Share News

AP NEWS: కొత్త పరిశ్రమలను తేకపోగా ఉన్న వాటిని తరిమేస్తారా.. సీఎం జగన్‌పై సోమిరెడ్డి ఆగ్రహం

ABN , Publish Date - Feb 19 , 2024 | 06:41 PM

సీఎం జగన్ రెడ్డి.. ఏపీకు కొత్త పరిశ్రమలను తేకపోగా ఉన్న వాటిని తరిమేస్తారా అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) ప్రశ్నించారు.

AP NEWS: కొత్త పరిశ్రమలను తేకపోగా ఉన్న వాటిని తరిమేస్తారా.. సీఎం జగన్‌పై  సోమిరెడ్డి ఆగ్రహం

అమరావతి: సీఎం జగన్ రెడ్డి.. ఏపీకు కొత్త పరిశ్రమలను తేకపోగా ఉన్న వాటిని తరిమేస్తారా అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) ప్రశ్నించారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగడాలతోనే తమిళనాడుకు కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఏపీకు పరిశ్రమలు, పెట్టుబడులు తేవడానికి అహర్నిశలు శ్రమించే వారని గుర్తుచేశారు. ఇప్పుడు వైసీపీ పాలనలో అంతా రివర్స్.. పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చే విషయంలో జగన్ వైఖరి సందేహాత్మకంగా ఉందని చెప్పారు. ప్రతిష్టాత్మక కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ టెర్మినల్ పొరుగు రాష్ట్రానికి తరలిపోతే పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు.

అమర్ రాజాను ఏపీ నుంచి ఎందుకెళ్లగొట్టారు..?

వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, పరిశ్రమలకు సంబంధించిన ఉపకరణాల దిగుమతులకు ఈ టెర్మినల్ కీలకమని తెలిపారు. వీటన్నింటిని వదిలేసి పోర్టును బొగ్గు, బూడిద, ఐరన్ ఓర్‌తో కూడిన కాలుష్య భరిత డర్టీ కార్గోకు పరిమితం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఏపీ మారిటైం బోర్డు యాజమాన్యంలోని కంటైనర్ టెర్మినల్ పోర్టు తరలిపోతుంటే జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాలుష్య రహిత అమర్ రాజా కంపెనీపై కాలుష్యమని నింద వేసి వేధించారని ధ్వజమెత్తారు. రూ.9000 కోట్ల విలువైన అనుబంధ పరిశ్రమను తెలంగాణకు తరిమేశారని చెప్పారు. వైసీపీ ఎంపీ దౌర్జన్యాలతో కియా కంపెనీ అనుబంధ పరిశ్రమలు కర్ణాటకకు వెళ్లిపోయాయని వివరించారు. ఇప్పుడు నెల్లూరులో మంత్రి కాకాణి ధనదాహం, దౌర్జన్యం కారణంగా ఒక్క సర్వేపల్లికే కాక ఏపీకి కూడా భారీ నష్టం కలుగుతోందని దుయ్యబట్టారు. గతంలో నవయుగ కంపెనీ ఏడాదికి రూ. 6 లక్షల కంటైనర్లను ట్రాన్స్ పోర్టు చేసిందని.. రాష్ట్ర ఖజానాకు రూ. వెయ్యి కోట్ల ఆదాయం ఇచ్చిందని చెప్పారు. ఇప్పుడు ఆ ఆదాయం పాతాళానికి పడిపోయిందన్నారు. బల్క్ కార్గోతో ఇప్పుడు రాష్ట్ర ఖజానాకు వచ్చేది రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల అని తెలిపారు. కంటైనర్ టెర్మినల్ తరలిపోవడంతో 10 వేల మంది ఉద్యోగులు, కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 19 , 2024 | 06:47 PM