Share News

AP CM Chandrababu : ఆదుకోండి..!

ABN , Publish Date - Jul 05 , 2024 | 04:46 AM

ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ వచ్చిన చంద్రబాబు గురువారం ప్రధానమంత్రితో సమావేశమయ్యారు.

AP CM Chandrababu : ఆదుకోండి..!

ఐదేళ్లలో ఏపీ అస్తవ్యస్తం.. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం

కోలుకునేదాకా సాయం చేయండి.. ప్రధానికి చంద్రబాబు వినతి

7 ప్రాధాన్యాంశాల నివేదన

ఆర్థికంగా చేయూత జూ పోలవరానికి సహకారం

అమరావతికి అండ జూ పారిశ్రామిక ప్రోత్సాహాలు

మౌలిక వసతులకు అదనపు కేటాయింపులు

వెనుకబడిన ప్రాంతాలకు ‘బుందేల్‌ఖండ్‌’ ప్యాకేజీ

దుగరాజపట్నం అభివృద్ధికి చేయూత

జగన్‌ దుష్టపాలనలో అవినీతి విచ్చలవిడిగా జరిగింది. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఆయన ఏలుబడి వల్లే అధిక నష్టం జరిగింది.

వ్యూహాత్మక దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలంటూ జగన్‌ సర్కారుకు లేవు. దుందుడుకు విఽధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది. ఆర్థిక అక్రమాలు, సహజ వనరుల దోపిడీ పెద్దఎత్తున జరిగాయి.

రెవెన్యూ వసూళ్లు తగ్గిపోయాయి. అప్పులు తారస్థాయికి చేరుకున్నాయి. అభివృద్ధి కుంటుపడింది.

రాష్ట్రానికి కేంద్రం ఆర్థికంగా చేయూతనిస్తేనే ఈ సవాళ్లను ఎదుర్కోగలం.

- ప్రధానితో చంద్రబాబు

గత ఐదేళ్లలో ఆర్థికంగా అస్తవ్యస్తమై, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రాష్ట్రం కోలుకునే వరకు కొంతకాలం పాటు ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థిక నిధుల నిర్వహణలో గత ప్రభుత్వం తీవ్రమైన అక్రమాలకు పాల్పడినందువల్ల రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన్నారు.

కేంద్ర మంత్రులు అమిత్‌షా, ఖట్టర్‌, గడ్కరీ, గోయల్‌, చౌహాన్‌, పురీలతోనూ చంద్రబాబు భేటీ

రాష్ట్ర కేడర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు విందు

నేడు నిర్మల, రాజ్‌నాథ్‌,నడ్డాతో చర్చలు

నీతీ ఆయోగ్‌ సీఈవో, జపాన్‌ రాయబారితో కూడా

ఢిల్లీలో మోదీతో సీఎం సమావేశం

నవ్యాంధ్రపై ఇప్పటికీ ‘విభజన’

దుష్పరిణామాల ప్రభావం

దానికంటే జగన్‌ చేసిన నష్టమే ఎక్కువ

తారస్థాయికి చేరిన అప్పులు

ఆదాయం తగ్గింది.. ఖర్చు పెరిగింది

మానవ వనరులపై నిర్లక్ష్యం

ఇష్టానుసారం సహజ వనరుల దోపిడీ

మౌలిక వసతులపై పెట్టుబడులే లేవు

ప్రధానికి ముఖ్యమంత్రి ఫిర్యాదు

పునర్నిర్మాణానికి చేయూత.. మోదీ హామీ

న్యూఢిల్లీ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ వచ్చిన చంద్రబాబు గురువారం ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. ఏడు ప్రాధాన్యాంశాలను ఆయన ముందుంచి... సంపూర్ణ సహకారం, సహాయం అందించాలని విన్నవించారు. రాష్ట్రానికి ఆర్థికంగా చేయూత.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకారం, అమరావతిలో ప్రభుత్వ సముదాయాలు, మౌలిక సదుపాయాలకు సమగ్ర ఆర్థిక మద్దతు.. పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహకాలు.. రోడ్లు, వంతెనలు, నీటిపారుదల, తాగునీటి ప్రాజెక్టుల వంటి అత్యవసర రంగాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి వ్యయం కోసం ప్రత్యేక సాయం కింద అదనపు కేటాయింపులు.. బుందేల్‌ఖండ్‌ తరహాలో వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ, దుగరాజపట్నం రేవు అభివృద్ధికి తోడ్పాటు అందించాలని అభ్యర్థించారు. 2014లో ఆంధ్రప్రదేశ్‌ను అశాస్త్రీయంగా విభజించారని.. దాని పర్యవసానాలను విభజిత రాష్ట్రం ఇప్పటికీ అనుభవిస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. పులిమీద పుట్రలాగా గత ఐదేళ్లలో జగన్‌ దుర్మార్గమైన, దుష్టపాలనలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని, రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఎక్కువ విఘాతం ఆయన పాలన వల్లే జరిగిందని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వానికి వ్యూహాత్మక దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలంటూ లేకపోవడం.. దుందుడుకు విఽధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక వనరుల లోటు తీవ్రంగా ఉందని వివరించారు. ‘జీతాలు, పింఛన్లు, అప్పుల చెల్లింపు వంటి ఖర్చులు తప్పవు. ఇవి రాష్ట్ర రెవెన్యూ వసూళ్లను మించిపోయాయి. దీనివల్ల ఉత్పాదక మూలధన పెట్టుబడులకు నిధులే లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. భవిష్యత్‌ ఎక్సైజ్‌ ఆదాయాలను, ప్రభుత్వ భవనాలను కూడా తాకట్టు పెట్టి విచ్చలవిడిగా అప్పులు తెచ్చారు. నిధులను పెద్ద ఎత్తున మళ్లించారు. దీంతో వనరులకు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఆర్థికంగా చేయూతనివ్వడం తప్ప గత్యంతరం లేదు. అప్పుడే ఈ సవాళ్లను ఎదుర్కోగలం’ అని పేర్కొన్నారు.

ghfbkjnh.jpg


అన్ని విధాలుగా సాయం: మోదీ

చంద్రబాబు వినతులకు ప్రధాని సానుకూలంగా స్పందించారు. ఏపీ అభివృద్ధికి అన్ని విధాలా తోడ్పడతామని.. రాజధాని అమరావతి సహా రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు. అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. ప్రధానితో సమావేశం పూర్తి సంతృప్తి ఇచ్చిందన్నారు. మోదీ నాయకత్వంలో రాష్ట్రం పవర్‌ హౌస్‌గా ఆవిర్భవిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధానితో నిర్మాణాత్మకంగా సమావేశం జరిగిందని, రాష్ట్రాభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించానని తెలిపారు.

వికసిత్‌ ఆంధ్రకు కట్టుబడిఉన్నాం: అమిత్‌షా

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సహా ఆరుగురు కేంద్ర మంత్రులతో కూడా సీఎం సమావేశమయ్యారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి వారంతా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అమిత్‌ షా, చంద్రబాబు దాదాపు అరగంట సేపు కీలక సమాలోచనలు జరిపారు. దేశం, రాష్ట్రాభివృద్ధికి సంబంధించి అనేక అంశాలను ముఖ్యమంత్రితో చర్చించానని హోం మంత్రి ట్వీట్‌ చేశారు.

రాజధాని నిర్మాణానికి సహకరించండి..

రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు సహకరించాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి, విద్యుత్‌ శాఖల మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను చంద్రబాబు కోరారు. ఏపీకి సంబంధించి పలువురు జాతీయ రహాదారుల నిర్మాణానికి సంబంధించి సీఎంతో విస్తృతంగా చర్చించానని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఏపీ తన శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకునేందుకు సంసిద్ధంగా ఉందని.. రాష్ట్రాన్ని సుసంపన్నమైన, అభివృద్ధి బాటలో తీసుకెళ్లగలమనే విశ్వాసం తనకుందని చంద్రబాబు తెలిపారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌తో జరిపిన భేటీలో సహకార సమాఖ్య స్ఫూర్తితో చర్చలు జరిగాయన్నారు. కేంద్ర వ్యవసాయ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, పెట్రోలియం మంత్రి హర్దీ్‌పసింగ్‌ పురీతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఉదయం పీయూష్‌ గోయల్‌తో అల్పాహార విందు సమావేశంతో తన షెడ్యూల్‌ను ప్రారంభించిన చంద్రబాబు.. సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహించారు. రాత్రికి ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన పలువురు సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, మాజీ అధికారులకు విందు ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

నేడు నిర్మలా సీతారామన్‌తో భేటీ

చంద్రబాబు శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమవుతారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఆరోగ్య మంత్రి జగత్‌ ప్రకాశ్‌ నడ్డా, సామాజిక న్యాయ, సాధికారిక మంత్రి రాందాస్‌ అథవాలేతో పాటు నీతి ఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం, జపాన్‌ రాయబారి సుజుకి హిరోషీలను కూడా కలుస్తారు. సాయంత్రం హైదరాబాద్‌ వెళ్తారు. శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశం తర్వాత అమరావతికి బయల్దేరతారు.


పీయూష్‌ గోయల్‌తో భేటీ అంశాలు..

పరిశ్రమలకు నీరు, విద్యుత్‌, రైల్వే, రహదారుల కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు గ్రాంట్ల రూపంలో ఆర్థిక సాయం అందించాలి.

కేంద్రం అధీనంలోని ఓడరేవు ఆధారిత ఉప్పు భూములను రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కోసం రిజిస్టర్డ్‌ విలువకే అప్పగించాలి.

గడ్కరీతో చర్చించినవి ఇవీ..

2018లో రాజధాని ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. దీని పనులు త్వరితగతిన చేపట్టాలి. ఈ ప్రాజెక్టు అమ రావతిపై అత్యంత ప్రభావం చూపుతుంది.

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వరకు జాతీయ రహదారిని 6 లేదా 8 లైన్లుగా విస్తరించాలి.

హైదరాబాద్‌ నుంచి అమరావతికి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేను అభివృద్ధి చేయాలి.

విజయవాడకు తూర్పున బైపాస్‌ నిర్మాణాన్ని చేపట్టాలి. ఇది సిటీలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గిస్తుంది. ప్రస్తుతం డీపీఆర్‌ను ఎన్‌హెచ్‌ఏఐ సిద్థం చేస్తోంది. త్వరితగతిన డీపీఆర్‌ను ఆమోదించాలి.

నాలుగు లేన్ల కుప్పం-హోసూరు-బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణాన్ని చేపట్టాలి.

మూలపేట(భావనపాడు) నుంచి విశాఖపట్నం వరకు 4 లైన్ల గ్రీన్‌ఫీల్డ్‌ కోస్టల్‌ హైవేను నిర్మించాలి.

అమిత్‌షాతో సీఎం చర్చించిన అంశాలు..

గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం నిర్మాణానికి భూమి కోసం రూ.385 కోట్లు విడుదల చేయాలి. నిర్వహణ కోసం రూ.27.54 కోట్లు ఇవ్వాలి.

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఆస్తుల విభజన జరగాలి. షెడ్యూలు-10లోని సంస్థలు విభజించాలి. ఆ చట్టంలోని సెక్షన్‌ 47, 75 ప్రకారం రాష్ట్ర సంస్థల విభజన చేపట్టాలి.

ఏపీ జెన్‌కో, తెలంగాణ డిస్కంల మధ్య ఆర్థిక సమస్యలు పరిష్కారించాలి.

రాష్ట్ర ఐపీఎస్‌ కేడర్‌ సమీక్ష త్వరగా నిర్వహించాలి. రాష్ట్రానికి ఐపీఎస్‌ల పెంపు అంశం 2015 నుంచి పెండింగ్‌లో ఉంది. వారి సంఖ్యను 79 నుంచి 117కు పెంచే అవకాశం ఉంది.

ఖట్టర్‌తో మాట్లాడిన అంశాలు..

కర్నూలు నుంచి విశాఖకు హెచ్‌వీడీసీ ఐఎస్‌టీఎస్‌ లైను అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలి. నిబంధనలను సడలించాలి.

విశాఖపట్నం-కాకినాడను గ్రీన్‌ హైడ్రోజన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా ప్రమోట్‌ చేయాలి.

పెట్రోలియం మంత్రి పురీతో చర్చల అంశాలు..

విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో బీపీసీఎల్‌ రిఫైనరీని ఏర్పాటు చేయాలి.

పెట్రోలియం శాఖ అధ్వర్యంలో రాష్ట్రంలో రిఫైనరీ ఏర్పాటును వచ్చే బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించాలి.

వ్యవసాయ మంత్రి చౌహన్‌తో భేటీ అంశాలు..

రాష్ట్రానికి సమీకృత ఆక్వాపార్క్‌ను మంజూరు చేయాలి.

ఉద్యాన పంటలను పండించే రైతులకు సబ్సిడీ పెంచాలి

2023-24 ఏడాదిలో ఆర్‌కేవీవై పథకం కింద రాష్ట్రానికి ఇవ్వాల్సిన కేంద్రం వాటా రూ.125.52 కోట్లు ఇవ్వాలి.

రాష్ట్రంలో ఎంఐడీహెచ్‌ కార్యక్రమాలను అమలు చేయడానికి కేంద్రం వాటా రూ.165 కోట్లు, రాష్ట్ర మ్యాచింగ్‌ షేర్‌ రూ.110 కోట్లు కూడా కేటాయించాలి.

ఎన్‌ఎంఓఓపీ పథకం కింద కేంద్రం వాటా రూ.11.29 కోట్లను విడుదల చేయాలి..

కలిశెట్టీ.. వెల్‌డన్‌!

గడ్కరీతో భేటీ అనంతరం బయటకు వచ్చిన సీఎం చంద్రబాబు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడిని మెచ్చుకున్నారు. నూతన లోక్‌సభ ప్రారంభ దినాన కలిశెట్టి సైకిల్‌పై పార్లమెంటుకు వెళ్లడాన్ని ప్రశంసించారు. వెల్‌డన్‌ అంటూ భుజం తట్టారు. టీడీపీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎవరూ పార్లమెంటుకు సైకిల్‌పై వెళ్లలేదని ఆయనతో అన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 05:49 AM