NDA vs INDIA: త్వరలోనే అధికారంలోకి ఇండియా కూటమి.. బీజేపీ ప్రభుత్వం ఒక్కరోజు కూడా..
ABN , Publish Date - Jun 08 , 2024 | 08:53 PM
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరికొన్ని గంటల్లోనే మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసేందుకు...
బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరికొన్ని గంటల్లోనే మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసేందుకు నరేంద్ర మోదీ (Narendra Modi) రెడీ అవుతున్నారు. ఇలాంటి తరుణంలో.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ చట్టవిరుద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని.. కొన్నిసార్లు ప్రభుత్వాలు కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంటాయని కుండబద్దలు కొట్టారు. భవిష్యత్తులో ఇండియా కూటమి తప్పకుండా కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఆమె జోస్యం చెప్పారు.
Read Also: నితీశ్ కుమార్‌కి ప్రధాని పదవి ఆఫర్?
శనివారం తృణమూల్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల ర్యాలీల్లో ‘అబ్‌కీ బార్ 400 పార్’ అని ప్రచారం చేసిన బీజేపీ.. కనీసం సాధారణ మెజారిటీ మార్క్‌ని (272) కూడా అందుకోలేకపోయింది. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనంత మాత్రాన ఏమీ జరగదని అనుకోకండి. ఎందుకంటే.. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కచ్ఛితంగా ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే.. కొన్నాళ్లు వారిని (బీజేపీని ఉద్దేశిస్తూ) అధికారంలో ఉండనివ్వండి. కొన్నిసార్లు ప్రభుత్వాలు ఒక్క రోజు మాత్రమే ఉంటాయి. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. ప్రస్తుత ప్రభుత్వం 15 రోజుల వరకైనా ఉంటుందో ఉండదో ఎవరికి తెలుసు?’’ అని చెప్పుకొచ్చారు.
Read Also: ప్లేటు తిప్పేసిన దేవేంద్ర ఫడ్నవిస్.. చివరి నిమిషంలో యూ-టర్న్
బీజేపీ అప్రజాస్వామికంగా, చట్టవిరుద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రంలో ఈ బలహీనమైన, అస్థిరమైన ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోతే.. తాను చూసి సంతోషిస్తానని పేర్కొన్నారు. దేశానికి మార్పు కావాలని, దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ప్రస్తుత పరిస్థితి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఉందని, కాబట్టి ఆయన ఈసారి ప్రధాని కాకూడదని సూచించారు. అంతేకాదు.. ఆదివారం సాయంత్రం జరగబోయే మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా తాను హాజరుకానని తేల్చి చెప్పారు. అప్రజాస్వామికంగా ఏర్పడుతున్న ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పలేమని, వాళ్లు మళ్లీ పార్టీలను చీల్చేందుకు ప్రయత్నిస్తారని ఆరోపించారు.
Read Latest National News and Telugu News