Chandrababu : రెండు రాష్ట్రాల ప్రయోజనాలకూ ప్రాధాన్యం
ABN , Publish Date - Jul 06 , 2024 | 05:32 AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శనివారం హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో.. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడడానికే ప్రాధాన్యం ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు.
ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో చంద్రబాబు
న్యూఢిల్లీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శనివారం హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో.. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడడానికే ప్రాధాన్యం ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. విభజన సమయంలో కూడా.. రెండు రాష్ట్రాలకూ సమన్యాయం చేయాలనే తాను కోరిన విషయాన్ని బాబు గుర్తుచేశారు. శుక్రవారం ఢిలీల్లో కేంద్ర ఆర్థిక, రక్షణ, ఆరోగ్య మంత్రులతో భేటీ అనంతరం.. హైదరాబాద్ బయల్దేరి వెళ్లే ముందు మధ్యాహ్నం 3 గంటలకు జాతీయ, ప్రాంతీయ మీడియాతో ఆయన దాదాపు గంట సేపు మాట్లాడారు.
తెలంగాణ ముఖ్యమంతి ఆ రాష్ట్ర ప్రయోజనాలను ఆశించవచ్చని.. కానీ తాను రెండు రాష్ట్రాల ప్రయోజనాలూ దెబ్బతినకుండా పరస్పర ఆమోదంతో సమస్యలు పరిష్కారం కావాలనే ఉద్దేశంతోనే చర్చలు జరుపుతానని తెలిపారు. విడిపోయినా తెలుగువారు కలిసి ఉండాలన్నదే తన అభిమతమన్నారు. సోదర భావంతో సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు.
కార్పొరేషన్లు, షెడ్యూలు 9, 10 కింద ఉన్న సంస్థల విభజనపై చర్చించాల్సి ఉందన్నారు. గత ఐదేళ్లలో జగన్ దుష్పరిపాలన కారణంగా ఏపీకి సరిదిద్దలేనంత నష్టం జరిగిందని, అమరావతి, పోలవరం విధ్వంసానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ఆయన వస్తారేమోనని కొందరు భయపడుతున్నారని.. ముఖ్యంగా ఆ భూతాన్ని చూసి రాష్ట్రానికి వచ్చేందుకు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని తెలిపారు. అయితే దానిని ఎలా నియంత్రించాలో తమకు తెలుసని.. దాని గురించి భయపడాల్సిన అవసరం లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే ప్రధాన ఎజెండాగా తన రెండ్రోజుల ఢిల్లీ పర్యటన సాగిందన్నారు.