Share News

National : నీట్‌ పేపర్‌ లీక్‌

ABN , Publish Date - Jun 21 , 2024 | 05:12 AM

నీట్‌ పేపర్‌ లీక్‌ అయ్యింది! ‘‘అబ్బే.. నీట్‌లో ఎలాంటి అక్రమాలూ జరగలేదు, పేపర్‌ లీక్‌ అయ్యిందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు’’ అంటూ కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఎంతగా దాచే ప్రయత్నం చేస్తున్నా నిజాలు దాగట్లేదు.

National : నీట్‌ పేపర్‌ లీక్‌

  • బిహార్‌లో ఒక రోజు ముందే మునిసిపల్‌ ఇంజనీర్‌ చేతికి

  • నితీశ్‌, అమిత్‌ అనే వ్యక్తులతో రూ.32 లక్షలకు ఒప్పందం

  • తన మేనల్లుడు సహా నలుగురి కోసం పేపర్‌ కొనుగోలు

  • మే 4నే ఆ నలుగురినీ పట్నాకు రప్పించి.. బస ఏర్పాట్లు

  • వారిలో ఇద్దరి నుంచి.. రూ.40 లక్షల చొప్పున వసూలు

  • పట్నాకు వచ్చిన అభ్యర్థులకు ప్రభుత్వ అతిథి గృహంలో బస

  • చేయడానికి మాజీ మంత్రి తేజస్వీయాదవ్‌ పీఏ సహకారం!

పట్నా, జూన్‌ 20: నీట్‌ పేపర్‌ లీక్‌ అయ్యింది! ‘‘అబ్బే.. నీట్‌లో ఎలాంటి అక్రమాలూ జరగలేదు, పేపర్‌ లీక్‌ అయ్యిందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు’’ అంటూ కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఎంతగా దాచే ప్రయత్నం చేస్తున్నా నిజాలు దాగట్లేదు. మే 5న నీట్‌ పరీక్ష జరగ్గా.. దానికి ఒకరోజు ముందే.. అంటే మే 4వ తేదీనే ప్రశ్నపత్రం బిహార్‌లోని సికందర్‌ ప్రసాద్‌ యాదవేందు అనే ప్రభుత్వ ఉద్యోగి చేతికి చేరినట్టు రుజువైంది! దానాపూర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో జూనియర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యాదవేందు.. నితీశ్‌ కుమార్‌, అమిత్‌ ఆనంద్‌ అనేఇద్దరు వ్యక్తుల నుంచి ఆ పేపర్‌ను సంపాదించాడు. తన మేనల్లుడు, నీట్‌ అభ్యర్థి అయిన అనురాగ్‌ యాదవ్‌తోపాటు శివనందన్‌ కుమార్‌, అభిషేక్‌ కుమార్‌, ఆయుష్‌ రాజ్‌ అనే మరో ముగ్గురు నీట్‌ అభ్యర్థుల కోసం యాదవేందు ఆ ప్రశ్నపత్రాన్ని రూ.32 లక్షలు పెట్టి కొన్నాడు. అదే ప్రశ్నపత్రాన్ని అతడు.. అభిషేక్‌ కుమార్‌, ఆయు్‌షరాజ్‌కు ఒక్కొక్కరికీ రూ.40 లక్షల చొప్పున విక్రయించాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఈ ఏడుగురూ.. తాము చేసిన నేరాన్ని అంగీకరిస్తూ కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్లు ఇచ్చారు.


దానాపూర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయానికి తాను ఒకసారి ఏదో పనిమీద వెళ్లినప్పుడు అక్కడ తనకు సికిందర్‌ కుమార్‌ యాదవేందుతో పరిచయం అయిందని.. అమిత్‌ ఆనంద్‌ తన కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. తాను ఎలాంటి ప్రవేశ/పోటీ పరీక్ష పేపర్‌ అయినా లీక్‌ చేయగలనని మాటల మధ్య లో అతడికి చెప్పగా.. తనకు తెలిసిన నలుగురైదుగురు నీట్‌కు ప్రిపేర్‌ అవుతున్నారని, వారు ఆ పరీక్షలో ఉత్తీర్ణులయ్యేలా సహకరించాలని యాదవేందు తనను కోరాడని వివరించాడు. అందుకు రూ.30-32 లక్షల దాకా ఖర్చవుతుందని తాను చెప్పగా.. యాదవేందు అందుకు అంగీకరించాడని తెలిపాడు. ఒప్పందం మేరకు తాను పేపర్‌ తేగా.. మే 4న యాదవేందు తన వద్దకు నలుగురు అభ్యర్థులను తీసుకొచ్చాడని వెల్లడించాడు. బిహార్‌, యూపీ, ఝార్ఖండ్‌ తదితర రాష్ట్రాల్లో ప్రవేశ/పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్‌ చేసే సాల్వర్‌ గ్యాంగు ల్లో నితీశ్‌, అమిత్‌ గ్యాంగు కూడా ఒకటి. నీట్‌తోపాటు..

గతంలో బీపీఎ్‌ససీ, యూపీఎ్‌ససీ ప్రశ్నపతాల్రను లీక్‌ చేసిన చరిత్ర వీరికి ఉంది. ఇలా అమిత్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాకే.. రాజస్థాన్‌లోని కోటాలో నీట్‌ పరీక్షకు సిద్ధమవుతున్న తన మేనల్లుణ్ని, మిగతా ముగ్గుర్నీ యాదవేందు మే 4న పట్నాకు రప్పించాడు. అక్కడ నితీశ్‌, అమిత్‌ వారికి ప్రశ్నపత్రంతోపాటు జవాబులు అందజేసి.. సమాధానాలు బట్టీకొట్టడంలో సహకరించారు. ఆ మర్నాడు జరిగిన పరీక్షలో..

అవే ప్రశ్నలు వచ్చినట్టు నలుగురు అభ్యర్థులూ తమ నేరాంగీకా రపత్రాల్లో పేర్కొన్నారు. నితీశ్‌, అమిత్‌ నుంచి నీట్‌ ప్రశ్నపత్రాన్ని యాదవేందు కొనుగోలు చేసినట్టు వెల్లడైన నేపథ్యంలో.. ‘‘వారు ఆ పేపర్‌ ను ఇంకెంతమందికి అమ్మి ఉంటారో? ఎన్ని కోట్లు చేతులు మారి ఉంటాయో? చూడబోతే ఇదేదో చాలా పెద్ద కుంభకోణంలా ఉంది’’ అనే ఆందోళన లక్షలాది మంది అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది.

ఆ నలుగురూ..

తాను కోటాలో నీట్‌కు ప్రిపేర్‌ అవుతుండగా.. తన మేనమామ ఫోన్‌ చేసి ప్రశ్నపత్రం అందినట్టు తెలిపాడని యాదవేందు మేనల్లుడు అనురాగ్‌ యాదవ్‌ తన కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. పరీక్షకు ముందురోజున ఆయన తనకు అమిత్‌ ఆనంద్‌ను, నితీశ్‌కుమార్‌ను పరిచయం చేశాడని.. వారు తనకు ప్రశ్నపత్రం, ఆన్సర్‌ కీ ఇచ్చారని వెల్లడించాడు. మరో విద్యార్థి శివనందన్‌ కుమార్‌.. తమకు యాదవేందుతో కుటుంబపరమైన సంబంధాలు ఉన్నాయని తెలిపాడు. ఆయన తనకు ఫోన్‌ చేసి.. ఒక ఇంటి చిరునామా ఇచ్చి.. మే 4న అక్కడికి రావాల్సిందిగా చెప్పాడని.. అక్కడే తనకు సాల్వర్‌ గ్యాంగ్‌ సభ్యులైన నితీశ్‌ కుమార్‌, అమిత్‌ ఆనంద్‌ పరిచయమయ్యారని వివరించాడు.


మిగతా ఇద్దరు అభ్యర్థులైన అభిషేక్‌ కుమార్‌, ఆయు్‌షరాజ్‌ తండ్రులు అవధేష్‌కుమార్‌, అఖిలేష్‌ కుమార్‌.. తాము యాదవేందుకు రూ.40 లక్షల చొప్పున ఇచ్చినట్టు పోలీసులకు వెల్లడించా రు. ‘నీట్‌ ప్రశ్నపత్రం ఇచ్చినందుకుగాను.. యాదవేందుకు నేను రెండు బ్లాంక్‌ చెక్కులు ఇచ్చాను. రూ.40 లక్షలకు మాకు ఒప్పందం కుదిరింది’ అని అవధేష్‌ కుమార్‌ లిఖితపూర్వకంగా తెలిపారు.

తేజస్వీ యాదవ్‌ పీఏ ప్రమేయం..

ముందుగానే అందిన ప్రశ్నపత్రం కోసం మే 4వ తేదీన పట్నాకు చేరుకున్న తన మేనల్లుడు, సోదరికి, మిగతా ముగ్గురు అభ్యర్థులకు వసతి కల్పించడంలో తాను సాయం చేశానని సికందర్‌ ప్రసాద్‌ యాదవేందు తన కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. ‘‘నా మేనల్లుడు అనురాగ్‌ యాదవ్‌ తన తల్లి రీనాకుమారితో కలిసి పట్నాకు వచ్చాడు. పట్నా జూ, ఎయిర్‌పోర్టుకు సమీపంలోని ఒక ప్రభుత్వ అతిథిగృహంలో వారు బస చేయడానికి నేను ఏర్పాట్లు చేశాను’’ అని యాదవేందు పేర్కొన్నాడు. దీన్ని ధ్రువీకరించుకునేందుకు జాతీయ మీడియా ఆ గెస్ట్‌హౌస్‌ వద్దకు వెళ్లి ఆరా తీయగా.. వారి బసకు బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ పీఏ ప్రీతమ్‌ కుమార్‌ సిఫారసు చేసినట్టు బిల్‌ పుస్తకాల్లో నమోదైన వివరాల ద్వారా వెల్లడైంది.

పేపర్‌ లీక్‌ అయినా.. వచ్చింది 185 మార్కులే!

మేనమామ అక్షరాలా రూ.32 లక్షలకు నీట్‌ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేశాడు! ఒకరోజు ముందే.. మేనల్లుడికి ఆ ప్రశ్నపత్రాన్ని, దాంతోపాటు జవాబులను ఇచ్చి బట్టీ కూడా కొట్టించాడు!! ఇంతా చేస్తే ఆ అభ్యర్థికి నీట్‌లో వచ్చిన మార్కులెన్నో తెలుసా? 720కిగాను.. 185 మార్కులే! బిహార్‌ పోలీసుల అదుపులో ఉన్న అనురాగ్‌ యాదవ్‌ కథ ఇది. పరీక్షకు ముందురోజు రాత్రంతా కూర్చుని సమాధానాలు బట్టీ పట్టినా.. అతడికి 54.84 పర్సైంటైల్‌ స్కోరు మాత్రమే వచ్చింది. ఫిజిక్స్‌లో 85. పర్సంటైల్‌, బయాలజీలో 51 పర్సంటైల్‌ రాగా.. కెమిస్ట్రీలో కేవలం 5 పర్సంటైల్‌ మాత్రమే రావడం గమనార్హం. అతడికి వచ్చిన ఆలిండియా ర్యాంకు 10,51,525 కాగా.. ఓబీసీ కేటగిరీలో 4,67,824 ర్యాంకు వచ్చింది. మిగతా అభ్యర్థుల్లో ఒకరికి 300 మార్కులు.. మరొకరికి 581 మార్కులు.. ఇంకొకరికి 483 మార్కులు వచ్చాయి.

Updated Date - Jun 21 , 2024 | 05:12 AM