Share News

NITI Aayog meeting: మమత మైక్ కట్ చేయడంలో నిజం ఎంత? ఎవరేం చెప్పారు?

ABN , Publish Date - Jul 27 , 2024 | 05:12 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన 'నీతి ఆయోగ్' సమావేశంలో తాను మాట్లాడుతుండగా 'మైక్' కట్ చేశారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణల్లో నిజం ఎంత? ఇందులో ఎంతమాత్రం నిజం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మమత వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ సైతం నిర్ధారించింది.

NITI Aayog meeting: మమత మైక్ కట్ చేయడంలో నిజం ఎంత? ఎవరేం చెప్పారు?

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన 'నీతి ఆయోగ్' (NITI Aayog) సమావేశంలో తాను మాట్లాడుతుండగా 'మైక్' కట్ చేశారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) చేసిన ఆరోపణల్లో నిజం ఎంత? ఇందులో ఎంతమాత్రం నిజం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వెల్లడించారు. మమత వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ (PIB Fact Check) సైతం నిర్ధారించింది.


మమత ఏమన్నారు?

నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన కొద్ది సేపటికే మమతా బెనర్జీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, విపక్షాల నుంచి నీతి ఆయోగ్ సమావేశానికి తాను ఒక్కరినే హాజరయ్యాయని, కేంద్రం వివక్షా పూరితంగా వ్యవహరించిందని చెప్పారు. పలువురు సీఎంలు ఎక్కువ సేపు మాట్లాడారని, తాను మాట్లాడుతుండగా మాత్రం 5 నిమిషాలకే మైక్ కట్ చేశారని ఆరోపించారు.

NITI Aayog: నీతి ఆయోగ్ సమావేశం నుంచి మమతా బెనర్జీ వాక్ అవుట్


నిజం లేదన్న నిర్మలా సీతారామన్

తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ చేసిన ఆరోపణల్లో నిజం లేదని నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ''నీతి ఆయోగ్ సమావేశానికి మమతా బెనర్జీ హాజరయ్యారు. ప్రతి ముఖ్యమంత్రికి మాట్లాడేందుకు నిర్దిష్ట సమయం కేటాయించారు. ప్రతి టేబుల్ ముందన్న స్క్రీన్‌పై అది డిస్‌ప్లే అవుతుంటుంది. ఆమె తన మైక్ కట్ చేసినట్టు మీడియాతో చెప్పారు. ఇది పూర్తిగా తప్పు. ఇందులో ఎంతమాత్రం నిజంలేదు. వాస్తవాన్ని వక్రీకరించ కుండా ఆమె నిజం మాట్లాడాలి'' అని నిర్మలా సీతారామన్ తెలిపారు.


పీఐబీ ఏం చెప్పింది?

కాగా, మమతా బెనర్జీ ఆరోపణలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'లో తెలిపింది. అక్కడ ఏర్పాటు చేసిన 'క్లాక్' ఆమె మాట్లాడాల్సిన సమయం అయిపోయిందని మాత్రమే చూపించిందనీ, కనీసం బెల్ కూడా మోగలేదని పేర్కొంది. అక్షరక్రమం ప్రకారం లంచ్ తరువాత సీఎం వంతు వచ్చిందని, ఆమె త్వరగా వెళ్లిపోవాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం చేసిన అధికారిక విజ్ఞప్తితో ఆమెను ఏడో స్పీకర్‌గా అకామిడేట్ చేశారని పీబీఐ ఫ్యాక్ట్ చెక్ వివరించింది.


ప్రహ్లాద్ జోషి ఏమన్నారంటే..

సమావేశంలో ఏమి జరిగిందో తాను చూడలేదని కేంద్ర మంత్రి ప్లహ్లాద్ జోషి చెప్పారు. అయితే, పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ ఒక్క సీటు కూడా ఇవ్వనందున 'ఇండియా' అలయెన్స్ అనేది అసలు అలయెన్సే కాదని అన్నారు. ప్రజాతీర్పును జీర్ణించుకోలేకనే ఇలాంటి రాద్ధాంతాలు చేస్తున్నారని విమర్శించారు.

Read more National News and Telugu News

Updated Date - Jul 27 , 2024 | 05:13 PM