Election Commission: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై బీజేపీ, కాంగ్రెస్ చీఫ్‌లకు ఈసీ నోటీసు
ABN , Publish Date - Nov 16 , 2024 | 06:20 PM
జార్ఖాండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు నవంబర్ 11న బీజేపీ ఫిర్యాదు చేసినట్టు ఖర్గేకు రాసిన లేఖలో ఈసీ తెలిపింది. ఇదే తరహాలో నడ్డాకు కూడా ఈసీ లేఖ రాసింది.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర (Maharashtra), జార్ఖాండ్ (Jharkhand) అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం చేసుకున్న ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ (Election Commission) చర్యలకు దిగింది. రెండు ప్రత్యర్థి పార్టీలు చేసిన ఫిర్యాదులపై స్పందన తెలియజేయాలంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda), కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge)కు వేర్వేరుగా ఈసీ లేఖలు రాసింది. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట లోగా వారి వివరణను తమముందు ఫైల్ చేయాలని ఆదేశించింది.
జార్ఖాండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు నవంబర్ 11న బీజేపీ ఫిర్యాదు చేసినట్టు ఖర్గేకు రాసిన లేఖలో ఈసీ తెలిపింది. ఇదే తరహాలో నడ్డాకు కూడా ఈసీ లేఖ రాస్తూ, ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని నవంబర్ 13న కాంగ్రెస్ రెండు ఫిర్యాదులు చేసినట్టు తెలిపింది.
ఫిర్యాదులివే...
ఎన్నికలకు సిద్ధమైన మహారాష్ట్రలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ రాజ్యాంగం గురించి తప్పుడు ఆరోపణలు చేశారని, రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేశారని పేర్కొంటూ ఆయనపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. బీజేపీ ప్రతినిధి బృందం నవంబర్ 6న ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలిసిందని, రాహుల్ తన ప్రసంగాల్లో రాష్ట్రాలను ఒకరిపై మరొకరిని ఉసిగొలిపే ప్రయత్నాలు చేశారని, అబద్ధాలు ప్రచారం చేశారని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నవంబర్ 11న మీడియాకు తెలిపారు. కాగా, కాంగ్రెస్ పార్టీ సైతం ఈసీకి రెండు ఫిర్యాదులు చేసింది. ఒకటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాగా, మరొకటి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై చేసింది. మహారాష్ట్ర, జార్ఖాండ్‌లో వీరు తప్పుదారి పట్టించే విభజన ప్రసంగాలు చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. తీవ్రమైన ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడటంపై విచారణ జరపాలని ఈసీని కోరినట్టు జైరాం రమేష్ తెలిపారు. ఈసీకి కాంగ్రెస్‌కు రాసిన లేఖల ప్రతులను కూడా ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
రెండు విడతల జార్ఖాడ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలివిడత నవంబర్ 13న జరుగగా, రెండో విడత నవంబర్ 23న జరగాల్సి ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సైతం ఒకే విడతలో నవంబర్ 20న జరగనున్నాయి. రెండు రాష్ట్రాల కౌంటింగ్ నవంబర్ 23న జరిపి అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు.
ఇవి కూడా చదవండి:
TVK: టీవీకేలో కోటికి చేరిన సభ్యత్వాలు
Viral News: ఘోరంగా మోసపోయిన స్టార్ హీరోయిన్ తండ్రి..
Ajit Pawar: 175 సీట్లు గెలుస్తాం
Read More National News and Latest Telugu News