Minister Anagani: వైసీపీ పాలనలో భూ అక్రమాలపై చర్యలు: మంత్రి అనగాని
ABN , Publish Date - Aug 15 , 2024 | 02:55 PM
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భూ అక్రమాలు జరిగినట్లు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్(Minister Anagani Satyaprasad) ఆరోపించారు. విశాఖలో మాత్రమే భూ అక్రమాలు జరిగాయని అనుకుంటే పొరపాటే అన్నారు. ఆగస్టు 15సందర్భంగా విశాఖ గ్రీన్ పార్క్ కూడలి వద్ద సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
విశాఖ: వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భూ అక్రమాలు జరిగినట్లు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్(Minister Anagani Satyaprasad) ఆరోపించారు. విశాఖలో మాత్రమే భూ అక్రమాలు జరిగాయని అనుకుంటే పొరపాటే అన్నారు. ఆగస్టు 15సందర్భంగా విశాఖ గ్రీన్ పార్క్ కూడలి వద్ద సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన భూ దందాలపై విచారణ జరిపిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 200సంవత్సరాలలో బ్రిటిష్ వారు ఎంత దోచుకున్నారో గడిచిన ఐదేళ్ల పాలనలో వైసీపీ నాయకులు అంతలా దోచుకున్నారంటూ అనగాని తీవ్ర విమర్శలు గుప్పించారు. నూతన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు.
ఫిర్యాదుల స్వీకరణకు సిసోడియా..
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్ అగ్రిగోల్డ్ వ్యవహారంతోపాటు మరిన్ని అక్రమాలు బయటకు వచ్చే అవకాశం ఉందని మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. అధికారం ఉన్నప్పుడు అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇప్పుడు బుకాయిస్తున్నారని మండిపడ్డారు. అడ్డంగా దొరికిపోయిన జోగి రమేశ్ ఇప్పుడు కులప్రస్తావన తెస్తూ రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహించారు. ఈ నేపథ్యంలోనే భూ అక్రమాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారని మంత్రి వెల్లడించారు.
ఫైళ్ల మాయంపై విచారణ..
మదనపల్లె తరహాలోనే పలు చోట్ల భూములు ఆక్రమించి ముఖ్యమైన ఫైళ్లను మాయం చేశారని, వాటన్నింటిపైనా విచారణ చేస్తామని మంత్రి అనగాని తెలిపారు. అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. త్వరలోనే ఏపీ రాజముద్రతో నూతన పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తామని చెప్పారు. ఉత్తరాంధ్రలో నిర్మించే ప్రాజెక్టుకు సర్దార్ గౌతు లచ్చన్న పేరు పెట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు.