Parliament Sessions: బలమైన ప్రతిపక్షం, మిత్రపక్షాల డిమాండ్‌లు.. మోదీకి విషమ పరీక్ష!
ABN , Publish Date - Jul 22 , 2024 | 08:24 AM
కన్వర్ యాత్ర, నీట్, మణిపుర్ సహా పలు వివాదాస్పద అంశాల మధ్య సోమవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రాష్ట్రాలు, రెండు మిత్రపక్షాలు(టీడీపీ, జేడీయూ) తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నాయి. వీటన్నింటి నడుమ మంగళవారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఢిల్లీ: కన్వర్ యాత్ర, నీట్, మణిపుర్ సహా పలు వివాదాస్పద అంశాల మధ్య సోమవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రాష్ట్రాలు, రెండు మిత్రపక్షాలు(టీడీపీ, జేడీయూ) తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నాయి. వీటన్నింటి నడుమ మంగళవారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
బడ్జెట్ సమావేశాల విశేషాలు..
కేంద్ర బడ్జెట్‌ను మంగళవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పిస్తారు. ఫిబ్రవరి 1న లోక్‌సభ ఎన్నికలకు ముందు 2024-25 మధ్యంతర కేంద్ర బడ్జెట్‌ను నిర్మలానే సమర్పించారు.
ఆర్థిక సర్వేను సోమవారం సమర్పించనున్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై సర్వే నివేదికలో పేర్కొంటారు. ఈ సర్వేలో వివిధ ఆర్థిక రంగాల పనితీరు, ఉపాధి, GDP వృద్ధి, ద్రవ్యోల్బణం, బడ్జెట్ లోటు వంటి వివరాలు ఉంటాయి.
కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం తరువాత తొలి సెషన్‌లో ప్రతిపక్షం పలు అంశాలపై మాట్లాడలేకపోయింది. వివాదాస్పద అంశాలపై ఈ సమావేశాల్లో వాడీవేడీ చర్చ జరగనుంది.
బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో తినుబండారాల యజమానులు తమ పేర్లను ప్రదర్శించే బోర్డులను పెట్టాలనే వివాదాస్పద నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని మిత్రపక్షాల నుంచీ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్ బోర్డుల నిర్ణయంపై మండిపడింది. దీన్ని మతపరమైన విభజన అని పేర్కొంది. ముస్లింలు, షెడ్యూల్డ్ కులాల గుర్తింపును బలవంతంగా బహిర్గతం చేయాలని బీజేపీ భావిస్తోందని విమర్శించింది. కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌లు ఉభయ సభల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని స్పష్టం చేశాయి.
మరోవైపు ఏపీలో ఇటీవలే అధికారం కోల్పోయిన వైసీపీ, ఒడిశాలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిజూ జనతాదళ్, బిహార్‌లోని బీజేపీ మిత్రపక్షం జేడీయూలు తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కావాలని సభలో డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఇదే అంశాలపై చర్చ జరిగింది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌ను టీడీపీ తమ మిత్రపక్ష పార్టీ అయిన బీజేపీపై ఒత్తిడి చేయట్లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు.
కొత్త సభ కొలువుదీరే సమయంలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానమిస్తుండగా.. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో సభకు పదే పదే అంతరాయం కలిగింది. ఈ సమావేశాల్లోనైనా అంతరాయం కలిగించవద్దని ఎన్డీయే నేతలు కోరుతున్నారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12తో ముగుస్తాయి. ఆ సమయానికి విమానయాన రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి 90 ఏళ్ల ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం స్థానంలో మరో బిల్లు సహా మొత్తం ఆరు బిల్లులను ఈ సెషన్‌లోనే ఆమోదింపజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే బిల్లుల ఆమోదంలో ఈసారి బీజేపీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఒకవైపు టీడీపీ, జేడీయూ సహకారంతో ఎన్డీయే సర్కార్ కొలువుదీరగా, మరోవైపు బలమైన ప్రతిపక్షం బీజేపీ విధానపర నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అటు మిత్రపక్షాలతో, ఇటు ప్రతిపక్షంతో మోదీ సర్కార్‌కు సవాళ్ల సవారి తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి.
For Latest News and National News click here