YV Subbareddy: రాజధాని గురించి సీఎం జగన్ కూడా ఆ విషయాన్ని చెబుతారు
ABN , Publish Date - Feb 13 , 2024 | 07:25 PM
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ వేశానని... తన గెలుపు కూడా తథ్యమని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) తెలిపారు.
విశాఖపట్నం: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ వేశానని... తన గెలుపు కూడా తథ్యమని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) తెలిపారు. మంగళవారం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రయోజనల కోసం రాజీనామాలు చేశామని ఈ విషయం అందరికి తెలుసునని చెప్పారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడం చాలా అవసరమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమని చెప్పారు. రైల్వే జోన్‌కు సంబంధించి సైటు కూడా ఇవ్వడం జరిగిందని.. ఈ కార్యక్రమాలు మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు.
2024 విభజన తర్వాత సుమారు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉంచారని గుర్తుచేశారు. గత టీడీపీ ప్రభుత్వం కూడా తాత్కాలిక రాజధానిగా అమరావతిని నిర్మించడం జరిగిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక విశాఖను రాజధానిగా అనుకున్నామని చెప్పారు. దానిపై కూడా న్యాయ పరమైన ఇబ్బందులు పెట్టారని వాటిని కూడా ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈ సమస్యలను అధిగమించే వరకు కూడా హైదరాబాద్‌ను కొనసాగించాలన్నదే తమ ఆలోచన అని వివరించారు.. ఎన్నికల తర్వాత సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో కలిసి హైదరాబాద్ రాజధానిగా ఉంచటంపై వివరణ ఇస్తారని చెప్పారు. విశాఖ రాజధానిగా చేసేంత వరకు కూడా హైదరాబాద్‌ను ఏపీకి రాజధానిగా కొనసాగితే బాగుంటుందని తమ ఆలోచన అని చెప్పారు. ఈ నెల ఆఖరున వైసీపీ మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉందని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.