Share News

Vijayawada : జగన్‌ కక్షకు బందరు పోర్టు బలి

ABN , Publish Date - Jun 30 , 2024 | 02:47 AM

బందరు పోర్టు నిర్మాణం... రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ. 2008లో వైఎ్‌సఆర్‌ హయాంలో పోర్టుకు శంకుస్థాపన చేసినా పనులు ముందుకు సాగలేదు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ ప్రాజెక్టులో కదలిక తీసుకొచ్చారు.

Vijayawada : జగన్‌ కక్షకు బందరు పోర్టు బలి

రద్దుల పద్దు.. రివర్స్‌ దందాలతో ప్రాజెక్టు పడక

  • అధికారంలోకొస్తూనే నవయుగ కాంట్రాక్టు రద్దు

  • రాజకీయ కక్షసాధింపుతో పనులకు బ్రేక్‌

  • కమీషన్ల కోసం ఈపీసీ విధానం తెరపైకి

  • పైకిమాత్రం డబ్బులు ఆదా చేస్తామని గొప్పలు

  • దేశంలో ఎక్కడా లేనివిధంగా అడ్డగోలు ప్రక్రియ

  • నిబంధనలు తుంగలో తొక్కి మేఘాకు కాంట్రాక్టు

  • ‘రివర్స్‌’ పేరిట 275 శాతం అంచనాలు పెంపు

  • సముద్ర నిర్మాణాల్లో అనుభవమే లేని మేఘ

  • వరుస తప్పిదాలతో నత్తనడకన పనులు

బందరు పోర్టు నిర్మాణం... రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ. 2008లో వైఎ్‌సఆర్‌ హయాంలో పోర్టుకు శంకుస్థాపన చేసినా పనులు ముందుకు సాగలేదు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ ప్రాజెక్టులో కదలిక తీసుకొచ్చారు. అవసరమైన భూసేకరణ చేసి, ప్రభుత్వానికి పైసా ఖర్చు కాకుండా పీపీపీ విధానంలో పోర్టు నిర్మించేలా కాంట్రాక్టు అప్పగించారు. ఆ దిశగా పనులు కూడా ప్రారంభించారు. ఇంతలో జగన్‌ సర్కారు రావడంతో అమరావతి, పోలవరం తరహాలో బందరు పోర్టును కూడా బలి చేసింది. రాజకీయ కక్షసాధింపుతో పాటు కమీషన్ల కోసం నవయుగను తప్పించి, రివర్స్‌ టెండరింగ్‌ పేరిట డ్రామాలు ఆడింది. ఏకంగా 275 శాతం అంచనాలు పెంచి, సముద్ర నిర్మాణ పనుల్లో ఏ మాత్రం అనుభవం లేని మేఘకు కాంట్రాక్టు అప్పగించింది. జగన్‌ సర్కారు తప్పిదాల ఫలితంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టి పరుగులు పెట్టించడం చంద్రబాబు ప్రభుత్వం ముందున్న సవాల్‌.

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

జగన్‌ సర్కారు రాజకీయ కక్ష సాధింపులకు బందరు పోర్టు సమిధగా మారింది. రాష్ట్రాభివృద్ధి, ప్రజల ఆకాంక్షల కన్నా కాసుల వేటకే ప్రాధాన్యమిచ్చిన గత పాలకులు బందరు పోర్టును కమీషన్ల కామధేనువుగా మార్చేసుకున్నారు. ప్రభుత్వానికి పైసా ఖర్చు కాకుండా పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో టీడీపీ ప్రభుత్వంలో పోర్టు నిర్మాణాన్ని చేపట్టిన నవయుగను కాదని కమీషన్లు కురిపించే ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌(ఈపీసీ) విధానాన్ని తెరపైకి తెచ్చారు.

టెండరు నిబంధనలను తుంగలో తొక్కి మరీ మేఘ సంస్థకు టెండరు కట్టబెట్టారు. పైగా తాము ఎంతో నిజాయతీపరులమని ప్రజలను మభ్యపెట్టేందుకు రివర్స్‌ టెండరింగ్‌ అంటూ నాటకాలాడారు. మొత్తానికి బందరు పోర్టును సముద్ర నిర్మాణాల్లో ఎలాంటి అనుభవం లేని మేఘ సంస్థ చేతిలో పెట్టి చేతులు దులిపేసుకున్నారు. దీని ఫలితంగా పోర్టు పనులు నత్తనడక నడుస్తున్నాయి.


దశాబ్దాల కల...

బందరు పోర్టు నిర్మాణం ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులకే గాక రాష్ట్ర ప్రజలందరి చిరకాల వాంఛ. బందరు పోర్టును అభివృద్ధి చేయాలని కోరుతూ 2001 నుంచి మచిలీపట్నం కేంద్రంగా ఉద్యమాలు నడిచాయి. వాటి ఫలితంగా 2008 ఏప్రిల్‌ 23న అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి కరగ్రహారం వద్ద బందరు పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. పోర్టు పనులు దక్కించుకున్న మేటాస్‌ సంస్థ ఆర్థిక చిక్కుల్లో పడటం.. అప్పటి ప్రభుత్వమూ పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. ప్రజలు మళ్లీ ఉద్యమబాట పట్టారు.

రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో టీడీపీ ప్రభుత్వం రావడంతో 2015 ఆగస్టులో పోర్టు, దాని అనుబంధ పరిశ్రమల కోసం 14 వేల ఎకరాలను కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. రైతులు ముందుకు రాకపోవడంతో 2016 ఆగస్టులో భూసమీకరణ నోటిఫికేషన్‌ జారీ చేశారు. పోర్టు అభివృద్ధి కోసం 2016లో మచిలీపట్నం అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ముడా)ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత భూసమీకరణ వేగం పుంజుకుంది. నవయుగ సంస్థకు పోర్టు నిర్మాణ బాధ్యతలను అప్పగించారు.

2019 ఫిబ్రవరి 7న అప్పటి సీఎం చంద్రబాబు తవసిపూడి వద్ద పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కొద్ది నెలలకే 2019 జూన్‌లో వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కింది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. అదే ఏడాది ఆగస్టులో పోర్టు నిర్మాణ బాధ్యతల నుంచి నవయుగ సంస్థను తప్పిస్తూ జగన్‌ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. 2023 మే 22న ముచ్చటగా మూడోసారి అప్పటి సీఎం జగన్‌ పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు.

‘రివర్స్‌’ పేరుతో డ్రామా..

బందరు పోర్టు నిర్మాణానికి రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా టెండర్లు పిలిచి పెద్దఎత్తున డబ్బులు ఆదా చేస్తామని గత వైసీపీ సర్కార్‌ గొప్పలు చెప్పింది. రివర్స్‌ టెండరింగ్‌ అనేది పెద్ద బూటకమని అప్పట్లోనే పలువురు నిపుణులు గగ్గోలు పెట్టారు. వాస్తవానికి నవయుగ సంస్థకు పీపీపీ విధానంలో బిల్డ్‌, ఆపరేట్‌, షేర్‌, ట్రాన్స్‌ఫర్‌ మోడల్‌లో బందరు పోర్టు పనులను అంతకుముందు టీడీపీ ప్రభుత్వం అప్పగించింది. ఈ విధానం వల్ల నిర్మాణ సంస్థ తానే నిర్మాణ పనులు పూర్తి చేసి, పోర్టులో రాష్ట్ర ప్రభుత్వాన్ని భాగస్వామిగా చేర్చుకుంటుంది.

ఈ విధానాన్ని తుంగలో తొక్కి కమీషన్లు గిట్టుబాటు అయ్యేలా వైసీపీ ప్రభుత్వం ఈపీసీ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఏపీ మారిటైం బోర్డు ఆధ్వర్యంలో బందరు పోర్టుకు టెండర్లు పిలిచారు. దేశంలోనే ఏ పోర్టు టెండర్లలోనూ లేనటువంటి విధంగా ఈ టెండర్‌ ప్రక్రియను సాగించారు. అర్హత ప్రక్రి య, గతంలో చేసిన పనులు వంటి వాటన్నింటినీ తమ అనుకూలమైన కాం ట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేలా మార్చేసి అర్హత లేని వారికి టెండర్లు కట్టబెట్టారు.


అంచనాలు 275 శాతం పెంపు

రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో నవయుగ సంస్థ కాంట్రాక్టును రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం బందరు పోర్టు నిర్మాణ వ్యయం అంచనాలను అడ్డగోలుగా పెంచేసింది. వైసీపీ ప్రభుత్వం టెండర్లు పిలిచే నాటికి బందరు పోర్టు అంచనా వ్యయం రూ.11,463 కోట్లకు చేరింది. ఫేజ్‌-1కు రూ.3,670 కోట్లకు టెండరు పిలిచారు. దాన్ని ఈపీసీ విధానంలో రూ.5,155 కోట్ల వరకు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. ఇదే ఫేజ్‌-1 పనులకు నవయుగ సంస్థకు ఇచ్చిన ప్రాజెక్టు వ్యయం రూ.1,868 కోట్లు. అంటే.. సుమారు 275 శాతం అధిక ధరకు మేఘ సంస్థకు ఫేజ్‌-1 పనుల టెండరు కట్టబెట్టారు.

అనుభవం లేకున్నా..

సముద్రంలో నిర్మాణ పనులు చేయాలంటే ప్రత్యేకమైన అనుభవం ఉండాలి. సముద్రంలో నిర్మించే జెట్టీలు, బెర్తులు, బ్రేక్‌ వాటర్‌, సముద్రంలో డ్రెడ్జింగ్‌ వంటి పనుల్లో అనుభవం ఉన్న వారికే పోర్టు నిర్మాణ బాధ్యతలు కట్టబెడతారు. కొచ్చిన్‌ పోర్టు ట్రస్ట్‌, న్యూ మంగళూరు పోర్టు ట్రస్ట్‌, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌ వంటి సంస్థలన్నీ సాధారణంగా ఇలాంటి కాంట్రాక్టర్లకే పనులు అప్పగిస్తుంటాయి. కానీ ఏపీ మారిటైం బోర్డు చిత్రంగా ట్రాన్స్‌పోర్టేషన్‌, అర్బన్‌ డెవల్‌పమెంట్‌, ఇరిగేషన్‌, ఇండస్ట్రీస్‌ రంగంలో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు కూడా టెండరులో పాల్గొనేలా వెసులుబాటు కల్పించింది.

అస్మదీయులకు పోర్టు పనులు అప్పగించడం కోసమే ఇలా సడలింపులు చేసింది. పోర్టు నిర్మాణంలో ప్రధానమైన బ్రేక్‌ వాటర్‌, బెర్తుల నిర్మాణం, డ్రెడ్జింగ్‌ వంటి పనులను అనుభవం ఉన్న సబ్‌ కాంట్రాక్టర్లకు కట్టబెట్టేలా కూడా టెండరులో వెసులుబాటు కల్పించడం విడ్డూరం. ఏపీ మారిటైం బోర్డు పిలిచిన ఈపీసీ టెండర్లలో మేఘ ఇంజనీరింగ్‌ కంపెనీ, విశ్వసముద్ర హోల్డింగ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పాల్గొన్నాయి. మేఘ సంస్థకు సముద్రంలో నిర్మాణాలు చేసిన అనుభవమే లేదు.

ఇక విశ్వసముద్ర కంపెనీ... అదానీ కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్‌ (గతంలో కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్‌)కు అనుబంధ సంస్థ. కేపీసీఎల్‌ టర్నోవర్‌ను తమ సంస్థ టర్నోవర్‌గా చూపి విశ్వసముద్ర టెండరులో పాల్గొనడం గమనార్హం. ఎలాంటి అనుభవం లేకున్నా మేఘకు పోర్టు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. చట్టవిరుద్ధంగా పోర్టు కాంట్రాక్టు నుంచి తొలగించడంపై నవయుగ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఆగమేఘాలపై పోర్టు కాంట్రాక్టును మేఘకు కట్టబెట్టేశారు.

Updated Date - Jun 30 , 2024 | 02:48 AM