Viral Video: ట్రైన్ పట్టుకొని స్టంట్ చేశాడు.. కాలు, చెయ్యి పోగొట్టుకున్నాడు
ABN , Publish Date - Jul 27 , 2024 | 05:48 PM
సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం కొందరు యువతీ, యువకులు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తుంటారు. కొంచెం తేడా కొట్టినా ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ.. లైక్స్ & వ్యూస్ కోసం బరితెగిస్తుంటారు.
సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవ్వడం కోసం కొందరు యువతీ, యువకులు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తుంటారు. కొంచెం తేడా కొట్టినా ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ.. లైక్స్ & వ్యూస్ కోసం బరితెగిస్తుంటారు. అయితే.. ఇలాంటి స్టంట్స్ చేసి ఎందరో తమ ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు.. చావు అంచులదాకా వెళ్లి తిరిగొచ్చారు. ఇప్పుడు ఓ యువకుడు తన కాలితో పాటు ఒక చెయ్యి కోల్పోయాడు. ఒక రైల్వే స్టేషన్‌లో కదులుతున్న ట్రైన్‌ని పట్టుకొని అతడు ఓ స్టంట్ చేయడానికి ప్రయత్నించగా.. ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు.. ప్రమాదకరమైన స్టంట్లు చేయడం మానుకోవాలని అవగాహన కల్పిస్తూ, అతనితో ఓ వీడియో చేయించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Read Also: అక్కడ సీన్ రివర్స్.. భార్యలే తమ భర్తలకు..
రైల్వే స్టేషన్‌లో ప్రమాదకరమైన స్టంట్
కొన్ని రోజుల క్రితం ఫర్హాత్ ఆజమ్ షేక్ (Farhat Azam Sheikh) అనే యువకుడు ముంబైలోని సెవ్రీ రైల్వే స్టేషన్‌లో ఒక స్టంట్ చేశాడు. కదులుతున్న రైలుని పట్టుకొని, స్టేషన్‌పై జారుకుంటూ కొంత దూరం వరకూ వెళ్లాడు. చివరకు ప్లాట్‌ఫామ్ ముగిశాక.. అతడు రైలులోకి ఎక్కేశాడు. ఈ విన్యాసాన్ని ఫోన్‌లో రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. నెట్టింట్లో ఆ వీడియో వైరల్ అవ్వడంతో.. అది పోలీసుల దృష్టికి చేరింది. దీంతో.. వాళ్లు కేసు నమోదు చేసి, ఆ యువకుడి ఆచూకీ కోసం గాలించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆ కుర్రాడు ఎవడు? ఎక్కడుంటాడు? అనే వివరాలు తెలిశాయి. దాంతో.. అతడ్ని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లారు. తీరా చూస్తే.. ఆ యువకుడు ఒక కాలు, ఒక చెయ్యి కోల్పోయిన స్థితిలో కనిపించాడు. ఇదెలా జరిగిందని అధికారులు ప్రశ్నించగా.. ఏప్రిల్ నెలలో కూడా తాను రైల్వే స్టేషన్‌లో మరో విన్యాసం చేశానని, అప్పుడు అనుకోకుండా ప్రమాదం జరగడంతో కాలు, చెయ్యి పోగొట్టుకున్నానని వివరణ ఇచ్చాడు.
Read Also: ఒకే ట్రాక్‌పై నాలుగు రైళ్లు.. చివరకు దిమ్మతిరిగే ట్విస్ట్!
అవగాహన కోసం
ఈ నేపథ్యంలోనే పోలీసులు.. ఫర్హాత్ ఆజమ్‌తో ఓ అవగాహన వీడియో చేయించారు. ఈమధ్య వైరల్ అవుతున్న తన వీడియో మార్చిలో చేసినదని, ఏప్రిల్ నెలలోనూ అలాంటి విన్యాసమే చేసేందుకు ప్రయత్నించానని అన్నాడు. కానీ.. దురదృష్టవశాత్తూ స్టంట్ చేసే సమయంలో ప్రమాదం చోటు చేసుకుందని, దాంతో తన కాలితో పాటు చెయ్యి కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కాబట్టి.. దయచేసి ఎవ్వరూ ఇలాంటి స్టంట్లు చేయొద్దని, లేకపోతే తనలాంటి పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుందని సందేశం ఇచ్చాడు. ఈ ఘటనపై సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ మాట్లాడుతూ.. యువత ప్రమాదకర స్టంట్లు చేయకుండా నివారించేందుకు తాము ఫర్హాత్ ఆజమ్ ఘటన ద్వారా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఎవరైనా ఇలాంటి స్టంట్లు చేస్తే.. వెంటనే 9004410735 లేదా 139 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.
Read Latest National News and Telugu News