Oct 22 , 2024 | 09:25 AM

తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం నాంచారంపేటలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. చెలగల కాటయ్య అనే టీడీపీ కార్యకర్త ఇంటిపై వైసీపీకి చెందిన దుంపల మధు, అతని అనుచరులు దాడి చేశారు.

YSRCP Attack: వైసీపీ మూకల దాష్టీకం.. యువకుడి దారుణ హత్య..

తిరుపతి జిల్లా: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. వైసీపీ మూకలు దాడి చేసి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఈ ఘటన చిల్లకూరు మండలం నాంచారంపేటలో చోటు చేసుకుంది. రాజకీయ కక్షల నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి చెలగల కాటయ్య అనే టీడీపీ కార్యకర్త ఇంటిపై వైసీపీకి చెందిన దుంపల మధు, అతని అనుచరులు దాడి చేశారు. అందరూ నిద్రిస్తుండగా ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.


మంటలు పెద్దఎత్తున రావడంతో గమనించిన కుటుంబసభ్యులు ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థంకాక అయోమయానికి గురయ్యారు. అయితే ఇంటి బయటే కాపుకాసిన కొంతమంది యువకులు.. ఇంటి నుంచి బయటకు వచ్చిన వారిపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడులకు తెగబడ్డారు. విచక్షణారహితంగా కొట్టడంతో అందరికీ తీవ్రగాయాలు అయ్యాయి. బాధితుల అరుపులతో చుట్టుపక్కల ఇళ్లవారు, టీడీపీ శ్రేణులు అప్రమత్తం అయ్యారు.


చెలగల కాటయ్య కుటుంబసభ్యుల ఆర్తనాదాలతో వైసీపీ మూకలను అడ్డుకునేందుకు స్థానికులు పెద్దఎత్తున చేరుకున్నారు. అయితే వారిపైనా కర్రలు, రాడ్లతో మధు వర్గం వారు దాడులకు తెగబడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అయితే వైసీపీ మూకల దాడిలో మల్లారపు హరిప్రసాద్( 20) అనే యువకుడికి తీవ్రగాయాలు కాగా.. అక్కడికక్కడే మృతిచెందాడు. పలువురు టీడీపీ కార్యకర్తలకు సైతం గాయాలు అయ్యాయి.


యువకుడి హత్య ఉదతం జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే వైసీపీకి చెందిన కట్టా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోనే దాడులు జరిగాయంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు దుంపల మధు, కట్టా రామచంద్రారెడ్డిని కఠినంగా శిక్షించాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. హత్య గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో మరోమారు ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.


మరోవైపు పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో టీడీపీ కార్యకర్త భార్య పట్ల వైసీపీ నాయకుడు నాగార్జున అసభ్యకరంగా ప్రవర్తించాడు. అవమానం భరించలేక ఆ మహిళ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. బాధితురాలిని హుటాహుటిన నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Updated Date - Oct 22 , 2024 | 10:08 AM