Russia-Ukraine War: పుతిన్‌ని ఒప్పించి యుద్ధం ఆపండి.. భారత్‌కు అమెరికా రిక్వెస్ట్
ABN , Publish Date - Jul 16 , 2024 | 06:35 PM
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లు అవుతున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే.. ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. ఇలాంటి తరుణంలో..
రష్యా, ఉక్రెయిన్ (Russia-Ukraine War) మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లు అవుతున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే.. ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. ఇలాంటి తరుణంలో.. అగ్రరాజ్యం అమెరికా (America) మరోసారి భారత్‌కు (India) ఓ విజ్ఞప్తి చేసింది. ఈ యుద్ధానికి ముగింపు లభించేలా కృషి చేయాలని.. ఇందుకోసం రష్యాతో ఉన్న దీర్ఘకాల బంధాన్ని ఉపయోగించాలని కోరింది. ఉక్రెయిన్‌తో రష్యా చేస్తున్న యుద్ధం చట్టవిరుద్ధమైందని ఆరోపణలు చేస్తూ.. ఈ యుద్ధాన్ని విరమించేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను (Vladimir Putin) ఒప్పించాలని భారత్‌కు పిలుపునిచ్చింది.
సోమవారం నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ.. ‘‘భారత్, రష్యా మధ్య దీర్ఘకాలం నుంచి బలమైన సంబంధాలు ఉన్నాయి. రష్యా వద్ద భారత్‌కు ఓ విశిష్ట స్థానం కూడా ఉంది. వాటిని ఉపయోగించి.. ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధాన్ని విరమించుకునేలా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడాలని భారత్‌ని కోరుతున్నాం. చట్టవిరుద్ధమైన ఈ యుద్ధానికి స్వస్తి పలికి.. శాంతి స్థాపనకు కృషి చేయాలని పుతిన్‌కి చెప్పమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఐక్యరాజ్య సమితి నిబంధనలతో పాటు ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలని ఆయనకు సూచించమని చెప్తున్నాం’’ అంటూ చెప్పుకొచ్చారు. తమకూ భారత్‌తో సత్సంబంధాలు ఉన్నాయని, అందుకే ఈ విషయంపై నిరంతరాయంగా ఒత్తిడి తెస్తున్నామని తెలిపారు.
కాగా.. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు రష్యా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పుతిన్ కోరిక మేరకు ఆయన అక్కడికి వెళ్లగా.. ఆ ఇద్దరి మధ్య పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిగాయి. శిఖరాగ్ర చర్చల సందర్భంగా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కూడా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంతో ఒరిగేదేమీ లేదని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. అంతేకాదు.. మోదీ, పుతిన్ ఇద్దరూ ఎంతో స్నేహపూర్వకంగా మెలుగుతూ ఫోటోలకు పోజులూ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే.. మాథ్యూ మిల్లర్ పైవిధంగా స్పందించారు. ఈ యుద్ధాన్ని ఆపడంలో కృషి చేయాలని, పుతిన్‌తో మాట్లాడి ఒప్పించాలని కోరారు.
Read Latest International News and Telugu News