Share News

Chandigarh: ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారు.. ఫలితాలపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్య..

ABN , Publish Date - Feb 05 , 2024 | 05:49 PM

చండీగఢ్ మేయర్ ఎన్నికల ఫలితాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడాన్ని అనుమతించేది లేదని, రిటర్నింగ్ అధికారి చేసిన పనికి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది.

Chandigarh: ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారు.. ఫలితాలపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్య..

చండీగఢ్ మేయర్ ఎన్నికల ఫలితాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడాన్ని అనుమతించేది లేదని, రిటర్నింగ్ అధికారి చేసిన పనికి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ అధికారి ఒకరు బ్యాలెట్లను తారుమారు చేశారని సుప్రీంకోర్టు తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు మేయర్‌ ఎన్నికలు జరిగిన తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించింది. ఇదేనా రిటర్నింగ్ అధికారి ప్రవర్తన? అని ఘాటుగా ప్రశ్నించింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వీడియోను చూసిన అనంతరం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.

"కెమెరాలో చూస్తూ బ్యాలెట్ పేపర్ పాడుచేస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇదేనా ఎన్నికలు నిర్వహించే తీరు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే".. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ద్వారా బ్యాలెట్ పేపర్లు, వీడియోగ్రఫీ సహా ఎన్నికల ప్రక్రియ మొత్తం రికార్డును భద్రపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. చండీగఢ్ కార్పొరేషన్ తదుపరి సమావేశాన్ని తదుపరి విచారణ తేదీకి వాయిదా వేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.


కాగా.. లోక్‌సభ ఎన్నికల ముందు తొలి పరీక్షగా భావించిన చండీగఢ్ మేయర్ ఎన్నికలో ‘ఇండియా’ కూటమి ఓటమి పాలైంది. బీజేపీ అభ్యర్థి మనోజ్ సోన్కర్ విజయం సాధించారు. మొత్తం 35 సీట్లున్న కౌన్సిల్‌లో బీజేపీకి 14 మంది, ఆప్‌నకు 13, కాంగ్రెస్‌కు 7, శిరోమణి అకాలీదళ్‌కు ఒక సభ్యుడి బలం ఉంది. అయితే 8 మంది సభ్యులను ఓటింగ్‌లో పాల్గొనకుండా ప్రిసైడింగ్ అధికారి అనర్హుల్ని చేయడంతో బీజేపీ అభ్యర్థికి 15 ఓట్లు, ఇండియా కూటమి అభ్యర్థికి 12 ఓట్లు వచ్చాయి. ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్, ఆప్ సభ్యులు నిరసనకు దిగారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 05 , 2024 | 05:56 PM