Share News

West Bengal: మహువానా? మహారాణా?

ABN , Publish Date - May 11 , 2024 | 05:03 AM

రాజకీయ సంచలనం ఒకరు.. రాచరిక విలక్షణ వారసురాలు మరొకరు. ఒకరు అత్యాధునిక వేషభాషలు, నవీన భావాలకు ప్రతినిధి అయితే, మరొకరు జాతీయ సంప్రదాయాలకు, మూల విలువలకు పెట్టింది పేరు. ఇద్దరు మహిళలు ఎన్నికల బరిలో దిగడం మామూలే అయినా, ఈ ఇద్దరి నేపథ్యాల రీత్యా పశ్చిమబెంగాల్‌ సరిహద్దు జిల్లా నడియాలోని లోక్‌సభ స్థానం కృష్ణానగర్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

West Bengal: మహువానా? మహారాణా?

  • ఇద్దరు మగువల రణ వేదిక కృష్ణానగర్‌

రాజకీయ సంచలనం ఒకరు.. రాచరిక విలక్షణ వారసురాలు మరొకరు. ఒకరు అత్యాధునిక వేషభాషలు, నవీన భావాలకు ప్రతినిధి అయితే, మరొకరు జాతీయ సంప్రదాయాలకు, మూల విలువలకు పెట్టింది పేరు. ఇద్దరు మహిళలు ఎన్నికల బరిలో దిగడం మామూలే అయినా, ఈ ఇద్దరి నేపథ్యాల రీత్యా పశ్చిమబెంగాల్‌ సరిహద్దు జిల్లా నడియాలోని లోక్‌సభ స్థానం కృష్ణానగర్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వీరిలో ఒకరు తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకురాలు మహువా మొయిత్రా. మరొకరు రాజమాత అమృతరాయ్‌. మహువా బహిష్కరణకు గురైన సిటింగ్‌ ఎంపీ. బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలతో కొంతకాలంగా పతాక శీర్షిక వార్తల్లో ఉంటున్నారు. టీఎంసీ ఆమెకు మళ్లీ కృష్ణానగర్‌ను స్థానాన్నే కేటాయించింది. అయితే, మహువాను చట్టసభలో అడుగుపెట్టనీయరాదని బీజేపీ అధిష్ఠానం అంతే గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆమెకు దీటైన అభ్యర్థి కోసం గాలించింది. అనూహ్యంగా బెంగాల్‌ సమాజంలో గొప్ప గౌరవమర్యాదలు కలిగిన కృష్ణానగర్‌ రాజ వంశానికి చెందిన రాజమాత అమృతరాయ్‌ను తెరపైకి తెచ్చింది. రాజమాతగా పిలిచే అమృత రాయ్‌ను బీజేపీ బరిలోకి దించడంతో ఫోకస్‌ మహువా నుంచి కొంత అమృత వైపు మళ్లింది.


చరిత్రకు కొత్తగా సాన..

రాజకీయాలకు అమృత కొత్త. చెరగని రాచవంశ ప్రతిష్ఠే ప్రచారంలో మహువాకు దీటుగా ఆమెను నిలిపే అంశం. ఆమెను ఎదుర్కొనేందుకు తృణమూల్‌ ఇప్పుడు చరిత్రను తవ్వే పనిలో ఉంది. కృష్ణానగర్‌ రాజవంశ స్థాపకుడు కృష్ణ చంద్ర రాయ్‌ 1757 ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్‌ పాలకులకు మద్దతుగా నిలిచారని ఆరోపిస్తోంది. జాతి వ్యతిరేక చర్యలతో బ్రిటిష్‌ వలసపాలనకు అనుకూలంగా ఆయన వ్యవహరించారంటూ విమర్శలకు దిగింది. మరోవైపు, ప్రశ్నకు నగదు వ్యవహారంలో మహువా జాతి ప్రయోజనాలకు ద్రోహం చేశారని బీజేపీ ప్రచారం చేస్తోంది. అదే సమయంలో బీజేపీ కక్ష సాధింపు చర్యలకు బలైన మహిళగా, గట్టి బీజేపీ వ్యతిరేకిగా మహువాకు విపక్ష శిబిరంలో మంచి గుర్తింపు ఉంది. దానికితోడు కృష్ణానగర్‌ నుంచి మహువా గెలుపును సీఎం మమత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం కూడా ఆమెకు కలిసిరానుంది. అయితే, అమృతరాయ్‌ను ప్రత్యర్థిగా నిలపడటం, జనంలో ఆ రాజ వంశానికి ఉన్న గౌరవం వంటి అంశాలు మహువాకు సవాల్‌ విసురుతున్నాయి.

Updated Date - May 11 , 2024 | 07:04 AM