Cracks On Atal Setu: అటల్ సేతుకి పగుళ్లు వచ్చాయా? అసలేం జరిగింది?
ABN , Publish Date - Jun 22 , 2024 | 12:21 PM
అటల్ సేతు (ముంబై ట్రాన్స్-హార్బర్ లింక్(MTHL)) రోడ్డుపై పగుళ్ల వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా రచ్చ క్రియేట్ చేస్తోంది. అటల్ సేతు(Atal Setu) నిర్మించిన మూడు నెలలకే పగుళ్లు వచ్చాయంటూ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే అటల్..
ముంబై, జూన్ 22: అటల్ సేతు (ముంబై ట్రాన్స్-హార్బర్ లింక్(MTHL)) రోడ్డుపై పగుళ్ల వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా రచ్చ క్రియేట్ చేస్తోంది. అటల్ సేతు(Atal Setu) నిర్మించిన మూడు నెలలకే పగుళ్లు వచ్చాయంటూ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే అటల్ సేతుపై పగుళ్లు వచ్చాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అటల్ సేతు సముద్ర వంతెన నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని.. ఇందుకు నిదర్శనమే ఈ పగుళ్లు అని ఆరోపించారు. రూ. 18,000 కోట్లతో ప్రారంభించిన ఈ బ్రిడ్జి.. మూడు నెలల్లో పగుళ్లు రావడం దారుణం అన్నారు.
ఖండించిన బీజేపీ, ఎంఎంఆర్‌డీఏ..
అయితే, ఈ ఆరోపణలను బీజేపీతో పాటు.. ప్రాజెక్టు నోడల్ ఏజెన్సీ అయిన ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MMRDA) ఖండించింది. ఈ పగుళ్లు బ్రిజ్జిపై ఏర్పడినవి కావన్నారు. నవీ ముంబైలోని ఉల్వే నుంచి వచ్చే అప్రోచ్ రోడ్డుపై ఈ పగుళ్లు ఏర్పాడ్డాయని స్పష్టం చేశారు. ‘ఎంటీహెచ్ఎల వంతెనపై పగుళ్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పగుళ్లు బ్రిడ్జిపై ఏర్పడలేదు. ఉల్వే నుంచి ముంబై వైపు ఎంటీహెచ్ఎల్ ని కలిపే అప్రోచ్ రోడ్డుపై ఈ పగుళ్లు ఉన్నాయి.’ అని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
దుష్ప్రచారం ఆపండి..
అటల్ సేతుపై పగుళ్లు ఏర్పడ్డాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ‘అటల్ సేతుపై దుష్ప్రచారం ఆపండి’ అంటూ బీజేపీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అటల్ సేతుకు ఎలాంటి ప్రమాదం లేదని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. అబద్ధాలతో గందరగోళం సృష్టించడానికి కాంగ్రెస్ చేస్తున్న కుట్ర ఇది అని మండిపడ్డారు.
‘అటల్ సేతుపై ఎలాంటి పగుళ్లు లేవు.. అటల్ సేతుకు ఎలాంటి ప్రమాదం లేదు.. అప్రోచ్ రోడ్డుపై పగుళ్లు ఏర్పడ్డాయి. అబద్ధాలతో బురదజల్లాలని కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలిక ప్రణాళికలు చేసుకుందని స్పష్టం అవుతుంది. ఎన్నికల సమయంలో రాజ్యాంగ సవరణలు, ఎన్నికల తర్వాత ఫోన్‌ల ద్వారా ఈవీఎంలను అన్‌లాక్ చేయడం, ఇప్పుడు ఇలాంటి అబద్ధాలతో దేశ ప్రజలను తప్పుదోవపట్టించే పని పెట్టుకుంది’ అని కాంగ్రెస్ తీరుపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు.
‘ఇది సర్వీస్ రోడ్డు. ప్రధాన వంతెనకు అనుసంధానించే భాగం. ఇవి చిన్నపాటి పగుళ్లు మాత్రమే. మరమ్మతులు చేపడుతున్నారు. దీని వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు.’ అని అటల్ సేతు ప్రాజెక్ట్ హెడ్ కైలాష్ గణత్రా ప్రకటించారు. కాగా, ఈ అటల్ సేతు ప్రాజెక్టును రూ. 17,840 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ ఆరు లేన్ల వంతెన సముద్రం మీద 16.5 కిలోమీటర్ల సెక్షన్‌తో 21.8 కి.మీ పొడవు ఉంది.