Share News

Lok Sabha Elections 2024 : కాంగ్రెస్‌లో మమత చిచ్చు!

ABN , Publish Date - May 20 , 2024 | 08:44 AM

ఇండియా కూటమిలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వ్యవహారం కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతోంది. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, పశ్చిమ బెంగాల్‌ పీసీసీ అధ్యక్షుడు అధీర్‌ రంజన్‌ చౌదరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మమత నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధీర్‌ చౌదరి వైఖరి పట్ల కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే సీరియస్‌ అయ్యారు...

Lok Sabha Elections 2024 : కాంగ్రెస్‌లో మమత చిచ్చు!

  • కూటమిలో టీఎంసీ పాత్రపై ఖర్గే వర్సెస్‌ అధీర్‌

  • అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించాల్సిందే

  • లేదంటే బయటకు వెళ్లిపోవచ్చు: ఖర్గే

  • పార్టీ సేవకుడిగా నా పోరాటాన్ని ఆపలేను

  • మమతా బెనర్జీని సమర్థించలేను: అధీర్‌

కోల్‌కతా, మే 19: ఇండియా కూటమిలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) వ్యవహారం కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతోంది. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, పశ్చిమ బెంగాల్‌ పీసీసీ అధ్యక్షుడు అధీర్‌ రంజన్‌ చౌదరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మమత నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధీర్‌ చౌదరి వైఖరి పట్ల కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే సీరియస్‌ అయ్యారు. ఇండియా కూటమి విషయంలో పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని అల్టిమేటం జారీచేశారు. ఇష్టంలేని వారు వెళ్లిపోవచ్చని హెచ్చరించారు. టీఎంసీ విషయంలో అధీర్‌ చౌదరి వైఖరితో అధిష్ఠానం ఏకీభవించడం లేదన్నారు.


Adhir Vs Mamatha.jpeg

ఖర్గే ఘాటుగా హెచ్చరించినప్పటికీ అధీర్‌ ఏమాత్రం లెక్క చేయలేదు. మమత విషయంలో తన వైఖరి మారదని మరోసారి స్పష్టం చేశారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై తనకు నమ్మకం లేదని, ఆమె బీజేపీవైపు వెళ్లవచ్చని కాంగ్రెస్‌ నేత అధీర్‌ చౌదరి చేసిన వ్యాఖ్యలపై ఖర్గే స్పందించారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ అధిష్ఠానమే తప్ప అధీర్‌ కాదని స్పష్టం చేశారు. ‘ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తానని మమత బెనర్జీ చెప్పారు. గతంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ హయాంలోనూ కమ్యూనిస్టులు బయటి నుంచి మద్దతిచ్చారు’ అని ఖర్గే గుర్తుచేశారు. అయితే ఇక్కడ నిర్ణయాలు తీసుకునేది అధీర్‌ చౌదరి కాదని.. కూటమి విషయంలో ఏదైనా కాంగ్రెస్‌ అధిష్ఠానమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ఆ నిర్ణయాన్ని అందరూ పాటించాల్సిందేనని, అలా చేయని వారు బయటకు వెళ్లవచ్చని ఘాటుగానే హెచ్చరించారు. ముంబైలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఖర్గే స్పందిస్తూ.. మమత ఇండియా కూటమిలో భాగమేనని అన్నారు.

ఎవరు చెప్పినా వినను: అధీర్‌

ఇండియా కూటమిలో మమత పాత్రపై ఖర్గే స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ.. టీఎంసీ అధినేత్రిపై కాంగ్రెస్‌ నేత అధీర్‌ చౌదరి విమర్శలు కొనసాగించారు. ఎవరు ఏం చెప్పినా.. సీఎం మమత, ఆమె పార్టీపై విమర్శలు కొనసాగిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. తనను, కాంగ్రెస్‌ పార్టీని అంతం చేయాలనుకున్న మమత గురించి తాను సానుకూలంగా మాట్లాడలేనని తేల్చిచెప్పారు. ‘పార్టీ సేవకుడిగా నా పోరాటాన్ని ఆపలేను. ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు. టీఎంసీకి వ్యతిరేకంగా నా ఈ పోరాటం సైద్ధాంతిక పోరాటం. బెంగాల్‌లో పార్టీని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. రాష్ట్రంలో టీఎంసీ, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి’ అని అన్నారు.


Malli-Karjuna-Kharge.jpg

బెంగాల్‌లో ఖర్గే పోస్టర్లు ధ్వంసం

పశ్చిమ బెంగాల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అధీర్‌ చౌదరిపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మండిపడిన మరుసటి రోజే.. ఆ రాష్ట్రంలో ఖర్గే పోస్టర్లు ధ్వంసమయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట ఖర్గే పోస్టర్లు, హోర్డింగులపై నల్ల రంగు పూసిన గుర్తు తెలియని వ్యక్తులు.. వాటిపై ‘తృణమూల్‌ కాంగ్రెస్‌ ఏజెంట్‌’ అని రాశారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగి ఉండొచ్చని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌ అగ్రనేతలు, అధీర్‌ చౌదరి మధ్య విభేదాలు సృష్టించాలనే ఉద్దేశంతో టీఎంసీనే ఈ పని చేసి ఉంటుందని కాంగ్రెస్‌ నేత ఒకరు ఆరోపించారు. ప్రస్తుతం బహరంపూర్‌లో ఉన్న అధీర్‌ చౌదరి కూడా ఈ సంఘటనపై అసంతృప్తి వ్యక్తం చేశారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారని పేర్కొన్నారు.


Akhilesh-Yadav.jpg

యూపీలో బీజేపీకి ఒక్క సీటే

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఒకే ఒక్క స్థానంలో గెలుస్తుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. అలహాబాద్‌ లోక్‌సభ స్థానం ఇండియా కూటమి అభ్యర్థి, కాంగ్రెస్‌ నేత ఉజ్వల్‌ రమణ్‌ సింగ్‌కు మద్దతుగా ప్రయాగ్‌రాజ్‌లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌ గాంధీతోపాటు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ కూడా పాల్గొన్నారు. ఈ ర్యాలీలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. ‘మీరు ఇది విన్నారా? నరేంద్రమోదీ బీజేపీ కోసం ఉత్తరప్రదేశ్‌లో క్యోటో(వారాణసీ) సీటును మాత్రమే గెలుస్తున్నారు’ అని అన్నారు. వారాణసీని జపాన్‌లోని సుందర నగరం క్యోటోలా తీర్చిదిద్దుతానని ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను రాహుల్‌ ఎద్దేవా చేశారు. అంతకుముందు అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. కరోనా టీకాతో ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టిన బీజేపీ ఇప్పుడు రాజ్యాంగంపై దాడి చేస్తోందని ఆరోపించారు. ఇదిలా ఉండగా, ప్రయాగ్‌రాజ్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ఫూల్‌పూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో తొక్కిసలాట జరిగింది. రాహుల్‌ గాంధీ, అఖిలేష్‌ యాదవ్‌ ఇద్దరు ఈ సభకు హాజరవ్వగా ఇరుపార్టీల కార్యకర్తలు వేదిక దగ్గరకు వచ్చేందుకు యత్నించడంతో తొక్కిసలాట జరిగింది. కార్యకర్తలు, అభిమానులు ప్రశాంతంగా ఉండాలని రాహుల్‌, అఖిలేష్‌ పలుమార్లు కోరినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో చేసేది లేక ఎలాంటి ప్రసంగం చేయకుండానే ఇరువురు నేతలు సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలోని ముంగారీకి వెళ్లిన వారికి అక్కడ కూడా ఇదే అనుభవం ఎదురైంది. ముంగారీలో సభలో తోపులాట జరిగింది.

Rahul-Gandhi-Selfie.jpg

‘ఇండియా’ అధికారంలోకి రాగానే సీబీఐ, ఈడీలకు తాళాలు!

ప్రతిపక్ష ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రాగానే సీబీఐ, ఈడీ కార్యాలయాలకు తాళాలు వేయాలని తాను ప్రతిపాదిస్తానని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ చెప్పారు. ఒక ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సీబీఐ, ఈడీ మూతపడాల్సిందే. ఎవరైనా మోసానికి పాల్పడితే నిగ్గు తేల్చడానికి ఐటీ శాఖ ఉంది. ఇక సీబీఐ ఎందుకు? ప్రతి రాష్ట్రానికీ అవినీతి నిరోధక శాఖ ఉంది. అవసరమైతే దాన్ని ఉపయోగించుకోవచ్చు. బీజేపీ రాజకీయ ప్రత్యర్థులపైకి మాత్రమే కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా, కూల్చాలన్నా వాటిని వినియోగిస్తున్నారు. సీబీఐ, ఈడీలను ప్రయోగించి బీజేపీ ఏ విధంగా దోపిడీకి పాల్పడిందో ఎన్నికల బాండ్ల వ్యవహారం బట్టబయలు చేసింది’ అని అఖిలేశ్‌ యాదవ్‌ వివరించారు.

Updated Date - May 20 , 2024 | 08:44 AM