Share News

National : అరుణాచల్‌లో బీజేపీ హ్యాట్రిక్‌

ABN , Publish Date - Jun 03 , 2024 | 04:44 AM

అరుణాచల్‌ ప్రదేశ్‌లో కాషాయ జెండా రెపరెపలాడింది. బీజేపీ ఇక్కడ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మరోవైపు సిక్కింలో.. సిక్కిం క్రాంతి మోర్చా(ఎ్‌సకేఎం) రెండోసారి అధికారాన్ని చేపట్టనుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏప్రిల్‌ 19 ఎన్నికలు జరగ్గా.. లోక్‌సభతోపాటు ఫలితాలను ఈ నెల 4న ప్రకటించాల్సి ఉంది.

National : అరుణాచల్‌లో   బీజేపీ హ్యాట్రిక్‌

  • గతంతో పోలిస్తే.. మరో 5 సీట్లు అధికం

  • 10 ఏకగ్రీవం.. 36 చోట్ల ఘన విజయం

  • విపక్ష హోదా దక్కని ఇతర పార్టీలు

  • సిక్కింలో ఎస్‌కేఎం ఏకపక్ష విజయం

  • రెండు స్థానాల్లో గెలిచిన సీఎం తమంగ్‌

  • 2 చోట్లా ఓడిన మాజీ సీఎం చామ్లింగ్‌

  • ఇరు రాష్ట్ర నేతలకు మోదీ అభినందనలు

న్యూఢిల్లీ, జూన్‌ 2: అరుణాచల్‌ ప్రదేశ్‌లో కాషాయ జెండా రెపరెపలాడింది. బీజేపీ ఇక్కడ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మరోవైపు సిక్కింలో.. సిక్కిం క్రాంతి మోర్చా(ఎ్‌సకేఎం) రెండోసారి అధికారాన్ని చేపట్టనుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏప్రిల్‌ 19 ఎన్నికలు జరగ్గా.. లోక్‌సభతోపాటు ఫలితాలను ఈ నెల 4న ప్రకటించాల్సి ఉంది. అయితే.. ఆదివారంతో ఈ రెండు రాష్ట్రాల శాసనసభల కాలపరిమితి ముగియనుండడంతో.. భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) కౌంటింగ్‌ను రెండ్రోజులు ముందుకు జరిపింది.

  • 10 ఏకగ్రీవాలతో కమల వికాసం

అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికలకు ముందే బీజేపీ విజయం దాదాపు ఖరారైంది. అక్కడ 60 అసెంబ్లీ స్థానాలకుగాను 10 చోట్ల కమలనాథులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 50 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరగ్గా.. బీజేపీ 36 స్థానాలను దక్కించుకుంది. విపక్ష హోదా(6 సీట్లు)ను ఇతర పార్టీలేవీ దక్కించుకోకపోవడం గమనార్హం. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీఈపీ) ఐదు స్థానాల్లో గెలుపొందగా.. పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌(పీపీఏ) రెండు, ఎన్సీపీ మూడు, కాంగ్రెస్‌ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. స్వతంత్రులు మూడు చోట్ల గెలుపొందడం గమనార్హం. 2019లో బీజేపీ అరుణాచల్‌లో 41 సీట్లు సాధించగా.. ఈ సారి మరో 5 స్థానాల్లో ఆ పార్టీ బలం పెరిగింది.


  • ఎస్‌కేఎందే సిక్కిం

సిక్కింలో అధికార పార్టీ ఎస్‌కేఎం మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. 32 స్థానాలున్న సిక్కిం అసెంబ్లీలో అధికారాన్ని చేపట్టడానికి మ్యాజిక్‌ ఫిగర్‌ 17. అయితే.. సిక్కిం ప్రజలు ఎస్‌కేఎంకు ఏకపక్ష విజయాన్ని కట్టబెడుతూ 31 స్థానాల్లో ఆ పార్టీని గెలిపించారు. సీఎం ప్రేమ్‌సింగ్‌ తమంగ్‌ రెండుచోట్లా విజయం సాధించారు. ఆయన భార్య కృష్ణకుమారి కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే.. 39 ఏళ్లుగా అప్రతిహతంగా విజయం సాధిస్తూ.. 25 ఏళ్లలో వరుసగా ఐదుసార్లు సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(ఎ్‌సడీఎ్‌ఫ)కు అధికారాన్ని కట్టబెట్టిన మాజీ సీఎం పవన్‌చామ్లింగ్‌ ఈసారి పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమిని చవిచూశారు. ఆ పార్టీ ఈసారి ఒక్క స్థానానికే పరిమితమైంది. అరుణాచల్‌, సిక్కిం ప్రజలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. అరుణాచల్‌ ప్రజలు బీజేపీపై విశ్వాసం ఉంచారని కొనియాడారు.

  • నేడు ఈసీ మీడియా సమావేశం

కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. సార్వత్రిక ఎన్నికల ముగింపుపై ఈసీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారని తెలుస్తోంది. 18వ లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1వరకు మొత్తం ఏడు దశల్లో జరిగాయి. 2019 సార్వత్రిక ఎన్నికల వరకు ప్రతి దశ పోలింగ్‌ ముగిసిన తర్వాత డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్లు మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలను తెలియజేసేవారు. కానీ ఈ సారి ఆ సంప్రదాయానికి ఈసీ స్వస్తి పలికింది.

అరుణాచల్‌(60)

బీజేపీ 46

ఎన్‌పీపీ 5

ఎన్‌సీపీ 3

పీపీఏ 2

కాంగ్రెస్‌ 1

స్వతంత్రులు 3

సిక్కిం(32)

ఎస్‌కేఎం 31

ఎస్‌డీఎఫ్‌ 1

Updated Date - Jun 03 , 2024 | 04:44 AM