Venkaiah Naidu: మరోసారి రాజకీయాలపై వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 30 , 2024 | 04:42 PM
చట్ట సభల్లో హుందాగా మాట్లాడాలని, రాజకీయాలు రోజు రోజుకూ దారుణంగా మారుతున్నాయని... ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియడం లేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) వ్యాఖ్యానించారు.
నెల్లూరు: చట్టసభల్లో హుందాగా మాట్లాడాలని, రాజకీయాలు రోజు రోజుకూ దారుణంగా మారుతున్నాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) వ్యాఖ్యానించారు. ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియడం లేదని చమత్కరించారు. మంత్రి సత్యకుమార్ తనతో దాదాపు 27 ఏళ్లు ఉన్నారని చెప్పారు. మంత్రి సత్య కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఎవరైనా తమ తమ వంశాల నుంచి ఎవరో ఒకరిని రాజకీయల్లో ఉండాలని కోరుకుంటారని అన్నారు. ఈరోజు(ఆదివారం) నెల్లూరు జిల్లాలో వెంకయ్య నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుకు, కూతురును రాజకీయాల్లోకి తీసుకు రావాలని చాలామంది తనపై ఒత్తిడి తెచ్చారని గుర్తుచేశారు. వారు వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారని వెంకయ్య నాయుడు తెలిపారు.
వారు ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు. వారికి ఇష్టమైన పని వారిని చేసుకొనివ్వాలని సూచించారు. తనకు ఇష్టమైన పని తాను చేస్తానని అన్నారు. కుమారులు, కూతుర్లను రాజకీయంలోకి తీసుకు రావాలని ఎవరూ ఒత్తిడి తేవద్దని అన్నారు. రాజకీయాల్లోకి యువత రావాలని వెంకయ్య నాయుడు సూచించారు.
రాజకీయాల్లోకి వచ్చి సిద్ధాంత పరమైన రాజకీయలు చేయాలని కోరారు. చట్టసభలకు ఎన్నికైన యువత ఆ చట్టసభలకు గౌరవం తేవాలని వెంకయ్య నాయుడు అభిలాషించారు. పార్టీ మారితే పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని అన్నారు. కులం, ధనాన్ని బట్టి ఓటు వేయడం కాదని , గుణాన్ని చూసి ఓటు వేయాలని కోరారు. వ్యక్తి గుణాన్ని బట్టి నడవడక ఉండాలని చెప్పారు.
ఓటు వేయకపోతే ప్రజాస్వామ్యనికి చేటని అన్నారు . అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అని పేర్కొన్నారు. తెలుగు వంటలు, తెలుగు వేషధారణ , వ్యవసాయం తనకు చాలా ఇష్టమని వెంకయ్య నాయుడు తెలిపారు.