Share News

CM Chandrababu Naidu : పోలవరానికి..త్వరగా నిధులివ్వండి

ABN , Publish Date - Aug 17 , 2024 | 05:43 AM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కోరారు.

CM Chandrababu Naidu : పోలవరానికి..త్వరగా నిధులివ్వండి

  • ఢిల్లీలో జలశక్తి మంత్రి పాటిల్‌తో చర్చలు

  • డయాఫ్రం వాల్‌ను గతంలో నిర్మించిన సంస్థకే కొత్త వాల్‌ నిర్మాణ పనులు

  • ఒకే ఏజెన్సీ ఉంటే బాధ్యత ఉంటుంది

  • అందుకే పాత సంస్థకే వాల్‌ బాధ్యత: సీఎం

  • నేడు ప్రధాని మోదీతో సమావేశం

  • నిర్మలా సీతారామన్‌, అమిత్‌షాలతో కూడా

న్యూఢిల్లీ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కోరారు. లేదంటే మరో సీజన్‌ కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. శుక్రవారమిక్కడ శ్రమశక్తి భవన్‌లో కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావుతో కలిసి సీఎం ఆయనతో సమావేశమయ్యారు.

పోలవరంపై సుమారు 50 నిమిషాలు కూలంకషంగా చర్చించారు. 2014-19 మధ్య ప్రాజెక్టును 70 శాతం పూర్తి చేశామని చంద్రబాబు గుర్తుచేశారు. తమ ప్రభుత్వమే కొనసాగి ఉంటే 2025కల్లా ప్రాజెక్టు పూర్తవడానికి ఆస్కారం ఉండేదన్నారు.

అయితే 2019లో వచ్చిన జగన్‌ ప్రభుత్వ అవగాహనరాహిత్యంతో తీరని నష్టం జరిగిందని తెలిపారు. ‘పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జలసంఘం హెచ్చరించినా వినకుండా రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లారు. కాంట్రాక్టులను ఏకపక్షంగా రద్దు చేశారు. కాంట్రాక్టరును మార్చడం వల్లే పనుల్లో జాప్యం జరిగింది. 13 నెలల కాలం పనులు చేయకపోవడం వల్ల ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తికాలేదు. దీంతో డయాఫ్రం వాల్‌ దెబ్బతింది.

ఐఐటీ (హైదరాబాద్‌) నిపుణులు, కాగ్‌ ఇచ్చిన నివేదికలోనూ ఇదే చెప్పారు. పాత ఏజెన్సీనే కొనసాగించి ఉంటే 2019 జూన్‌ నుంచి జూలై నాటికి ఎగువ కాఫర్‌ డ్యాం పూర్తయి ఉండేది. ఈసారి ఆ తప్పిదాలు పునరావృతం కాకుండా చూస్తున్నాం.


గతంలో డయాఫ్రం వాల్‌ నిర్మించిన సం స్థకే కొత్త వాల్‌ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయిం చాం. ఒకే ఏజెన్సీ ఉంటే నిర్మాణంపై బాధ్యత ఉంటుందనేది మా అభిప్రాయం. ప్రాజెక్టు నాణ్యత, భద్రత విషయంలో ఇబ్బంది రాదని భావిస్తున్నాం. జలశక్తి శా ఖ, పీపీఏ సహా అందరూ ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. కొత్త డయాఫ్రంవాల్‌ నిర్మాణానికి అనుగుణంగా యంత్రాలను తరలించాల్సి ఉంటుంది. ఇదే విషయంపై రాష్ట్ర కేబినెట్‌లో చర్చించాం.

కేబినెట్‌ నిర్ణయాన్ని కేంద్రానికి కూడా తెలియజేశాం. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఖర్చు చేసేందుకు ఇన్వె్‌స్టమెంట్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ముందు కొత్త డయాఫ్రం వాల్‌ కట్టాలి. తర్వాత ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌(ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం నిర్మించాలి. కాఫర్‌ డ్యాంలు కొంత తగ్గించి.. సీపేజ్‌ మొ త్తం ఎత్తిపోస్తూ వాల్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. రెండు సీజన్ల కంటే ముందే దీనిని కట్టేస్తే ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పనులు చేపట్టవచ్చు. వరద తగ్గిన వెంటనే మొ దలు పెడితే పనులు కొలిక్కి రావడానికి రెండు సీజన్లు పట్టే అవకాశం ఉంది. త్వరగా నిధులు మంజూరు చేయండి. లేదంటే మరో సీజన్‌ కోల్పోతాం’ అని పాటిల్‌ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లినట్లు సమాచారం.


నేడు ప్రధాని, కేంద్ర మంత్రులతో..

పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణంతోపాటు కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక చేయూత తదితర అంశాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించేందుకు చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వచ్చారు. విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతోపాటు టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. తొలిరోజు జలశక్తి మంత్రిని సీఎం కలిశారు. రెండోరోజు శనివారం ప్రధాని మోదీతో సమావేశమవుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, హోం మంత్రి అమిత్‌ షాలనూ కలువనున్నట్లు సమాచారం.

కృష్ణ చివుకులకు చంద్రబాబు అభినందనలు

ఐఐటీ మద్రాసుకు రూ.228 కోట్లు భారీ విరాళం ఇచ్చిన తెలుగు తేజం కృష్ణ చివుకులను సీఎం చంద్రబాబు అభినందించారు. చివుకుల గురించి టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయులు, కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం రాత్రి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కృష్ణ చివుకులతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు.

Updated Date - Aug 17 , 2024 | 05:43 AM