Share News

Supreme Court: ‘నీట్‌’ గ్రేస్‌ మార్కులు రద్దు చేశాం

ABN , Publish Date - Jun 14 , 2024 | 03:25 AM

ఈ ఏడాది నీట్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రాల వద్ద సమయాన్ని కోల్పోయిన 1563 మంది అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్‌ మార్కులను ఉపసంహరించుకున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది.

Supreme Court: ‘నీట్‌’ గ్రేస్‌ మార్కులు రద్దు చేశాం

ఆ 1563 మంది మళ్లీ పరీక్ష రాయొచ్చు.. 23న పరీక్ష.. 30న

ఫలితాలు

మళ్లీ పరీక్ష రాయడానికి ఇష్టపడనివారు అసలు మార్కులతో

కౌన్సెలింగ్‌కెళ్లొచ్చు

సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం.. కౌన్సెలింగ్‌ నిలిపివేతకు

కోర్టు నిరాకరణ

గ్రేస్‌ మార్కుల ఉపసంహరణతో 67 నుంచి 61కి తగ్గిన

టాప్‌ర్యాంకర్ల సంఖ్య

సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

కౌన్సెలింగ్‌ నిలిపివేతకు సుప్రీం కోర్టు నిరాకరణ

న్యూఢిల్లీ, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది నీట్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రాల వద్ద సమయాన్ని కోల్పోయిన 1563 మంది అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్‌ మార్కులను ఉపసంహరించుకున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది. వారందరికీ జూన్‌ 23న మరోసారి పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన వెకేషన్‌ బెంచ్‌.. కేంద్రం నిర్ణయాన్ని సముచిత నిర్ణయంగా అభివర్ణించింది. జూలై 6 నుంచి పార్రరభం కానున్న నీట్‌-యూజీ కౌన్సెలింగ్‌ను నిలిపివేయడానికి నిరాకరించిన కోర్టు.. వైద్యకళాశాలల్లో అభ్యర్థుల అడ్మిషన్లు నీట్‌ వ్యవహారంపై దాఖలైన కేసుల ఫలితంపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసింది. కేంద్రం, జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది కాను అగర్వాల్‌.. జూన్‌ 23న నిర్వహించే పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్‌ను గురువారమే విడుదల చేయనున్నట్టు ధర్మాసనానికి వెల్లడించారు. ఈ వ్యవహారంపై నియమించిన కమిటీ సిఫారసుల మేరకు.. 1563 మంది అభ్యర్థులకు కలిపిన గ్రేస్‌మార్కులను రద్దు చేసినట్టు పేర్కొన్నారు. వారందరికీ వారి అసలు మార్కుల వివరాలను పంపుతామని.. మళ్లీ పరీక్ష రాయడానికి ఇష్టపడనివారు, తమకు వచ్చిన అసలు మార్కులతోనే కౌ న్సెలింగ్‌కు హాజరు కావొచ్చని స్పష్టం చేశారు. జూన్‌ 23న వీరికి నిర్వహించే పరీక్ష ఫలితాలను 30న ప్రకటిస్తామని వెల్లడించారు. దీనివల్ల.. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఇతర కోర్సుల్లో ప్రవేశానికి జూలై 6న నిర్వహించే కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి వారికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని పేర్కొన్నారు.


ఇక.. నీట్‌లో అవకతవకలపై కోర్టును ఆశ్రయించిన ‘ఫిజిక్స్‌వాలా’ సంస్థ తరఫున ప్రముఖ న్యాయవాది జె.సాయిదీపక్‌ వాదనలు వినిపించారు. మళ్లీ నిర్వహించే పరీక్షను 1563 మంది అభ్యర్థులకు మాత్రమే పరిమితం చేయకుండా.. అదే కారణంతో నష్టపోయి, కోర్టుకు రాలేకపోయినవారందరికీ ఆ అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కానీ.. కోర్టు ఆయన అభ్యర్థనను తిరస్కరించి, తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది.

కాగా.. గ్రేస్‌ మార్కులను ఉపసంహరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో నీట్‌ టాపర్ల సంఖ్య 67 నుంచి 61కి తగ్గింది. గ్రేస్‌ మార్కులు పొందినవారిలో ఆరుగురు ఈ టాపర్ల జాబితాలో ఉన్నారు. వారికి అదనంగా కలిపిన మార్కులు తీసేయడంతో టాపర్ల జాబితాలో వారికి చోటు లేకుండా పోయింది. 1523 మందిలో ఎంతమంది మళ్లీ పరీక్ష రాస్తారో తెలిశాకనే సవరించిన టాపర్ల జాబితాను విడుదల చేస్తామని ఎన్టీయే అధికారి ఒకరు తెలిపారు.

బాధ్యతారాహిత్యమే..: కాంగ్రెస్‌

నీట్‌ నిర్వహణలో అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కాంగ్రె్‌సపార్టీ గురువారం మరోసారి డిమాండ్‌ చేసింది. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉన్న ఆగ్రహం పార్లమెంటులో కూడా ప్రతిధ్వనిస్తుందని హెచ్చరించింది. ఈ వ్యవహారంలో బీజేపీ తీరు బాధ్యతారహితంగా ఉందని మండిపడ్డ కాంగ్రెస్‌.. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ జనరల్‌ను తొలగించాలని డిమాండ్‌ చేసింది. పేపర్‌లీకులు, రిగ్గింగుల ద్వారా మోదీ సర్కారు గడిచిన పదేళ్లలో కోట్లాది మంది యువత భవిష్యత్తును నాశనం చేసిందని కాంగ్రెస్‌ జాతీయ అద్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ‘‘ఈ వ్యవహారంలో కేంద్రం తన బాధ్యతను ఎన్టీయే భుజాలపైకి నెట్టేసి తప్పించుకోజాలదు. నీట్‌ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి. లేదంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పక్షపాత విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ కోరుతోంది. దోషులకు కఠిన శిక్ష విధించాలి. ఏడాది కాలాన్ని కోల్పోయిన లక్షలాది మంది విద్యార్థులకు పరిహారం ఇవ్వాలి’’ అని ఖర్గే ట్వీట్‌ చేశారు.


ఇక.. గ్రేస్‌ మార్కుల ఉపసంహరణ నిర్ణయం సరేగానీ.. అసలు, వాటిని తొలుత ఎందుకు కలిపారో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ డిమాండ్‌ చేశారు. నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ అయిందా? లేదా? తెలపాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ను, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను ఆయన ప్రశ్నించారు. 2019 నుంచి గత ఏడాది దాకా ఏ సంవత్సరంలోనూ నీట్‌లో ముగ్గురికి మించి టాపర్లు లేరని.. అలాంటిది ఈ ఏడాది 67 మంది టాపర్లు ఎలా వచ్చారని ఆయన నిలదీశారు. విపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ తోసిపుచ్చారు. పేపర్‌ లీక్‌ అయిందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని ఆయన స్పష్టం చేశారు. 1563 మందికి గ్రేస్‌ మార్కులు కూడా అల్లాటప్పాగా ఇవ్వలేదని.. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఫార్ములా ఆధారంగా ఇచ్చినవేనని ఆయన వెల్లడించారు.

Updated Date - Jun 14 , 2024 | 03:25 AM